– ఇప్పటికీ నెరవేరని హామీలు
– తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలి
– నేడు 8ఏ గని కార్మికుల సంస్మరణ సభ
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 16: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 17 అక్టోబర్, 2003 అంటేనే గుర్తుకు వచ్చేది 8ఏ గని ప్రమాదం… రామగుండం ఏరియాలో మూసివేతకు గురైన జీడీకే.8ఏ బొగ్గు గనిలో 17 అక్టోబర్, 2003న జరిగిన ప్రమాదానికి నేటికి 17ఏండ్లు. గని ప్రమాదంలో 10 మంది కార్మికులు ఒకేసారి మృతి చెందడం ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ముక్తకంఠంతో ఆరోపించాయి.
ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకుంటామని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ఇచ్చిన హామీలు నేటికి నెరవేరలేదని బాధితులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించారు. న్యాయమూర్తి తీర్పును నేటికి కార్మికులకు చేరక పోవడం శోచనీయం. బాధిత కుటుంబాల పక్షాన పోరాడటంలో కార్మిక సంఘాలు కూడా విఫలమయ్యాయి.
గని ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలలోని సభ్యులందరికి ఉచితంగా వైద్యం, చదువు చెప్పిస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదు. కేవలం కార్మికుడి డిపెండెంట్లకు మాత్రమే విద్య, వైద్యం అందిస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
8ఎ గని ప్రమాదంలో మరణించిన కార్మికులు
లంబు మల్లయ్య (సర్దార్), మామిడి మల్లేశ్, మంథని రాజం, పిడుగు కొమురయ్య (టింబర్‌మాన్), మీనుగు చంద్రయ్య, అడప అశోక్ (కోల్‌కట్టర్), కన్నూరి రాయమల్లు, రాగుల నర్సింగారావు, కాశెట్టి నారాయణ, తోట బాపు (కోల్‌ఫిల్లర్స్).
నేడు సంస్మరణ సభ
రామగుండం ఓసీపీ-3 ఆవరణలో వున్న 8ఎ గని ప్రమాదంలో మరణించిన కార్మికుల స్మారకస్థూపం వద్ద శనివారం ఉదయం వివిధ కార్మిక సంఘాలు, బాధిత కుటుంబాల ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.