ప్రజా లక్ష్యం, నల్గొండ : పోలీస్ శాఖలో ఉద్యోగం పొంది పదేళ్ల సర్వీస్ పూర్తి అయిన సందర్బంగా 2009 ఆర్ముడు రిజర్వ్ కానిస్టేబుల్స్ దాతృత్వాన్ని చాటుకున్నారు.
ఆర్ముడు కానిస్టేబుల్స్ గా 2009లో ఎంపికై పది సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న 55 మంది కానిస్టేబుల్స్ తమ తోటివారికి సహాయం చేయడం ద్వారా మానవత్వాన్ని చూపించారు. 2006 సంవత్సరంలో ఎంకౌంటర్ లో మరణించిన హోమ్ గార్డు వింజమూరి లింగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి చేదోడుగా నిలిచి జిల్లా ఎస్పీ రంగనాధ్ చేతుల మీదుగా ఆర్థిక సాయం అందించారు. అదే విధంగా మరో కానిస్టేబుల్ కుటుంబానికి సైతం ఆర్థిక సహాయం అందించారు. స్నేహా అనాధ ఆశ్రమానికి చెందిన విద్యార్థులకు నిత్యావసర సరుకులు అందించి సమాజ సేవలోనూ భాగస్వామ్యం అయ్యారు.
సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రంగనాధ్ చేతుల మీదుగా వీరికి ఆర్థిక సహాయం అందించగా 10 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఎస్పీ చెప్పారు.
కార్యక్రమంలో ఏ.ఆర్. డిఎస్పీ సురేష్ కుమార్, ఆర్.ఐ. వై.వి. ప్రతాప్, 2009 బ్యాచ్ కానిస్టేబుల్స్ మధు, చందు, అమ్జాద్, రామలింగయ్య, లింగుస్వామి, సోమేశ్, వెంకట రమణ, కృష్జ, నరేందర్, నాగరాజు, రఘురామ్, కోటేష్, ఆంజనేయులు, శంకర్, భాస్కర్, స్నేహా అనాధ ఆశ్రమ నిర్వహకురాలు కవిత పాల్గొన్నారు.