– గుండెపోటుతో గుంటూరులో మృతి
– విషాదంలో టాలీవుడ్,
– సినీరంగ ప్రముఖుల సంతాపం
(ప్రజాలక్ష్యం ప్రతినిధి – హైదరాబాద్)
సెప్టెంబర్ 8: ప్రఖ్యాత చలనచిత్ర, రంగస్థల సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి (73) కన్నుమూశారు. కళారంగాన్ని శోకసంద్రంలో ముంచివేశారు. లాక్‌డౌన్ సమయం నుంచి గుంటూరులోనే ఉంటున్న ఆయన మంగళవారం ఉదయం గుండెపోటుతో స్నానాల గదిలోనే కుప్పకూలిపోయారు.
జయప్రకాశ్‌రెడ్డి స్వస్థలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెళ్ల. 1946 మే 8న జన్మించిన ఆయన బ్రహ్మపుత్రుడు చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. పలు చిత్రాల్లో ప్రతినాయకుడు, హాస్యనటుడిగా నటించారు. రాయలసీమ యాసతో చలనచిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు ఉత్తమోత్తమంగా పోషించి, రసజ్ఞ హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
సినిమాల్లో ఎంత తీరికలేకుండా వున్నప్పటికీ రంగస్థలాన్ని మర్చిపోని గొప్ప నటులు జయ ప్రకాష్ రెడ్డి. పరిషత్ పోటీల్లో పాల్గొనడమే గాక, ప్రతి నెలా తన జె.పి.థియేటర్ ద్వారా వర్థమాన సమాజాలవారిని ఆహ్వానించి గుంటూరులో నాటక ప్రదర్శనలు నిర్వహించేవారు. ఒకే ఒక్క పాత్రతో అలెగ్జాండర్ నాటకం ప్రదర్శించి నాటక కళాభిమానులను పులకింపజేశారు.
వారి అకాలమరణానికి కళారంగం దిగ్భ్రాంతి చెందింది. పలువురు సినీరంగ ప్రముఖులు జయప్రకాశ్ రెడ్డికి సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది.