(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్ సెప్టెంబర్ 7: ఎంసెట్, నీట్ పరీక్షలకు పకడ్బంధీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంసెట్, నీట్ పరీక్షలపై జిల్లా అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె.శశాంక మాట్లాడుతూ సెప్టెంబర్ నెలలో 9, 10, 11, 14, 28, 29 వ తేదీలలో ఎంసెట్ పరీక్ష, 13వ తేదీన నీట్ పరీక్ష జరుగుతుందని ఆయన అన్నారు. ఎంసెట్ పరీక్ష ఎస్1 ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందని, పరీక్ష రాసే విద్యార్థులు ఉదయం 7 గంటల వరకు పరిక్షా కేంద్రానికి హాజరు కావాలని అన్నారు. ఎస్2 మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని, పరీక్ష రాసే విద్యార్థులు మధ్యాహ్నం 1 గంటకు పరీక్షా కేంద్రానికి హాజరు కావాలని అన్నారు. కరీంనగర్ జిల్లాలో మొత్తం 5,408 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షా కేంద్రాలలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్లు ఉపయోగించాలాని సూచించారు. ఆశా వర్కర్లు అందుబాటులో ఉండాలని ఆయన తెలిపారు. సెంటర్లకు ఇంచార్జ్ ఉన్నవారు ఈ బాధ్యత వహించాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, అందులో ఒక డాక్టర్, ఇద్దరు ఆశా వర్కర్లు, హెల్త్ సూపరింటెండెంట్ లు ఉండాలని అన్నారు. ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు అందుబాటులో ఉండాలని అన్నారు. పరీక్షా సెంటర్ల వద్ద త్రాగునీటి సౌకర్యం, విద్యుత్ ఉండేలా చూడాలని అన్నారు. పరీక్షా రాసే విద్యార్థులకు బస్ సౌకర్యం కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట మాధవ రావు, జిల్లా పంచాయతి అధికారి బుచ్చయ్య, ఆర్టీసి ఆర్.ఎం., జీవన్ ప్రసాద్, డిప్యూటి డియం. అండ్ హెచ్.ఓ రంగారెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.