– స్థలాల క్రమబద్దీకరణ అక్టోబర్ 15 లోగా పూర్తిచేసుకోవాలి
– రాష్ట్ర బి.సి.సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, సెప్టెంబర్ 25: భూసమస్యలే లేని రాష్ట్రంగా తెలంగాణాను మార్చేందుకు రాష్ట్ర బి.సి.సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటో రియంలో జిల్లా కలెక్టర్ కె.శశాంక, మేయర్ సునీల్ రావు, ఎమ్మెల్సి నారదాసు లక్ష్మణ్ రావు, మున్సిపల్ కమిషనర్ క్రాంతితో కలిసి ఎల్.ఆర్.ఎస్.పై అవగాహన సదస్సు నిర్వహించారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా రూపొందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. పేదలకు తమ భూములపై హక్కు కల్పిస్తూ అంతా పారదర్శంగా ఉండేలా చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళన కార్యక్రమం వేగవంతం అయింది. ‘
ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ కలెక్టరేట్ లో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లాలోని పలు మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు, అధికారులు, జిల్లా స్థాయి అధికారులతో సమవేశమయ్యారు. ఎల్ఆర్ఎస్ తోపాటు రెవెన్యూ సమస్యలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయా జిల్లాల స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తెల్సుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు భూములకు సంబంధించిన సమస్యలపై మాట్లాడారు. తమతమ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఉన్న అంశాలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణాలో ఉన్న భూభాగం మొత్తం కూడా ప్రభుత్వ రికార్డుల్లో నమోదు అయి ఉండేలా ఈ కార్యక్రమం జరుగుతోందని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అక్షాంశ రేఖాంశాల ఆధారంగా భూమిని గుర్తించే విధంగా రికార్డింగ్ జరుగు తుందని చెప్పారు. ధరణి పోర్టల్ లో రికార్డు అయిన తర్వాత మళ్లీ మార్పులకు అవకాశం ఉండదని, కేవలం లావాదేవీలు మాత్రమే సాధ్యమని మంత్రి స్పష్టం చేశారు. ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భూసమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. నూతన రెవెన్యూ చట్టంలో చేర్చాల్సిన అంశాల గురించి కూలంకషంగా తెల్సుకునేందుకు ఈ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామని మంత్రి అన్నారు.
గతంలో ఉన్న చట్టం ప్రకారం ఎంతో మంది నిరుపేదలు తమ హక్కులను పొందలేక పోయారని, ఇక నుంచి అలా ఉండదని చెప్పారు. ఇంత చట్టకి సమయం మళ్లీ రాదని, ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని తమతమ భూములను రెగ్యులరైజ్ చేయించు కోవాలని సూచించారు. అర్బన్ లాండ్ సీలింగ్ వచ్చినప్పుడు సమస్యలు మిగిలిపోయాయని, జీవో నెంబర్ 58 ప్రకారం రెగ్యులరైజ్ అయిన భూముల క్రయవిక్రయాలకు అవకాశం లేదని, ఇప్పుడు ఆ సౌకర్యం కల్పించే పరిస్థితి ఉందని అన్నారు.
అసైన్డ్ భూములపై కూడా క్రయవిక్రయాలు జరిగాయి కానీ అవి అధికారికం కాదని… నూతన చట్టం ద్వారా వాటికి చట్టబద్ధత వస్తుందని చెప్పారు. బీపీఎల్ కుటుంబాల భూసమస్యల పరిష్కారానికి, సాదాబైనామాల ద్వారా లావాదేవీలు జరిగిన వాటిపై ఒక స్పష్టం వస్తుందన్నారు. కరీంనగర్లో గతంలో మానేరు ప్రవహించిన శిఖం భూములు ఇప్పటికీ అదే కేటగిరీలో ఉన్నాయని వాటిని సైతం మార్చే అవకాశం లభిస్తుందని చెప్పారు. చట్టం అనుకూలంగా లేదనే గతంలో చాలా మంది అడ్డదారులు తొక్కారని ఇక నుంచి అలాంటి తప్పులకు అవకాశం లేదని అన్నారు.
రైతులకు ఇచ్చినట్లుగానే వ్యవసాయేతర భూములకు సైతం పాసు పుస్తకాలు ఇస్తామని తెలిపారు. నూతన రెవెన్యూ చట్టం ప్రకారం ముందుకు వచ్చి సమయంలోపు రెగ్యులరైజ్ చేసుకోకపోతే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని అన్నారు. ఎల్ఆర్ఎస్ గడువు పొడగించబడుతుందని. భూ సమస్యలు తేలకుండా ఎల్ఆర్ఎస్ ఫిక్స్ చేసే పరిస్థితి లేదని చెప్పారు. ఒకసారి ధరణి పోర్టల్ సెట్ అయితే అన్ని సమస్యలు తీరిపోతాయని కేవలం ఆధార్ నెంబర్ ద్వారా అన్ని గుర్తించవచ్చని మంత్రి గంగుల స్పష్టం చేశారు.
అనంతగం జిల్లా కలెక్టర్ కె.శశాంక మాట్లాడుతూ రైతు బంధు పథకం మీద పరిశీలన చేయడం జరిగిందని, గ్రామస్థాయిలో చేసినట్లే పట్టణ స్థాయిలో పాస్ బుక్ లు తయారు చేయాలనీ అన్నారు. 2015 లో ఎల్.ఆర్.ఎస్.లో మొదటిసారి అమలు చేయడం జరిగిందని, భూమి ఉన్న ప్రతి ఒక్కరికి పాస్ బుక్ లు కల్పించే విధంగా చూడాలని ఆయన అన్నారు. ప్రజల అభిప్రాయాలు ప్రజలకు ఉన్న ఆస్తులను రక్షించే విధంగా మెరుగైన రూపకల్పన కల్పించాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనలు ఖచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా కొత్తపల్లి చైర్ పర్సన్ రుద్రరాజు, ఆర్దిఒలు ఆనంద్ కుమార్, పి.బెన్.షాలోం, కార్పొరేటర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎమ్మార్వోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.