– ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ
– చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్
(ప్రజాలక్ష్యం విలేకరి)
మందమర్రి, అక్టోబర్ 9: తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక సద్దుల బతుకమ్మ పండుగని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. మందమర్రి పట్టణంలోని సిఈఆర్ క్లబ్ నందు గురువారం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన మహిళలకు పండుగ సందర్భంగా బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరుగుతుందని, అదేవిధంగా ఇతర మతస్తులకు వారి పండగలకు బట్టలు పంపిణీ చేసి రాష్ట్రంలో సర్వ మత సామరస్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుబడి ఉన్నారని కొనియాడారు. బతుకమ్మ చీరల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకే కాక చేనేత కార్మికులకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. నేటి నుండి మండల పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీ నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జెడ్పిటీసి వేల్పుల రవి, మండల తహసీల్దార్ మోహన్ రెడ్డి, ఎంపీడీవో వి. ప్రవీణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ గాదె రాజు, టిఆర్ఎస్ నాయకులు మేడిపల్లి సంపత్, జె రవీందర్, తోట సురేందర్, బట్టు రాజ్ కుమార్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.