– అట్టహాసంగా పాసింగ్ అవుట్ పరేడ్
– సమాజానికి మెరుగైన సేవలందించాలి
– ప్రజలతో మమేకమై విధులు నిర్వర్తించాలి
– కవాతులో రామగుండం సీపీ సత్యనారాయణ
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
మంచిర్యాల, ఆక్టోబర్ 8: మంచిర్యాల జిల్లా గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్‌లో తొమ్మిది నెలల పాటు శిక్షణ పొంది విధుల్లోకి వెళ్తున్న ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఆధ్యంతం ఆకట్టుకుంది. గురువారం జరిగిన ఈ కార్యక్రమానికిి రామగుండం సీపీ సత్యనారాయణ, ఇన్‌చార్జి కమాండెంట్ ఎంఐ సురేష్, మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్ రెడ్డి హాజరై పరేడ్‌ను పరిశీలించారు. సిబ్బంది ప్రదర్శించిన కరాటే, సైలెంట్ డ్రిల్, యాంటీ టెర్రరిస్ట్ ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. శిక్షణలో భాగంగా వివిధ అంశాల్లో ప్రతిభ కనబరచిన కానిస్టేబుళ్లు అవుట్‌డోర్, ఇండోర్ శిక్షకులకు సీపీ పురస్కారాలు అందించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 324 మంది ఇక్కడ శిక్షణ పొందారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ శిక్షణ పొంది విధుల్లోకి వెళ్తున్న వారు ప్రజాసేవలో ముందుండాలని సూచించారు. సమాజంలో అన్ని ఉద్యోగాలతో పోలిస్తే పోలీస్ శాఖకు ఒక ప్రత్యేక గౌరవం వుంది. ఉద్యోగం వచ్చిన ప్రతి వ్యక్తి ప్రజా సేవ చేసుకొనే అవకాశం లభించకపోవచ్చు, కానీ పోలీసులకు మాత్రమే ప్రత్యక్ష సేవ చేసే అవకాశం దొరకడం అదష్టంగా భావించాలని తెలిపారు.
సాధారణంగా ఒక వ్యక్తి ఆపదలో ఉన్నపుడు ముందుగా గుర్తొచ్చేది పోలీసులు మాత్రమేనని విధుల నిర్వహణలో కుల, మత, వర్గాలకు అతీతంగా రాగద్వేషాలకు తావు ఇవ్వకుండా, సమాజంలో ఏ అండ లేనటువంటి బడుగు, బలహీనవర్గాల ప్రజల రక్షణ కల్పిస్తూ, వారి అభ్యున్నతికి పాటుపడవలసిన బాద్యత మన అందరిపై ఉందనే విషయాన్ని గుర్తుంచు కోవాలని పేర్కొన్నారు. ఎక్కడైతే శాంతిభద్రతలు, నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉంటుందో అక్కడ ప్రజలు సుఖశాంతులతో తమయొక్క మనుగడను కొనసాగించగలుగుతారని తెలిపారు.
నేటి అధునాతన సమాజం ప్రధానంగా ఉగ్రవాదం, తీవ్రవాదం, నక్సలిజం, సైబర్ నేరాల సమస్యలతో సతమతం అవుతున్నది. ఇలాంటి తరుణంలో పోలీస్ వ్యవస్థ వాటిని సమూలంగా అణచివేస్తూ ప్రజల యొక్క ధన, మాన, ప్రాణాలు కాపాడటంలో తమయొక్క ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, శాంతిభద్రతల పరిరక్షణకై బాధ్యతలు నిర్వర్తించడం అనేది, యావత్ భారతదేశం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు.
కానిస్టేబుల్ అనేటటువంటి వ్యక్తి పోలీసు వ్యవస్థకి పునాది లాంటి వాడని, ఆ పునాదే కనుక లేకపోతే వ్యవస్థ యొక్క మనుగడ సాధ్యం కాదని తెలిపారు. అందుకే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, డీజీపి మహేందర్ రెడ్డి పిలుపు మేరకు, ప్రెండ్లీ పోలిసింగ్ అనే కార్యక్రమంలో భాగంగా, పోలీసులు అందరూ అనునిత్యం ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలకు, ఎప్పటికప్పుడు పరిష్కారం చూపుతూ, ప్రజాప్రతినిధులను రక్షించడంలో పోలీసుల కృషి ఎంతో అమోఘమని తెలిపారు. గ్రేహాడ్స్, ఆక్టోపస్, ఇంటిలిజెన్స్, కౌంటర్ ఇంటిలిజెన్స్, ఎస్.బి. పోలీస్ అకాడమీ మరెన్నో విభాగాల సమ్మిళిత సమ్మేళనమే పోలీస్ వ్యవస్థ యని, అన్ని విభాగాల్లో పోలీసుల యొక్క సేవలు నిజంగా గర్వించదగినవి అని చెబుతున్నందుకు నాకు గర్వాంగా ఉందని తెలిపారు.
నేటి యువత మద్యపానం మత్తుపదార్థాలు, డ్రగ్స్, పేకాట, జూదం లాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడి తమ యొక్క జీవితాన్ని నిర్వీర్యం చేసుకుంటున్నటు వంటి నేపథ్యంలో అట్టి చట్ట వ్యతిరేక చర్యలను పోలీసులు గుర్తించి ఎప్పటికపుడుపై అధికారుల దష్టికి తీసుకెళ్లి యువత భవిష్యత్తుని కాపాడి, వారికీ మార్గ దర్శకులుగా నిలువడం అనేది గర్వించదగి నటువంటి విషయమన్నారు.
9 నెలలు ఎంతో కఠోర శ్రమను, కఠినమైన శిక్షణను, సమయపాలనతో పూర్తి చేసుకొని సమాజంలోకి వెళ్తున్న మీరందరు అదే క్రమశిక్షణతో విధులను నిర్వర్తిస్తూ పైఅధికారుల యొక్క మన్ననలను, ప్రజల యొక్క ఆశీర్వాదాలు పొందుతారని ఇంకా ఉన్నత పదవులను పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
శిక్షణలో ప్రతిభను కనబర్చిన, అలాగే ఇండోర్, ఔట్‌డోర్ పరీక్షల యందు ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఈ సందర్భంగా బహుమతి ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి అడిషనల్ కమాండెంట్ ఎం.ఐ.సురేష్, అసిస్టెంట్ కమాండెంట్ రఘనాథ్ చౌహన్, అసిస్టెంట్ కమాండెంట్ బి. బిక్షపతి, అసిస్టెంట్ కమాండెంట్ ఎం.నాగభూషణ, అసిస్టెంట్ కమాండెంట్ నాగనాయక్ తదితరులు పాల్గొన్నారు.