(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హైదరాబాద్ ఆగష్టు 29: మీడియా అకాడమి నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన జర్నలిస్టులకు అందుబాటులోకి తీసుకురావలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లను కోరారు. శనివారంనాడు నాంపల్లిలో నిర్మాణంలో ఉన్న మీడియా అకాడమి భవనాన్ని ఆందోల్ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ తో కలిసి మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఉపయోగకరంగా ఉండే విధంగా మీడియా అకాడమి భవనాన్ని బహుళ అంతస్తుల భవనంగా నిర్మిస్తున్నట్లు ఇందుకోసం ప్రభుత్వం 15 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. ఈ భవనంలో జర్నలిస్టులకు శిక్షణా తరగతులు, సర్టిఫికేట్ కోర్సుల నిర్వహణ, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, వీడియా కాన్ఫరెన్స్ తోపాటు ఆధునిక సౌకర్యాలతో కూడిన ఆడిటోరియంను నిర్మిస్తున్నామని అన్నారు. ఈ భవనం ద్వారా జర్నలిస్టులకు మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. భవన నిర్మాణంలో అవసరమైన మార్పులను అధికారులకు సూచించారు. నిర్మాణ పనులలో నాణ్యతా ప్రమాణాలు తప్పకుండా పాటించాలని ఇంజనీర్లకు సూచించారు.
ఆందోల్ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ, మీడియా అకాడమి భవనం జర్నలిస్టులకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని అన్నారు. మీడియా అకాడమి భవన నిర్మాణం త్వరగా పూర్తి అవడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఇంజనీర్లకు సూచించారు. క్రమం తప్పకుండా పనులను పర్యవేక్షించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులు నర్సింగరావు, దుర్గా ప్రసాద్, రాఘవేందర్, ఆర్కిటెక్చర్ రవి, టీయూడబ్ల్యూజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, టెమ్జూ అధ్యక్షులు ఇస్మాయిల్, చిన్న పత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.