(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని ఆగష్టు 29: షెడ్యూల్ కులాల సంకేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలయ్యేలా, వారికి సత్వర న్యాయం జరిగేలా కమిషన్ పర్యవేక్షిస్తుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ తెలిపారు. శనివారం సాయంత్రం రామగుండం నగరానికి వచ్చిన ఎర్రోళ్ళ శ్రీనివాస్ పెద్దపల్లి ఎం.పి. బొర్లకుంట వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ లతో కలిసి నగరపాలక సంస్థ కార్యాలయంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టం ఆవిర్భవించిన తరువాత సీఎం కేసీఆర్ మార్గ నిర్ధేశంలో ఎస్టీ, ఎస్సీ కమిషన్ సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు. పీసీఆర్, పీవోఏ చట్టాలు పకడ్బందీగా అమలు చేస్తూ, ఈ చట్టాలపై ఆపోహలు తొలగించి అవగాహన కల్పిస్తూ షెడ్యూల్ కులాల వారు ఆత్మగౌరవంతో బతికేలా కమిషన్ పని చేస్తుందని వివరించారు. ఎంపీ వెంకటేశ్ నేత మాట్లాడుతూ షెడ్యూల్ కులాల సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు.
దళితులకు అండగా తెలంగాణ ప్రభుత్వం – రామగుండం ఎమ్మేల్యే కోరుకంటి చందర్
రాష్ట్రంలోని దళితులకు అండగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తోందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ హైదరాబాద్ కే పరిమితం అయ్యిందని, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమకారుడు అయిన ఎరోళ్ల శ్రీనివాస్ చైర్మన్ గా నియమించి ఎస్సీ, ఎస్టీ వర్గాల న్యాయం జరిగేలా చూస్తున్నారని తెలిపారు. రామగుండం నియోజవర్గంలోని దళితులకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నామని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు ఎస్సీ, ఎస్టీ కమీషన్ దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యల సాధనకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న ఎరోళ్ల శ్రీనివాస్ దళిత వర్గాలకు ఆసరాగా నిలుస్తున్నారని, మాల్లారంలో దళిత కుటుంబానికి సహాయం అందించారన్నారు. అనంతరం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ను ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి ఎంపి బోర్లకుంట వెంకటేశ్ నేత, మేయర్ బంగి అనిల్ కుమార్ ఘనంగా సన్మానించారు.
ఈ సమావేశంలో రామగుండం నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, నాయకులు తానిపర్తి గోపాల్ రావు, వంగ శ్రీనివాస్ గౌడ్, తస్లీమభాను, జహీద్ పాషా, చెరుకు బుచ్చిరెడ్డి, రఫీ తదితరులు పాల్గొన్నారు.