– ప్రజల కష్టాలను తొలగించడమే ప్రభుత్వ లక్ష్యం…
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 16: వరదలు, విపత్తు సమయాల్లో ప్రజలను కపాడేందుకు విపత్తు ప్రతిస్పందన దళం (డిజస్టార్ రెస్పాన్స్ ఫోర్స్) సేవలను ప్రారంభిస్తున్నట్లు రామగుండం ఎమ్మల్యే కోరుకంటి చందర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే నగర మేయర్ బంగి అనిల్ కుమార్ తో కలిసి విపత్తు ప్రతిస్పందన దళం సేవలను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వర్షకాలం వరదలు విపత్తులు సంబవిస్తే ఈ ఫోర్స్ సహాయ చర్యలు చేపడుతుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో విస్తతంగా వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ముందస్తు జాగ్రత్తలతో పాటు సహాయక చర్యలు చేపట్టడానికి రామగుండం నగర పాలక సంస్థ అద్వర్యంలో ఏర్పాటు చేసిన విపత్తు ప్రతిస్పందన దళ సేవలను వినియోగించుకోవాలని పేర్కొన్నారు.
ప్రజల ఇబ్బందులను, కష్టాలను తొలగించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని, రాష్ట్ర పురపాలక మంత్రి కేటిఆర్ ఆదేశాల మేరకు వరదలు, విపత్తుల నుండి ప్రజలను రక్షించడానికి ఈ దళాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు వరదలు, విపత్తులు సంభవిస్తే శానిటేషన్ విభాగం కాల్ సెంటర్ 9603666444 కు సమాచారం అందిస్తే ఈ దళం వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపడుతుందని అన్నారు.
మేయర్ బంగి అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ దళానికి ప్రత్యేకంగా వాహనం అవసరమైన పరికరాలతో 12 మంది సిబ్బందిని సమకూర్చడం జరిగిందని అన్నారు. అత్యవసర వేళల్లో నిరంతరాయంగా సేవలందించడానికి ఈ దళం సిద్దంగా ఉంటుందని తెలిపారు
ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి ఆభిషేక్ రావు, కార్పొరేటర్లు సాగంటి శంకర్, బాల రాజ్ కుమార్ నాయకులు తానిపర్తి గోపాల్ రావు, గడ్ది కనుకయ్య తదితరులు పాల్గొన్నారు