– లేజర్ స్పీడ్ గన్లతో వేగ నియంత్రణ…
– స్వీడ్‌గన్ల వినియోగంతో తగ్గనున్న ప్రమాదాలు
– డీసీపీ (అడ్మిన్) అశోక్ కుమార్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, ఆక్టోబర్ 1: వాహనాల వేగం హద్దుమీరితే జరిమానా తప్పదని డీసీపీ (అడ్మిన్) ఎన్.అశోక్‌కుమార్ తెలిపారు. గోదావరిఖని నుండి పెద్దపల్లి రహదారి కుందనపల్లి వద్ద స్పీడ్ గన్ పనితీరు, చలాన్లు విధిస్తున్న తీరును గురువారం ఆయన ట్రాఫిక్ సిఐ రమేశ్‌బాబును అడిగితెలుసుకున్నారు. రామగుండం పోలీసు కమిషనరేట్ అతివేగంగా వెళ్తున్న వాహనదారులతో చలాన్‌లు కట్టిస్తున్నామని డీసీపీ పేర్కొన్నారు. పెద్దపల్లి ప్రధాన రహదారిపై వాహనాల వేగం హద్దు మీరితే జరిమానా తప్పదని అశోక్ కుమార్ హెచ్చరించారు.
అతివేగంగా వెళ్లిన వాహనాలను స్పీడ్ గన్ గుర్తిస్తుందన్నారు. వెంటనే ఫోటోను పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ ఉపేందర్‌కు యాప్ ద్వారా పంపించడం జరుగుతుందన్నారు. పెద్దపల్లి నుండి మంథని వెళ్లే మార్గం వద్ద ఆపి వాహనదారులతో చలాన్‌లను కట్టించడం జరుగుతుందని అడ్మిన్ తెలిపారు. ఎవ్వరిని ఇబ్బందులకు గురి చేయాలనీ పోలీస్ ఉద్దేశ్యం కాదన్నారు. ప్రమాదాలు నివారించడానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని పేర్కొన్నారు.
జాతీయ రహదారులపై 80 కిలో మీటర్లు, పట్టణ ప్రాంతాల్లో 30కిలో మీటర్ల వేగంతోనే వాహనాలను నడపాలని నిబంధన ఉన్నా ఎవరూ వాటిని పాటించకపోవడం కారణంగానే ప్రమాదాల సంఖ్య పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీడ్ గన్స్ ద్వారా నిత్యం వాహనాల వేగానికి కళ్లెం వేసే విధంగా చాలన్లు విధిస్తున్నామని అన్నారు.
రోడ్ ప్రమాదాలను నివారించడం లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులలో స్పీడ్ గన్స్ వినియోగించడంతో పాటు ఈ చాలన్ అమలు విధానంతో ప్రమాదాలను తగ్గించడం, వాహన దారులంతా నిబంధనలు పాటించే విధంగా కషి చేస్తుందని అడ్మిన్ అశోక్‌కుమార్ చెప్పారు.