(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, సెప్టెంబర్ 14: రైతు వేదికల, వైకుంఠ ధామాల నిర్మాణాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రైతువేదికల నిర్మాణాల పనులపై జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి వెంకటేశ్వర్ రావు, వ్యవసాయాధికారి శ్రీధర్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట మాధవ రావు, ఏఈఈలు, డిప్యూటి ఈఈలతో కలిసి రైతు వేదికల, వైకుంఠధామాల నిర్మాణాల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు వేదిక నిర్మాణా పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, నిర్దేశిత గడువులోగా నిర్మాణాలను పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొని రావాలని సూచించారు. రైతు వేదికల నిర్మాణం అన్నదాతలకు ఎంతో ప్రయోజనం అని అన్నారు. పంటల సాగులో రైతులకు సలహాలు సూచనలు లభిస్తాయని, సీజనల్ వారీగా ఆశించే చీడ పీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు వివరిస్తారని, వాన కాలం, యాసంగిలో ఏఏ పంటలు వేస్తే అధిక దిగుబడులు వస్తాయో వ్యవసాయ అధికారులు చెబుతారని కలెక్టర్ తెలిపారు.
శిఖం మరియు ప్రభుత్వ భూములలో రైతు వేదికల నిర్మాణం చేయాలని కలెక్టర్ అన్నారు. రైతు వేదికలకు కావాల్సిన సామాగ్రి ఇసుక, మెటల్ తప్పకుండా అందుబాటులో ఉండే విధంగా చూడాలని అన్నారు. పబ్లిక్ టాయిలెట్స్ తప్పనిసరిగా ఉండే విధంగా చూసుకోవాలని కలెక్టర్ తెలిపారు. రైతు వేదిక నిర్మాణాల పనులను పెంచి పంచాయతి సెక్రటరీలు పూర్తి చేయాలని అన్నారు. గ్రామాలలో వైకుంఠ ధామల పనులను, పబ్లిక్ టాయిలెట్స్ పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ అంకిత్, డి.ఆర్.డి.ఏ.వెంకటేశ్వర్ రావు, హుజురాబాద్ ఆర్.డి.వో. పి.బెన్.షలోమ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట మాధవ రావు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, పంచాయతి రాజ్ ఎస్ఇ విష్ణువర్ధన్, అన్ని మండలాల ఈఈలు, డిప్యూటి ఈఈలు, గ్రామ కార్యదర్శులు, నోడల్ ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.