– గోదావరి నదికి భారీ వరద తాకిడితో కోట్టుకు పోయిన ఎనిమిది యూనిట్లు
– నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రిని కోరిన బాధితులు
(ప్రజాలక్ష్యం ప్రతినిధి, హైదరాబాద్)
ఎల్లంపల్లి నీటిపారుదల ప్రాజెక్టులో ఔత్సాహిక మత్స్యకారులు ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న “కేజ్ కల్చర్” యూనిట్లు గోదావరి నదికి ఇటీవలి సంభవించిన భారీ వరదల్లో కొట్టుకుపోవడంతో జరిగిన నష్టానికి ప్రభుత్వం నుండి తగిన రీతిలో నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు పిట్టల రవీందర్ కోరారు. ఈ మేరకు బాధితుల తరఫున పిట్టల రవీందర్‌తో పాటు తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు ముల్కలపల్లి వెంకటేశ్వర్లు, కేజ్ కల్చర్ నిర్వాహకుడు పిట్టల తిరుపతి తదితరులు రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించారు. అలాగే హైదరాబాద్ లో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, శాసనమండలి సభ్యులు డాక్టర్ బండా ప్రకాశ్, మత్స్యశాఖ కార్యదర్శి అనిల్ సిన్హాను స్వయంగా కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
ఎల్లంపల్లి రిజర్వాయర్ లో ప్రభుత్వ సహకారంతో ప్రయోగాత్మకంగా మూడు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన మొత్తం ఎనిమిది కేజ్ కల్చర్ యూనిట్లు జూన్ 13వ తేదీన గోదావరి నదికి అనూహ్యంగా పోటెత్తిన భారీ వరదల్లో పూర్తిగా కొట్టుకుపోయాయని, కేజ్ కల్చర్ యూనిట్లతో పాటుగా సుమారు కోటి రూపాయలు విలువ చేసే దాదాపు వంద టన్నుల చేపలు, నాలుగు మోటారు బోట్లు, సుమారు పది టన్నుల నిలువ చేసిన దాణా, ఫ్లోటింగ్ హౌజ్ (నీటిపై తేలియాడే ఇల్లు), తదితర విలువైన సామాగ్రి పూర్తిగా ఈ వరదల్లో కేజ్ కల్చర్ యూనిట్లు తోపాటు కొట్టుకుపోయి అపార నష్టం జరిగిందని బాధితులు తమ వినతి పత్రంలో వివరించారు.
ప్రభుత్వం అందించిన సహకారంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ కేజ్ కల్చర్ యూనిట్లు వరదల్లో కొట్టుకుపోవడంతో స్థానిక మత్స్యకార కుటుంబాలకు చెందిన అనేకమంది యువకులు తమ ఉపాధిని కోల్పోతున్నారని బాధితులు ప్రభుత్వానికి సమర్పించిన వినతిపత్రంలో తెలిపారు. ఎల్లంపల్లి రిజర్వాయర్ లో ఏర్పాటు చేసిన మొత్తం ఎనిమిది కేజ్ కల్చర్ యూనిట్లకు సంబంధించిన ఎనభై పంజరాలు ఈ వరదల్లో కొట్టుకుపోవడంతో మొత్తం నాలుగు కోట్ల రూపాయల భారీ నష్టం కలిగిందని బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆధునిక పరిజ్ఞానంతో ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న కేజ్ కల్చర్ యూనిట్లు ప్రకృతి వైపరీత్యం కారణంగా భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి రావడం వల్ల భవిష్యత్తులో ఇట్లాంటి యూనిట్లను ఏర్పాటు చేయాలనుకునే ఔత్సాహిక మత్స్యకారులకు ఆశనిపాతంలా మారిందని వారు తెలిపారు. అనూహ్యమైన రీతిలో గోదావరినది కి సంబంధించిన భారీ వరదల కారణంగా తమకు ఎదురైనా భారీ నష్టాలను ఉండి తమను గట్టెక్కించే డానికి ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
ఎల్లంపల్లి రిజర్వాయర్ లో తాము ఈ కేజ్ కల్చర్ యూనిట్లను నాలుగు సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేసినప్పటికీ, జలాశయంలో ఎదురైనా ప్రతికూల పరిస్థితుల కారణంగా కేవలం రెండు దఫాలుగా మాత్రమే తాము పాక్షికంగా చేపలు ఉత్పత్తిని సాధించగలిగామని, ఈసారి మాత్రమే పూర్తిస్థాయిలో చేపలను ఉత్పత్తి చేయగలిగామని, మరో నెలరోజుల్లో తమ యూనిట్లలో పౌష్టికంగా పెరిగిన చేపలను మార్కెట్ లో అమ్ముకోవడం ద్వారా గడచిన రెండు దశల్లో ఎదురైన నష్టాలను కొంతమేరకైనా పూడ్చుకోగలమనే ఆశలతో ఎదురుచూస్తున్న తరుణంలో “మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు”గా, గోదావరి వరదలు తమ అంశాలన్నింటినీ అడియాశలు చేస్తూ ముంచి వేసాయని కేజ్ కల్చర్ నిర్వాహకులు తమ ఆవేదనను వ్యక్తం చేసారు. ఈ కేజ్ కల్చర్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి తాము చేసిన అప్పులు కూడా ఇంకా తీరలేదని వారు వాపోయారు. ఆధునిక పద్ధతుల్లో చేపలను పెంచే ప్రక్రియను ఎంతో సాహసంతో ప్రయోగాత్మకంగా చేపట్టిన తమను ఆదుకోవడం ద్వారా భవిష్యత్తులో తమ లాగా ఆధునిక చేపలు పెంపకానికి ముందుకువచ్చే ఔత్సాహిక మత్స్యకారుల్లో విశ్వాసాన్ని కలిగించాలని బాధితులు ప్రభుత్వానికి ఈ వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు