– నాగార్జునసాగర్లోనూ విజయం తథ్యం
– కెసిఆర్ పాలనను ఆమోదిస్తున్న ప్రజలు
– పార్టీలో పలువురి చేరికలు…
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హాలియా (నాగార్జునసాగర్) మార్చి 21ః తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తి టీఆర్ఎస్ పార్టీ అని, ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ గెలుపు తథ్యమని, కేసీఆర్ పాలనను ప్రజలంతా ఆమోదిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పునరుద్ఘాటించారు. అదివారం హలియా పట్టణంలోని 8 వార్డులో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన భరోసా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ… సంక్షేమ పథకాల అమల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపిన ఘనత కెసిఆర్కు దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల బతుకు దెరువులను మార్చేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, పట్టభద్రులంతా టిఆర్ఎస్ పార్టీ కి మద్దతుగా నిలిచి రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్. పాలనలో అన్ని వర్గాలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. రైతులకు ఉచిత కరెంటు, రైతుబీమా, రైతుబంధు, సకాలంలో ఎరువుల అందిస్తూ అండగా నిలుస్తున్నారని తెలిపారు.
గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం, ప్రసవించిన మహిళలకు కెసిఆర్ కిట్, పేద యువతుల పెళ్లిళ్లకు సిఎం కెసిఆర్ పెద్దదిక్కుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. వృద్ధులకు, వికలాంగులకు ఆసరా పథకం ద్వారా నెలకు రెండువేల రూపాయలు అందించడం జరుగుతుందని, దేశంలో ఎక్కడలేని విధంగా ఒంటరి మహిళకు రెండువేల పింఛన్ అందిస్తున్న ఘనత కెసిఆర్ కే దక్కుతుందన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం టి.ఆర్.ఎస్. ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వాన్ని బలపరిచేందుకు హలియా ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా గులాబీ సైనికులు పనిచేయాలని సూచించారు.
అనంతరం ఇతర పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్ లొ చేరారు వారికి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో హాలియా మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్, రామగుండం కార్పొరేటర్లు పెంట రాజేష్, అడ్డాల గట్టయ్య తదితరులు పాల్గొన్నారు