– ఎఐటియుసి గౌరవ అధ్యక్షులు సాంబశివరావు ..
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, మార్చి 22: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నాయని ఎఐటియుసి గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. సోమవారం సింగరేణి ఆర్జీవన్ పరిధిలోని జీడీకే 11వ గని ఆవరణలో ఏర్పాటు చేసిన గేటు మీటింగ్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్మికులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి వేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కంపెనీలో అవుట్సోర్సింగ్, కాంట్రాక్టీ కరణలను వేగవంతం చేస్తుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి సింగరేణిలో అరవై నాలుగు వేల పైచిలుకు కార్మికులు, ఉద్యోగులు పని చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం 40 వేల పైచిలుకు మాత్రమే పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. సింగరేణిలో కొత్తగా 30 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సి ఉండగా కేవలం 7 వేల మందికి మాత్రమే ఉద్యోగం కల్పించారని వివరించారు. కొత్తగా10 అండర్ గ్రౌండ్ మైన్స్ తవ్వకాలు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇచ్చిన హామీ మర్చిపోయారా అని ప్రశ్నించారు.
సింగరేణిని ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కొంగు బంగారం చేస్తానని ప్రగల్బాలు పలికి ఉత్తర కుమారుడిని మించిపోయినాడని ఎద్దేవా చేశారు. సింగరేణి సంస్థకు సంబంధించిన వేల కోట్ల రూపాయలను డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ పేరుతో దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. సింగరేణి డబ్బులను నిర్వాసిత ప్రజలకు, ప్రభావిత గ్రామాలకు, కార్మికులకు, ఉద్యోగుల సంక్షేమంకు, అభివద్ధికి ఖర్చు చేయకుండా రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా ఇతర ప్రాంతాల్లో ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.
సింగరేణిలో వివిధ క్యాడర్లకు ప్రమోషన్లను కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే సింగరేణిలో తగ్గిన కార్మికుల సంఖ్యను, నిరుద్యోగ సమస్యను పరిగణలోకి తీసుకొని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కొత్తగా అండర్ గ్రౌండ్ మైన్స్ బొగ్గు తవ్వకాలను వేగవంతచేసి పర్యావరణ పరిరక్షణకు, కొత్త ఉద్యోగ నియామ కాలకు కషి చేయాలని సూచించారు.
ఎఐటియుసి నాయకులు ఆరెల్లి పోషం అధ్యక్షతన జరిగిన గేటు మీటింగ్‌లో యూనియన్ అధ్యక్షుడు వై. గట్టయ్య, కేంద్ర కమిటి కార్యదర్శి మేరుగు రాజయ్య, మడ్డి ఎల్లయ్య, నాయకులు రంగు శ్రీనివాస్, మాదన మహేష్, మోదుగుల సంపత్, దొంత సాయన్న, ఆరెల్లి రాజేశ్వర్ రావు, చెప్యాల బాస్కర్, కొమ్ముల మల్లేష్, బండి మల్లేష్, దొంతుల కుమార్, లక్ష్మీనారాయణ, రాజిరెడ్డి, శ్రీనివాసు, రామస్వామి, రాజన్న, నాగరాజు, చక్రపాణి అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.