– బ్యూరోఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ వెల్లడి
– మరో ఘనకీర్తిని సాధించిన కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, అక్టోబర్ 12: కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు మరోఘనకీర్తిని సాధించి దేశవ్యాప్తంగా గుర్తింపుపొందారు. కోవిడ్-19 సేవల్లో పోలీసులు అందించిన సేవలపై దేశ వ్యాప్తంగా జరిగిన అధ్యయనం, సర్వేలో కరీంనగర్ కమిషనరేట్ రెండవస్థానం సాధించింది. ఈ విషయాన్ని నూఢిల్లీకి చెందిన బ్యూరోఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగం ప్రత్యేక సంచికను వెలువరిస్తూ ప్రకటించింది.
దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లో కోవిడ్-19 విజృభిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా పోలీసులు వివిధ ప్రభుత్వశాఖల అధికారులతో సమన్వయం కొనసాగిస్తూ అందించిన సేవలను ఈ ఎంపిక కోసం పరిగణలోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, రాచకొండ కమిషనరేట్‌లు ఎంపికయ్యాయి. ఇందులో హైదరాబాద్ తర్వాత స్థానం కరీంనగర్ కమిషనరేట్‌కు దక్కడం గర్వకారణం. ఈ ఎంపికకోసం పలు అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. కరీంనగర్ కమిషనరేట్‌లో పోలీసులు కోవిడ్-19వ్యాప్తి చెందుతున్న తరుణంలో తీసుకున్న చర్యల వివరాలు ఇలాఉన్నాయి.
ఇండోనేషియా దేశస్థులను మొదట గుర్తించింది కరీంనగర్‌లోనే
ఇండోనేషియా దేశస్థులు కరీంనగర్‌లో పర్యటించిన సందర్భంలో కరీంనగర్‌లో కోవిడ్-19 వ్యాప్తి ప్రారంభమైన విషయం విదితమే. సదరు ఇండోనేషియా దేశస్థులు కరీంనగర్‌కు వచ్చి ఎక్కడ బసచేశారు. ఎవరెవరితో సన్నిహితంగా మెదిలారనే విషయంపై దృష్టి కేంద్రీకరించి 48గంటల వ్యవధిలో వారిని గుర్తించి పట్టుకున్నారు. వారితో సన్నిహితంగా మెదిలి ప్రాథమిక సంబంధాలు కలిగిఉన్న వారందరినీ కూడా గుర్తించారు. ఇండోనేషియా దేశస్థుతులకు కోవిడ్ నిర్ధారణకావడంతో ఈ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని గుర్తించి వారితో సన్నిహితంగా మెదిలిన వారిని సిసి కెమెరాలు, ఇతర అత్యాధునిక సాంకేతిక పరికరాల వినియోగంతో గుర్తించి వైద్యపరీక్షల నిమిత్తం పోలీసులు తమ రక్షణలో ఆసుపత్రులకు తరలించారు. 36074 కుటుంబాలకు వైద్యపరీక్షలను చేయించారు. ఈ వైరస్‌వ్యాప్తి చెందితే సంభవించే పెనుప్రమాదాన్ని గుర్తించి తొలుత పోలీసులు ఈ వైరస్ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు, ప్రజలకు వ్యాప్తిచెందకుండా పలురకాల చర్యలను పకడ్భందీగా కొనసాగించారు. మానవీయకోణంలో స్పందిస్తూ ప్రాణాలను సైతంలెక్కచేయకుండా తమ సహాయక చర్యలను కొనసాగించారు. ఇండోనేషియా దేశస్థులు పర్యటించిన ప్రాంతాలను దిగ్భందం చేశారు.
దేశంలో మొదటి కంటెన్మెంట్ జోన్ ప్రకటించింది ఇక్కడే
ఈ వైరస్‌వ్యాప్తి నిరోధకచర్యల్లో భాగంగా ఇండోనేషియా దేశస్థులు సంచరించిన ప్రాంతాలను దిగ్భందం చేసిన తర్వాత ఆ ప్రాంతాలను కంటెన్మెంట్‌జోన్లుగా ప్రకటించారు. ఈ పదాన్ని దేశవ్యాప్తంగా ప్రకటించబడింది కరీంనగర్‌లోనే కరీంనగర్ జిల్లా కలెక్టర్ కె శశాంక, పోలీస్ కమిషనర్ విబి కమలాసన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ క్రాంతిలు ఆయాప్రాంతాల్లో పర్యటించి తీసుకున్న చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కంటెన్మెంట్ ప్రాంతాలకు చెందిన ప్రజలు బయటకు రాకుండా వారికి నిత్యావసరవస్తువులు, సరుకులను ప్రతివాడవాడల్లో తిరుగుతూ ఉచితంగా అందజేశారు. వైరస్‌వ్యాప్తి చెందకుండా 144సెక్షన్ అమలు, రాత్రివేళల్లో కర్ఫూలను అమలుచేశారు. వైద్యపరీక్షలకు సహకరించని వారికి అవగాహన కల్పిస్తూ పోలీసు వాహనాలతోపాటు ఇతర ప్రభుత్వశాఖలకు చెందిన వాహనాల్లో ఆసుపత్రులకు తరలించారు.
వైరస్‌పై ప్రజలకు అవగాహన కోసం పలు కార్యక్రమాలు
కోవిడ్-19వైరస్‌వ్యాప్తి, నిరోధకచర్యల్లో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్‌శాఖ ఇతర ప్రభుత్వశాఖల సహకారంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ముందుకుసాగి సఫలీకృతమయింది. కమిషనరేట్‌వ్యాప్తంగా గ్రామాల్లోని వాడవాడల్లో మైక్‌ల ద్వారా, వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో ఈ వైరస్ ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోగనిరోధకశక్తిని పెంపొందించుకునేందుకు తీసుకోవాల్సిన వివిధరకాల ఆహారాలు, నియమ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ ప్రచారం కొనసాగించారు.
ప్రత్యేక కంట్రోల్‌రూం ఏర్పాటు
ఈ వైరస్‌బారిన పడిన, అనుమానితులకు సంబంధించిన సంచారం, సమాచారం సేకరిం చేందుకు కమిషనరేట్‌కేంద్రంలో 24గంటలపాటు కొనసాగే ప్రత్యేక కంట్రోల్‌రూంను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏసమస్య తలెత్తినా అక్కడి ప్రజలు కంట్రోల్‌రూంనకు సమాచారం అందిం చడం, వెంటనే ఆయాప్రాంతాలకు చెందిన పోలీసులకు సమాచారం అందించడంతో పోలీ సులు నిమిషాల వ్యవధిలో అక్కడకు చేరుకుని సేవలందించారు. ఈ కంట్రోల్‌రూం ఏర్పాటు తో పోలీస్‌శాఖకు ప్రత్యేక సమాచార వ్యవస్థ ఏర్పడింది.
పరిమిత సమయాల్లో సడలింపులు, రాత్రివేళల్లో కర్ఫ్యూలు
ఈ వైరస్ విజృభిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చిన విషయం విదితమే. ఆ సమయంలో పోలీసులు తమప్రాణాలను ఫణంగా పెట్టి కుటుంబాలకు దూరంగా ఉంటూ అన్నివర్గాల ప్రజలకు సేవలందించారు. ప్రజలు నిత్యావసరవస్తువులు, కూరగాయలు కొనుగోలు చేసుకునేందుకు పరిమిత సమయాల్లోనే సడలింపులు ఇచ్చి రాత్రి వేళల్లో కర్ఫూను పగడ్భందీగా అమలు చేయడంతో జనసంచారం తగ్గి వైరస్ నియంత్రలోకి వచ్చింది. పోలీసులు రేయింబవళ్ళు అలుపెరుగకుండా సేవలందించారు.
సాంకేతికతో ముందుకుసాగి సక్సెస్
కమిషనరేట్ పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాల వినియోగంతో ముందుకుసాగి కోవిడ్-19విజృభణలో సఫలీకృతమయ్యారు. 144సెక్షన్ అమలుతో ఎక్కడ జనంజమకూడి ఉన్నా వారిని గుర్తించి చెదరగొట్టేందుకు మొబైల్‌కమాండ్ కంట్రోల్ వాహనం, డ్రోన్ కెమెరాలతో పాటు ఇతర అత్యాధునిక సాంకేతికను వినియోగించారు. ప్రజలకు ఎప్పటికప్పుడూ పరిస్థితులపై అవగాహన కలిగించేందుకు మొబైల్ కంట్రోల్ వాహనం చుట్టుపక్కప్రాంతాల్లోని వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు వివిధ రకాల కెమెరాల్లో వారికదలికలను గుర్తించి నిక్షింప్తం చేశారు. అమల్లో ఉన్న ఉత్తర్వులను ఉల్లఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకున్నారు.
వాలంటీర్ల సేవలు సద్వినియోగం
పరిస్థితులను అదుపులోకి తేవడంతోపాటు నిత్యావసరవస్తువులు, కూరగాయల కొనుగోలు వద్ద జనం గుంపులుగుంపులుగా జమకూడి ఉండకుండా ఉందేందుకు వాలంటీర్లను ఎంపిక చేసుకుని వారిసేవలను సద్వినియోగం చేసుకున్నారు. లాక్‌డౌన్ అమల్లోఉన్న సమయం లో సేవలందించిన వాలంటీర్లకు గుర్తింపుగా ప్రశంసాపత్రాలను అందజేశారు. వాలంటీర్లను ట్రాఫిక్ క్రమబద్దీకరణ చర్యల్లోనూ భాగస్వాములను చేశారు.
వలస కూలీలు, దినసరి కార్మికులు, నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణి
లాక్‌డౌన్ ప్రభావంతో ఉపాధి అవకాశాలు కోల్పోయిన వలసకూలీలు, దినసరి కార్మికులు, కడుబీదకుంటుబాలతోపాటు వృద్దాశ్రమాల్లో ఉంటున్న వారికి చేయూతనందించేందుకు పోలీస్‌శాఖ కరీంనగర్‌లో శాంతి,సంక్షేమకమిట సభ్యులతో నిత్యావసరవస్తువులు, కూర గాయల పంపిణీ కార్యక్రమాన్ని నిరవధికంగా కొనసాగించింది. ఈ సేవలతో పోలీస్‌శాఖ ప్రతిష్ట మరింత పెంపొందింది. పోలీస్‌శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమాలను అన్నివర్గాల ప్రజలు, వివిధ ప్రభుత్వశాఖలు తమవంతు సహకారాన్ని అందించారు.
ప్రాణాపాయస్థితిలో ఉన్నవారికి వైద్యసేవలు
వైరస్‌వ్యాప్తి విజృంభిస్తున్న తరుణంలో పోలీస్‌శాఖ ప్రాణాపాయస్థితిలో ఉన్న ఎంతోమందిని పోలీసు వాహనాల్లోనే ఆసుపత్రులకు తరలించింది. పోలీసులు అందించిన సేవలకు అన్ని వర్గాల ప్రజలు తమవంతు సహకారాన్ని అందించారు. పోలీసులు అందించిన సేవల ప్రభావంతో అన్నివర్గాల ప్రజలతో సత్సంబంధాలు పెంపొందాయి.
దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం ఇది మూడోసారి
కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు దేశవ్యాప్తంగా తమ సేవలతో గుర్తింపుపొందడం ఇది మూడవసారి. గతంలో ప్రజల రక్షణ, భద్రత అంశంలో దేశవ్యాప్తంగా నాల్గవస్థానం, ప్రజల ఫిర్యాధులపై సత్వరం స్పందిస్తూ వేగవంతంగా సేవలందించడంలో చొప్పదండి పోలీస్‌స్టేషన్ దేశవ్యాప్తంగా 8వస్థానం సాధించిన విషయం విదితమే. తాజాగా కోవిడ్-19 వ్యాప్తి నియంత్రణ చర్యల్లోనూ తమ సేవలతోపోలీసులు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం గర్వకారణం
అన్నివర్గాల ప్రజల సహకారంతో సాధ్యమైంది
కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్‌రెడ్డి
కమిషనరేట్ పోలీసులు వివిధ అంశాల్లో దేశవ్యాప్తంగా ప్రతిసంవత్సరం గుర్తింపు పొందడం ఇక్కడి ప్రజల సహకారంతోనే సాధ్యమైందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి అన్నారు. ప్రజలు ఇదేస్ఫూర్తితో ముందుకుసాగి పోలీసులకు తమ సహకారాన్ని కొనసాగించినట్లయితే మిగిలిన అంశాల్లోనూ కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు దేశవ్యాప్తంగా ఇంకామరెన్నో గుర్తింపులను సులువుగా పొందుతారని చెప్పారు. శాంతిభద్రత పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలకు కుల, మత, వర్గ విభేదాలను విడనాడి సహకరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.