(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 12: పెద్దపల్లి జిల్లా ఇంచార్జీ కలెక్టర్ భారతి హోలీకేరీ సోమవారం రామగుండం నగరపాలక కార్యాలయాన్ని సందర్శించి ధరణిలో ఆస్తుల నమోదు కార్యక్రమ పనితీరును పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆస్తుల నమోదు ప్రక్రియను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. ఈ మేరకు అధికారులతో నగరపాలక కార్యాలయంలో సమావేశం నిర్వహించి తగు సూచనలు చేసారు.
ధరణి వెబ్‌సైట్‌లో అధికారులు ఏ విధంగా నమోదు చేస్తున్నారన్న విషయాన్ని కలెక్టర్ పరిశీలించారు. నమోదు ప్రక్రియను గడువులోగా వేగవంతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంత వరకు వాస్తవాలను నమోదు జరిగేటట్లు చూడాలని సూచించారు. లేనియెడల తగిన చర్యలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు.
కాలనీలలో పర్యటించిన కలెక్టర్…
తదనంతరం నగరంలో ధరణి సర్వే క్షేత్రస్థాయిలో జరుగుతున్న తీరును కలెక్టర్ భారతి హోళికేరి పరిశీలించారు. స్వయంగా మార్కండేయ కాలనీ, ఇందిరా నగర్, రాజీవ్ నగర్, అడ్డగుంటపల్లి తదితర ప్రాంతాల్లో గృహాల యజమానులతో మాట్లాడారు. సర్వే సిబ్బందికి తగు సూచనలిచ్చారు. స్పష్టంగా ఖచ్చితమైన వివరాలు నమోదు చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ దీపక్‌కుమార్, రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్‌కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్‌రావు, కమిషనర్ ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.