Home తెలంగాణ పోయిన బంగారు ఆభరణాలు .. తిరిగి ప్రత్యక్షం ..!

పోయిన బంగారు ఆభరణాలు .. తిరిగి ప్రత్యక్షం ..!

1113
1
Hospital
Government Hospital, Godavarikhani, Peddapalli District

– ప్రభుత్వ ఆసుపత్రిలో చిత్ర విచిత్రాలు
– ఆసుపత్రి సిబ్బందిపై నెపం
– విచారణ చేపట్టిన పోలీసులు
– ‘ఖని’లో ప్రభుత్వ ఆసుపత్రిలో గందరగోళం…

(ప్రజాలక్ష్యం-ప్రతినిధి)
గోదావరిఖని సెప్టెంబర్‌ 19: గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆసుపత్రిలో కరోనాతో ఓ వృద్దురాలు మృత్యువాతపడింది. మృతిచెందిన వృద్దురాలు ఒంటిపై ఉన్న సుమారు ఆరు తులాల బంగారు, వెండి ఆభరణాలు మాయమయ్యాయి. మాయం వెనుక మతలబు ఏమిటని వృద్దురాలు బంధువులు నివ్వరపోయి.. నిశ్చేష్టులయ్యారు. కరోనా సోకిన ఓ వృద్దురాలును గత రెండు రోజుల క్రితం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం నిమిత్తం చేర్పించారు. వైద్యం పొందుతున్న వృద్దురాలు శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. అయితే మృతి చెందిన వృద్దురాలి ఒంటిపై వున్న దాదాపు ఆరు తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఇది గమనించిన మృతురాలుకు చెందిన కొంత మంది బంధువులు బంగారు ఆభరణాలు పోయాయని… బంగారాన్ని ఆసుపత్రి సిబ్బంది తీసుకున్నారని నెపం వేసి లబోదిబో మంటూ రోదించసాగారు.

స్థానిక ఎన్టీనగర్‌కు చెందిన 65 సంవత్సరాల వృద్దురాలుకు కరోనా సోకింది. ఈ వృద్దురాలును గత రెండు రోజుల క్రితం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలోని కోవిడ్‌ ఐసోలేషన్‌ వార్డులో చేర్పించారు. అప్పటి నుంచి ఆ వృద్దురాలుకు ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. వైద్యం పొందుతున్న వృద్దురాలు శుక్రవారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో మృతిచెందింది.

మృతిచెందిన వృద్దురాలును ఐసోలేషన్‌ వార్డు నుంచి తీసుకెళ్లాలని బంధువులకు ఆసుపత్రి సిబ్బంది సూచించారు. అయితే మృతి చెందిన వృద్దురాలు వద్దకు ఎవరూ పోవద్దని ఆసుపత్రి సిబ్బంది మొత్తుకున్నా… మృతురాలుకు సంబంధించిన కొంత మంది చివరి చూపు కోసం వెళ్తామని.. డ్యూటీలో వున్న సిస్టర్‌ కాల్లావేళ్లా పడ్డారని, మానవతాదృక్పథంతో సిస్టర్‌ చూసేందుకు అనుమతి ఇచ్చినట్టుగా తెలిసింది.

ఆ సమయంలో ఆ ఐసోలేషన్‌ వార్డులో ఇద్దరు డ్యూటీ సిస్టర్స్‌ మాత్రమే ఉన్నారని తెలిసింది. అయితే వృద్దురాలుకు చెందిన మరికొంత మంది కుటుంబ సభ్యులు శరీరంపై వున్న బంగారు ఆభరణాలు మాయమయ్యాయని, ఆసుపత్రి సిబ్బంది తీసుకున్నారని ఆరోపిస్తూ… మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి తీసుకవెళ్లే సమస్యలేదని, బంగారు ఆభరణాలు ఇస్తేనే తీసుకెళ్తామని హంగామా సృష్టించారు.

ఈ విషయం తెలుసుకున్న ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కంది శ్రీనివాస్‌రెడ్డి హుటాహుటిన వచ్చారు. ఆసుపత్రిలో జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. వెంటనే గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వన్‌టౌన్‌ పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని జరిగిన సంఘటపై మృతిచెందిన వృద్దురాలు బంధువులు, ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన వృద్దురాలు ఉన్న ఐసోలేషన్‌లో విధుల్లో వున్న ఆసుపత్రి సిబ్బందిని పోలీసులు విచారణ చేశారు. అయినా విషయం ఒక కొలిక్కిరాకపోవడంతో.. సీసీ పుటేజీ ద్వారా మృతురాలుపై వున్న ఆభరణాలు ఎవరూ తీసుకున్నారో చూస్తామని పోలీసులు చెప్పారు. మృతురాలు బంధువులు ససేమిరా వినకపోగా, మృతదేహాన్ని తీసుకునే ప్రసక్తేలేదని.. ఆసుపత్రి కోవిడ్‌ ఐసోలేషన్‌లోనే వుంచారు.

అయితే శనివారం ఉదయం విచారణ చేస్తామని పోలీసులు చెప్పడంతో… భయాందోళనకు గురైన వృద్దురాలు బంధువులు ఒక్కసారిగా ప్లేట్‌ పిరాయించారు. ఇదంతా పెద్ద గందరగోళానికి దారితీస్తున్నట్టు బంధువులు గమనించారు. ఇంకేముందు పోయిన బంగారు ఆభరణాలు వృద్దురాలు పక్కనే ఉన్నాయని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. దీనితో పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజలు అవాక్కయ్యారు. బంగారు ఆభరణాల కథ సుఖాంతం కావడంతో పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.

ఆభరణాలు తీసినవారిపై చర్యలు తీసుకోవాలి:

మృతి చెందిన వృద్దురాలుపై ఉన్న బంగారు ఆభరణాలు తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. బంగారు ఆభరణాలు తీయడమేకాకుండా ఆసుపత్రి సిబ్బందిని అబాసుపాలు చేయడానికి పూనుకోవడం చట్టరీత్యా నేరమని పలువురు వాపోయారు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అసలు వ్యక్తులను గుర్తించి వారిపై క్రిమినల్‌ చర్యలు చేపట్టాలని పోలీసుశాఖను ఆసుపత్రి సిబ్బంది కోరారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here