– ఐదుగురి ఆన్లైన్ రమ్మీ జూదరుల అరెస్ట్
– నాలుగు సెల్ ఫోన్స్, క్యూఆర్ కోడ్ స్కానర్ బోర్డ్, హై స్పీడ్ వైఫై రూటర్ స్వాధీనం.
– వివరాలు వెల్లడించిన డీసీపి (అడ్మిన్) అశోక్ కుమార్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్ 26: ఆన్‌లైన్ రమ్మీ నిర్వహిస్తున్న ఐదురుగురి జూదరులను రామగుండం కమిషనరేటు పోలీసులు పట్టుకున్నారు. రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ వి సత్యనారాయణ ఆదేశాల మేరకు డిసిపి రవీందర్, ఎసిపి ఉమేందర్, రామగుండము సిఐ కరుణాకర్ ఆద్వర్యంలో రామగుండం టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ రాజ్ కుమార్, ఎస్సై షేక్ మస్తాన్ ఎన్టీపీసీ పోలీసులు ఎస్సై స్వరూప్ రాజ్ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్టీపీసి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ గ్రామ శివారులో ఉత్తూరు శ్రీకాంత్ అనే వ్యక్తికి సంబంధించిన విలాసవంతమైన గెస్ట్ హౌస్‌ను రైడ్ చేసి అందులో నిషేధిత ఆన్లైన్ రమ్మీ కల్చర్ అప్లికేషన్‌లో ఫేక్ జిపియస్ ద్వారా జూదం ఆడుతున్న ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు డిసిపి అడ్మిన్ అశోక్ కుమార్ తెలిపారు.
ఈ మేరకు శనివారం కమిషరేటులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మల్కాపూర్‌కు చెందిన ఉత్తూరి శ్రీకాంత్, తోటా సాయి తేజ, మహమ్మద్ హజ్రత్, గొల్లపల్లి అంజి జంగాలపల్లికి చెందిన అందుగురి సందీప్ అనే ఐదుగురి యువకులను అరెస్టు చేసి వారి వద్ద నుండి నాలుగు సెల్‌ఫోన్లు, క్యూఆర్ కోడ్ స్కానర్ బోర్డ్, హైస్వీడ్ వైఫై రూటర్ స్వాధీనం చేసుకున్నట్లు డిసిపి తెలిపారు.
ఈ సందర్బంగా డిసిపి అడ్మిన్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఆన్‌లైన్ రమ్మీలో అసలు సూత్రదారి అయిన ఉత్తూరి శ్రీకాంత్, రమేష్ పై గతంలో నిసేదిత పొగాకు ఉత్పత్తుల అయిన గుట్కాకి సంబంధించిన ఎన్టిపిసి పోలీస్ స్టేషన్ పరిధిలో 7, రామగుండంలో 1, బసంత్‌నగర్‌లో 2, అంతర్గాంలో 1 కేసులు వున్నట్లు తెలిపారు. అలాగే వరంగల్, కరీంనగర్ కమిషనరేట్ పరిధులలో కూడా పలు కేసులు ఉన్నట్టు సమాచారం వుందని తెలిపారు. ఇతనిని 2018లో 107 సీఆర్‌పీసీ సెక్షన్ ప్రకారం బైండోవర్ చేసినట్లు, ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్‌లో హిస్టరీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగిందన్నారు.
ఆన్‌లైన్ గేమ్ తెలంగాణ రాష్ట్రములో అనుమతి లేకపోవడంతో ఫేక్‌యాప్‌ని ఉపయోగించి లొకేషన్ వేరే ప్రాంతంలో వీరు ఉన్నట్లుగా చూపించే విధంగా చేసి అడుతున్నారని తెలిపారు. సదరు వ్యక్తి ఆన్లైన్ రమ్మీ ఆడడానికి ప్రత్యేకమైన ఒక గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకుని ఆ ప్రాంతంలో నలు వైపులా సిసి కెమరాలు బిగించి రాత్రి సమయంలో యువతను ఆకర్షించి ఈ ఆన్లైన్ రమ్మీ గేమ్‌కి బానిసలుగా మార్చడమే కాకుండా మరికొంత మంది చదువుకున్న విద్యార్థులకు ఈ ఆన్లైన్ రమ్మీ ట్రైనింగ్ ఇచ్చి రోజు వారితో ఈ గేమ్ నడిపిస్తున్నారని డిసిపి తెలిపారు.
ఒక్కో వ్యక్తి మొబైల్‌కి రెండువేల రూపాయల చొప్పున వారికీ చెల్లిస్తూ వారి ఆధార్‌కార్డు, పాన్ కార్డు, బ్యాంకు అకౌంట్ వివరాలు ఇస్తూ, వారి ఫోన్ ద్వార పెట్టుబడి పెట్టి గెలిచినా మొత్తం డబ్బు తాను తీసుకోవడం జరుగుతుందని, ఒకే సారి మూడు ఫోన్లు లాగినై వ్యతిరేకంగా వచ్చే ముగ్గురిని మోసం చేసే విధానంతో ట్రైనింగ్ ఇస్తూ, రోజుకి పది వేల నుండి పదిహేను వేల రూపాయల రాబడి, అది కేవలం 30 నిమిషాల్లో సంపాదిస్తూ, ఇలా రోజంతా సాగించేవారని తెలిపారు. యువతకు చెడు అలవాట్లకు బానిసలు చేస్తూ వారి బంగారు భవిష్యత్తు నాశనం చేస్తున్నారని తెలిపారు.
ఆన్‌లైన్‌లో రమ్మీ కోసం మొబైల్ ఇచ్చిన వారి జాబితా కూడా సేకరించడం జరుగుతుందని వారి పై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది డిసీపీ తెలిపారు. శ్రీకాంత్‌కు వివిధ బ్యాంకులలో అకౌంట్స్ వున్నాయని, ఇన్‌కంటాక్స్ అధికారులతో ఇతని ఆస్తుల లావాదేవీల పై విచారణ చేపించడం జరుగుతుందని తెలిపారు. అక్రమ ఆస్తులు ఉంటె వాటిని సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు.
ఉత్తూరి శ్రీకాంత కొత్తగా అన్ని రకాల ఆన్లైన్ గేమ్‌లు ఒకయాప్‌లో అడే విదంగా ఆర్‌జీఎస్‌సీ గేమ్స్ అండ్ టెక్నాలజీ ప్రైవేట్ లీమిటెడ్ పేరుతో ఒకే యాప్‌ని రాజస్తాన్ రాష్ట్రము జైపూర్‌లో రిజిసర్ట్ చేసుకొని త్వరలో ఆ యాప్‌ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తునట్టు మా విచారణలో వెల్లడయిందని డీసీపీ తెలిపారు.
ఆన్ లైన్ గేమ్స్ కు బానిసైన లక్షలలో డబ్బు పోగొట్టుకొని మానసిక వేదనతో యువకులు బలవన్మరణాలకు పాల్పడిన ఘటనలు తరచుగా చూస్తూనే ఉన్నాం. ఇటీవల లాక్ డౌన్ సమయంలో ఈ సంఖ్య మరింత పెరిగిందన్నారు. ఆన్‌లైన్ రమ్మీ వ్యసనానికి బానిస కాకుండా ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించడమే ఉత్తమ పరిష్కార మార్గంమని, ఆ దిశగా వారికి అవగాహన కల్పించాలని డీసీపి ఆశోకుమార్ తెలిపారు.