-ఉద్యోగ నియామకాల్లో నాకు సంబంధం ఉందంటున్న నాయకుల్లారా
ఆధారాలతో రండి ఆర్‌ఎఫ్‌సిఎల్ గేట్ వద్దే తేల్చుకుందాం..
-బాధితులకు అండగా ఉంటా
-రౌండ్ టేబుల్ సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, ఆగష్టు 2ః ఆర్‌ఎఫ్‌సిఎల్ ఉద్యోగ నియామకాల్లో డబ్బులు చేతులు మారడంలో తనకు సంబంధం ఉందని విలేకరుల సమావేశాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఆరోపణలు చేస్తున్న నాయకుల్లారా! ఈనెల 4న ఉదయం 10గంటలకు ఆర్‌ఎఫ్‌సిఎల్ గేట్ వద్దకు సాక్ష్యాధారాలతో రండి! ప్రజల మధ్యనే తేల్చుకుందామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బహిరంగ సవాల్ విసిరారు.
ఈ మేరకు మంగళవారం స్థానిక మార్కండేయకాలనీలోని శ్రీ లక్ష్మి ఫంక్షన్ హాల్‌లో రామగుండం నియోజక వర్గ స్థాయి టిఆర్‌ఎస్ పార్టీ ఇంఛార్జ్‌లు, అధికార ప్రతినిధులు, పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, సమన్వయ కమిటీ సభ్యులు, డివిజన్, గ్రామ ఇంఛార్జ్‌లు, యువజన, మహిళా, సోషల్ మీడియా విభాగం సభ్యులు, వార్డు ఇంఛార్జ్‌లతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ఆయన పాల్గొన్నరు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ… ఆర్‌ఎఫ్‌సిఎల్ ఉద్యోగ నియామకాల నెపంతో తనపై బురదజల్లే కుట్ర జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఘాటుగా స్పందించారు. నియామకాల పేరుతో డబ్బులు చేతులు మారిన వైనంలో నిరాధారంగా తనపై విలేకరుల సమావేశాల్లో, సోషల్ మీడియాల్లో ప్రతిపక్ష పార్టీల నాయకులు విష ప్రచారం చేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు 795మంది లిస్ట్ తమ దగ్గర ఉందని, రూ.45కోట్లు చేతులు మారాయని ఆరోపిస్తూ, అమాయకపు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్న బిజేపీ, కాంగ్రెస్ నాయకుల్లారా! మీ దగ్గర ఉన్న ఆధారాలతో ఆర్‌ఎఫ్‌సిఎల్ గేట్ వద్దకే నేరుగా రండి! ప్రజల మధ్యనే, బాధితుల మధ్యనే నిజానిజాలు తేల్చుకుందామని సవాల్ విసిరారు.
ఉద్యోగాల పేరుతో పైరవీకారులకు, మధ్య దళారులకు డబ్బులిచ్చిన బాధితులకు తాను అండగా ఉంటానని, చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీస్ శాఖకు సిఫారసు చేస్తానన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ వారే దోషులుగా తేలిన పక్షంలో ఎంతటివారైన ఉపేక్షించేది లేదని, పార్టీ నుంచి బహిష్కరించడమే కాక, చట్టపరంగా చర్యలు చేపడుతానని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో డిప్యూటి మేయర్ నడిపల్లి అభిషేక్ రావు, జడ్‌పిటిసి అముల నారాయణతో పాటు కార్పొరేటర్లు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.