Home తెలంగాణ ఆర్థిక భరోసాను కల్పిస్తున్న ప్రెస్ అకాడమీ

ఆర్థిక భరోసాను కల్పిస్తున్న ప్రెస్ అకాడమీ

831
0
Press Academy
Press Academy Chairman Allam Narayana distributes financial assistance checks to journalist families

– చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయ చెక్కుల పంపిణి
– సంక్షేమ నిధి – జర్నలిస్టుల పెన్నిధి
– ప్రెస్అకాడమి చైర్మన్ అల్లం నారాయణ

(ప్రజాలక్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, డిసెంబర్ 15: విధి నిర్వహణలో ఉంటూ మరణించిన జర్నలిస్టుల కుటుంబా లకు అండగా నిలుస్తూ… ఆర్థిక భరోసాను కల్పిస్తున్న సంస్థ దేశంలోనే తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి మాత్రమే అని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు.

బుధవారంనాడు మాసబ్ ట్యాంక్ లోని సమాచార భవన్ లో గల మీడియా అకాడమీ కార్యాలయంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి 65 మంది కోవిడ్-19తో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల వంతున చెక్కులను, 40 మంది సాధారణ మరణం చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఒక లక్ష రూపాయల చొప్పున, ప్రమాదాలు/తీవ్ర అనారోగ్యం బారిన పడిన 8 మంది వర్కింగ్ జర్నలిస్టులకు యాభై వేల రూపాయల చొప్పున మొత్తం ఒక కోటి 74 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, జర్నలిస్టు, ఆందోల్ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్, శాసనమండలి సభ్యులు గోరటి వెంకన్నలతో కలిసి లబ్దిదారులకు అందజేశారు.

Press Academy
Press Academy Chairman Allam Narayana speaking at a Programmr distribute financial assistance checks to journalist families

ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారని ఇప్పుడు ఈ నిధి జర్నలిస్టుల పెన్నిధిగా మారిందని తెలిపారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమం కొరకు జర్నలిస్టుల సంక్షేమ నిధిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఇందులో భాగంగా జర్నలిస్టుల సంక్షేమ నిధికి మొత్తం 42 కోట్ల రూపాయలు విడుదల అయ్యాయని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఇప్పటి వరకు 353 కుటుంబాలకు లక్ష రూపాయల వంతున, 116 మందికి 50 వేల చొప్పున ఆర్థిక సహాయం చేశామన్నారు. అంతేగాక కరోనా వైరస్ బారిన పడిన 3915 మంది జర్నలిస్టులకు తక్షణ సహాయంగా మొదటి విడత కరోనా వైరస్ బారిన పడిన వారికి 20 వేల చొప్పున, రెండవ విడత కరోనా వైరస్ బారిన పడిన వారికి 10 వేల చొప్పున 5.70 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని ఆయన తెలిపారు.

Press Academy
Family members of the deceased journalists who participated in the event

ఇప్పుడు ఆర్థిక సహాయం అందించిన జర్నలిస్టు కుటుంబాలకు నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ ను అయిదేళ్లపాటు అందిస్తామని, ఆయా కుటుంబాలలోని ఒకటి నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ట్యూషన్ ఫీజును చెల్లిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

జర్నలిస్టులకు ఒక వైపు సంక్షేమంతోపాటు శిక్షణా కార్యక్రమాలు, జర్నలిస్టుల కోసం 12 పుస్తకాలు, మీడియాలో పని చేసే జర్నలిస్టులకు అక్రడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు అందించామని, కొన్ని జిల్లా కేంద్రాలలో ఇండ్ల స్థలాలు అందించడానికి కృషి చేస్తున్నట్లు, ఇంకా కొన్ని ప్రాంతాలలో ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వార్తల కవరేజీలో భాగంగా వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులతో సమానంగా వారియర్స్ గా పని చేసి కరోనా వార్తలను, వాస్తవాలను సేకరించి ప్రపంచానికి తెలియజేయడంలో జర్నలిస్టుల కృషి ఎనలేనిది అన్నారు. ఆ సందర్భంలో కరోనా బారిన పడి చిన్నా పెద్ద తేడా లేకుండా అనేక మందిని కొల్పోయిన సందర్భంలో జర్నలిస్టులు కూడా కరోనా బారిన పడి మరణించడం తీవ్రంగా కలిచి వేసిన అంశం అని వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి ఉద్విఘ్నంగా ప్రకటించడం జరిగిందని ఆయన తెలిపారు.

press academy
receiving a financial aid cheque from Allam Narayana Wife of Sirisilla Shankar, a senior journalist who died with Corona

ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు ప్రత్యేక చొరవ ద్వారా ఏర్పాటైన జర్నలిస్టుల సంక్షేమ నిధి ద్వారానే జర్నలిస్టులకు ఆర్థిక భరోసా కల్పించిన ఈ ఘనత మొత్తం తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ దే అని మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ అన్నారు.

Press Academy
Journalist and MLA Ch. Kranthi speaking at a function to distribute financial assistance checks to journalist families

జర్నలిస్టు, ఆందోల్ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఉద్యమకారులకు మొదటి ప్రాధాన్యతనిస్తూ మొట్టమొదటగా తెలంగాణ ప్రెస్ అకాడమి ని ఏర్పాటు చేసి జర్నలిస్టు నాయకుడు అల్లం నారాయణ ని చైర్మన్ గా నియామకం చేసినారు. తెలంగాణలోని జర్నలిస్టులకు అండగా నిలుస్తూ అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు మంజూరు చేయడమే గాక ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద సుమారు 5 కోట్ల రూపాయలు జర్నలిస్టుల ఆరోగ్యం, ఆపరేషన్ ఖర్చుల కొరకు మంజూరు చేయించడం జరిగిందన్నారు. జర్నలిల్టులకు ప్రత్యేక నిధి కల్పించి, 100 కోట్లు కేటాయించి ఇప్పటికే 500 మందికి సహాయం చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని క్రాంతి అన్నారు. జర్నలిస్టులకు ఇలా సంక్షేమం కల్పించిన మరో రాష్ట్రాన్ని చూపాలని ఆయన సవాల్ విసిరారు.

శాసనమండలి సభ్యులు గోరటి వెంకన్న మాట్లాడుతూ, నేను ఈ రోజు ఈ స్థానంలో ఉండడానికి జర్నలిస్టుల మిత్రుల సహకారమే అన్నారు. నా పాటలకు విస్తృత ప్రచారం గావించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జర్నలిస్టుల కుటుంబాల వారు ఆర్థిక సహాయాన్ని ఉపయుక్తం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ డి.ఎస్. జగన్, అకౌంట్స్ ఆఫీసర్ పూర్ణ చందర్ రావు, మేనేజర్ వనజ, టీయూడబ్ల్యూజె కోశాధికారి మారుతి సాగర్, టెంజూ రాష్ట్ర అధ్యక్షులు ఇస్మాయిల్, టీయూడబ్ల్యూజె నాయకులు యోగానంద్, నవీన్, ఆదినారాయణ, విష్ణు, అవ్వారి భాస్కర్, టీపిజెఎ అధ్యక్షులు భాస్కర్, వీడియో గ్రాఫర్ల సంఘం నాయకులు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here