(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్ 11: రామగుండం మున్సిపల్ మాజీ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నేత బడికెల రాజలింగం మృతి చెందారు. లివర్ కు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న ఆయన కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రోజు తెల్లవారుజామున మరణించారు. బడికెల పార్థీవ దేహాన్ని గోదావరిఖని లక్ష్మినగర్ లోని ఆయన స్వగృహంలో వుంచారు. బడికెల రాజలింగం మున్సిపల్ చైర్మన్ గా జూలై 2004 నుండి జూలై 2009 వరకు కొనసాగారు. ఎన్టీపీసీ (కడప)లో స్టోర్ కీపర్ గా పనిచేసిన బడికెల రామగుండం ఎన్టీపీసీలో కొంత కాలం పనిచేశారు. రామగుండం ఎన్టీపీసీ లో మల్టిపుల్ కాంట్రాక్టు కార్మిక సంఘానికి నాయకునిగా వ్యవహరించారు. 1994 కాంగ్రెస్ పార్టీ తరపున మేడారం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గా బరిలో నిలిచి, ఓటమి పాలయ్యారు. బడికెల ఐ.ఎన్.టి.యు.సి.లో వివిధ హోదాలలో పనిచేశారు. కాంగ్రెస్ నేతగా, ట్రేడ్ యూనియనిస్టుగా, మున్సిపల్ చైర్మన్ గా రామగుండం రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. బడికెల మృతికి పలువురు ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు సంతాపం తెలిపారు.