(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, సెప్టెంబర్ 10: నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న స్మార్ట్ సిటి పనులను నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ 6 నెలల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్మార్ట్ సిటి పనులపై నగర మేయర్ వై. సునీల్ రావు, పోలిస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి, వల్లూరి క్రాంతి, మున్సిపల్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, కన్సల్టెంట్స్ తో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ స్మృతివనాల అభివృద్ది చాల ముఖ్యమని, దీనిలో తక్కువ శ్రమ ఎక్కువ వ్యయం వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. స్మృతివనాలకు, ఉజ్వల పార్క్ లకు వేరు వేరు రోడ్లు వేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు. ఉజ్వల పార్క్ లో ఉన్న వాటిని సరిచేయడం కాకుండా కొత్త కొత్త హంగులతో కొత్తదనం వచ్చేలా అభివృద్ది చేయాలని అన్నారు. అలాగే లేజర్ షో ప్లాన్ చేస్తే బాగుంటుందని తెలిపారు. అలాగే స్మృతి వనం నుండి ఎలగందుల పోర్ట్ వరకు బోట్ సౌకర్యం కల్పిస్తే ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు. అంతేకాకుండా సిరిసిల్ల బైపాస్ రోడ్డు వద్ద అభివృద్ది చేసి, మానేర్ రివర్ ఫ్రంట్ కొత్తగా చేయాలని అది కూడా 6 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ పనులను తొందరగా, రెవెన్యూ పరంగా సస్టేనేబుల్ వస్తుందని ఆయన అన్నారు. స్మృతివనం, ఉజ్వల పార్క్ ప్రాజెక్ట్ పనులను త్వరితగతిన గ్రౌండ్ లెవల్ లో 3 నుండి 4 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. లీనియర్ పబ్లిక్ పార్క్, అడ్వెంచర్ యాక్టివిటీస్ పై దృష్టి పెట్టాలని, సైక్లింగ్, బోటింగ్, వాటర్ పారాసెలింగ్, వాటర్ రైడ్స్ పై దృష్టి సారించాలని కోరారు. సీనియర్ సిటిజెన్స్ కి, పిల్లలకు ఆడుకునెందుకు, వాకింగ్ చేసెందుకు గ్రీనింగ్ ఏరియా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. మానేర్ రివర్ ఫ్రంట్ లేజర్ ఫో కి రిపోర్ట్ సెప్టెంబర్ లోగా సమర్పించాలని ఆయన అన్నారు. స్వచ్చ్ సర్వేక్షన్ లో భాగంగా డంపింగ్ యార్డ్ పనులను, చెత్త సేకరణకు ఆటో, ట్రాక్టర్ కు జిపిస్ సిస్టం ఉంటుందని ఆయన అన్నారు. స్మార్ట్ సిటి పనులలో నిర్మాణంలో ఉన్న రోడ్లు పనుల వారిగా నమూనా తయారు చేసి ఎన్ని రోజులలో పనులు పూర్తి చేస్తారో పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించారు. నగర సుందరీకరణ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో నగర మేయర్ వై.సునీల్ రావు, పోలిస్ కమీషనర్ కమలాసన్ రెడ్డి, అడిషనల్ డి.సి.పి. చంద్రమోహన్, ఏ.సి.పి.లు, పోలిస్ అధికారులు, ట్రైని కలెక్టర్ అంకిత్, మున్సిపాల్ కమిషనర్ వల్లూరీ క్రాంతి, టౌన్ ప్లానింగ్ అధికారులు, స్మార్ట్ సిటీ కన్సల్టెంట్స్, కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.