(ప్రజాలక్యం ప్రతినిధి)
గోదావరిఖని, ఏప్రిల్ 1, రామగుండం పారిశ్రామిక ప్రాంత సీనియర్ జర్నలిస్టు, గోదావరిఖని కార్మిక క్షేత్రానికి పత్రికలను పరిచయం చేసిన బండారి కిష్టయ్య ఇక లేరు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం 5 గంటలకు గోదావరిఖనిలోని ఆయన నివాసంలో అకస్మికంగా మరణించాడు.
వ్యవసాయ కుటుంబంలో పుట్టిన కిష్టయ్య 1968లో ఉపాధి కోసమై గోదావరిఖని వచ్చారు. రామగుండం పవర్ హౌజ్ లో తాత్కాలిక ఉద్యోగిగా కొంత కాలం పనిచేసారు. ఆ పనిలో ఇమడలేక గోదావరిఖనిలోని శివాజీనగర్ లో పాన్ షాపు ప్రారంభించి కొత్త జీవితాన్ని ఆరంభించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి పత్రికల ఏజెంటుగా ఈ పాన్ షాప్ అడ్డాగా చేసుకొని పాఠకులకు పత్రికలను పరిచయం చేసి మరో అధ్యాయానికి తెర లేపారు. అనేక ఏళ్ళపాటు గని కార్మికుల, పాఠక లోకానికి కిష్టయ్య కిష్టన్నగా సుపరిచితు లయ్యారు.
ఈ నేపథ్యంలోనే గని కార్మికుల సాధక బాధకాలను, వారి ఇబ్బందులను దగ్గరగా గమనించి పత్రికల ద్వారా వారి జీవన విధానాలను లోకానికి తెలియజేశారు. ఈ క్రమంలోనే గోదావరిఖని తొలి తరం పాత్రికేయ మిత్రులు అల్లెంకి లచ్చయ్య, పిట్టల రాజేందర్, వేల్పుల నారాయణ, జక్కం మారుతి, కె.పి. రామస్వామి, ఎం. సుధాకర్, పిట్టల రవీందర్ తదితరులతో కలిసి గోదావరిఖని ప్రెస్ క్లబ్ ప్రారంభించాడు. క్లబ్ ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించారు.
తదనంతరం “కోల్ బెల్ట్’ అనే వార పత్రికను 1986లో ప్రారంభించారు. “అబంపి’ పబ్లికేషన్స్ నేతృత్వంలో “నల్లవజ్రం’ “నల్ల కలువలు’ వంటి పుస్తకాల ప్రచురణ ద్వారా గని కార్మికుల సాధక బాధకాలను బయటి ప్రపంచానికి తెలిసేలా చేసాడు.
జర్నలిస్టు యూనియన్ బలపడటానికి జిల్లా, రాష్ట్రస్థాయి నాయకత్వ బాధ్యతలను నిర్వహించడంతో పాటు అనేక జర్నలిస్టు సమస్యల సాధన ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. ఉవ్వెత్తున జరిగిన తెలంగాణా ఉద్యమంలొ కూడ ప్రముఖంగా ముందున్నారు… అంతేకాకుండా మలిదశ తెలంగాణ ఉద్యమంలో గోదావరిఖని కేంద్రంగా నడిపిన జర్నలిస్టు ఉద్యమంలో పెద్దదిక్కుగా వున్నాడు.
గోదావరిఖని జర్నలిస్ట్ లను ఒక సంఘటిత శక్తి గా తీర్చిదిద్ది, మంచిచెడులను విడమర్చి చెప్పి కుటుంబ పెద్దగా అందరినీ ముందుకు నడిపించిన బండారి కిష్టయ్య మరణం జర్నలిస్టు లోకానికి, రామగుండం పారిశ్రామిక ప్రాంతం ప్రజలకు తీవ్ర దిగ్ర్బాంతి కలిగించింది.
గోదావరిఖని ప్రెస్ క్లబ్ సంతాపం
బండారి కిష్టయ్య మృతి పట్ల గోదావరిఖని ప్రెస్ క్లబ్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. క్లబ్ సభ్యులు ఆయన నివాసానికి వెళ్లి మృత దేహంపై పుష్పగుచ్చం వుంచి ఘనంగా నివాళు లర్పించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ నిర్మాణంలోనూ, వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ బలోపేతానికి కిష్టయ్య ఎనలేని సేవలందించారని ప్రెస్ క్లబ్ పేర్కొంది. క్లబ్ వ్యవస్థాపక సభ్యునిగా… క్లబ్ సభ్యులను ఐక్యత వైపు నడిపించటంలొ కిష్టయ్య చైతన్యం కల్పించటంతొ పాటు… ఉమ్మడి కరీంనగర్ జిల్లాలొ జర్నలిస్టు సంఘాన్ని బలొపేతం చేయటంలొ కీలక పాత్రను పొషించారు. కిష్టన్న మరణం ఈ ప్రాంత పాత్రికేయ రంగానికి తీరని లొటని తెలిపింది. కిష్టయ్య కుటుంబ సభ్యులకు క్లబ్ సానుభూతి ప్రకటించింది.
కిష్టయ్య మృతి పట్ల వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ల రాష్ట్ర, జిల్లా నాయకులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అలాగే రామగుండం పారిశ్రామి ప్రాంత పుర ప్రముఖులు, సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు నివాళులర్పించి సంతాపాన్ని తెలిపారు.