– సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజిరెడ్డి
(ప్రజాలక్ష్యం విలేకరి)
మందమర్రి, అక్టోబర్ 9: సింగరేణి యాజమాన్యం 2019-20 ఆర్థిక సంవత్సరం లాభాలను తక్కువగా చూపడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజా రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మందమర్రి ఏరియాలోని కేకే ఓసిపి నందు గురువారం నిర్వహించిన ద్వార సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం కంటే కార్మికుల సంఖ్య తక్కువగా ఉండడం, సీనియర్ కార్మికులు దిగిపోయి, జూనియర్ కార్మికులు విధుల్లో చేరడం, వారి జీతభత్యాల వ్యత్యాసాలు, గత సంవత్సరంలాగే ఉత్పత్తి ఉండడం, అయినా లాభాల్లో భారీ వ్యత్యాసం ఉండడం కార్మికులకు అనుమానం కలిగిస్తోం దన్నారు. యాజమాన్యం లాభాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మందమర్రి ఏరియాలోని కేకే ఓసిపి కార్మికులకు యాజమాన్యం తీవ్ర నష్టాన్ని కలిగి స్తుందని, గతంలో కేకే 2 గని కార్మికులకు ఇంటి అద్దె 10 శాతం చెల్లించగా అదే స్థానంలో ఏర్పడిన వచ్చిన కార్మికులకు ఇంటి అద్దె చెల్లించకపోవడం అంతర్యం ఏమిటి అని ఆయన యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఇన్ని సంవత్సరాలుగా ఏరియాలో ఉన్న గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు ఇంటి అద్దెను చెల్లించకపోవడం పై పట్టించుకోకపోవడం శోచనీయ మన్నారు. అదేవిధంగా 30 కిలోమీటర్ల దూరంలో గల ఎస్టిపీపీ కి బొగ్గు రవాణా చేసే ఎంవి డ్రైవర్లకు నిబంధనల ప్రకారం చెల్లించవలసిన టిఎ, డిఏ లు చెల్లించడం లేదని ఆరోపించారు. యాక్టింగ్ కార్మికులను ప్రమోషన్లు కల్పించాలని, ఓసీపీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
కోల్ ఇండియాతో అక్టోబర్ 15న కలకత్తాలో నిర్వహించు సమావేశంలో కార్మికులకు పిఎల్ఆర్ బోనస్ గతం కంటే ఎక్కువగా వచ్చేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు కార్మికులకు మేలు చేసేలా లేవని, ప్రభుత్వ రంగ సంస్థల పట్ల, కార్మిక ప్రయోజనాల పట్ల కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోందని ఘాటుగా విమర్శించారు. కార్పొరేట్ పెట్టుబడిదారులకు మేలు చేసే విధంగానే కేంద్ర నిర్ణయాలు ఉన్నాయని ఆరోపించారు. కార్మిక సమస్యల పరిష్కారానికి సిఐటియు నిరంతరం పోరాటం కొనసాగుతూనే ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ నాగరాజు గోపాల్, ఏరియా అధ్యక్షులు ఎస్ వెంకటాస్వా మి, ఏరియా కార్యదర్శి అల్లి రాజేందర్, నాయకులు వి ఐలయ్య, జే వెంకటేష్,ఎం రాయమల్లు, ఓసిపి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.