– బాధిత కుటుంబానికి యాభై లక్షల చెక్కును అందించిన సింగరేణి డైరెక్టర్ యస్.చంద్రశేఖర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, నవంబర్ 11: తెలంగాణ రాష్ట్రంలో మొదటి కరోనా వారియర్ బీమా చెక్కును సింగరేణిలో అందిస్తున్నామని డైరెక్టర్ (ఆపరేషన్ & పా) యస్. చంద్రశేఖర్ తెలిపారు. సింగరేణి ఆర్జీవన్ ఏరియా హాస్పిటల్‌లో గనిరెడ్డి గురుమూర్తి స్వీపర్ (నైట్ సాయిల్)గా కరోనా వార్డ్‌లో విధులు నిర్వహించే క్రమంలో అతనికి కరోనా వ్యాధి సోకి జూలై 7న మరణించాడు.
ఇందుకు గాను ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజ్ (కోవిడ్-19తో పోరాడే ఆరోగ్య కార్యకర్తలకు వర్తించే ఇన్సూరెన్స్ స్కీమ్) యాభై లక్షల రూపాయల చెక్కును బుధవారం రోజున ఏరియా హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో బాధితుని భార్య గనిరెడ్డి లలిత వారి కుటుంబ సభ్యులకు డైరెక్టర్ యస్. చంద్రశేఖర్ అందించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ (ఆపరేషన్స్ & పా) యస్. చంద్రశేఖర్ మాట్లాడుతూ కరోనా వ్యాధితో బాధపడుతున్న రోగులకు సేవలందించే క్రమంలో గనిరెడ్డి గురుమూర్తి కూడా కరోనా వ్యాది సోకి మరణించటం భాదాకరమైనదని విచారం వ్యక్తం చేసారు. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం ద్వారా లభించు ఇన్సూరెన్స్ వారి కుటుంబ సభ్యులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోనే మొట్ట మొదటి సారిగా ఈ ఇన్సూరెన్స్ సింగరేణిలోనే రావటం జరిగిందని తెలిపారు. గురుమూర్తి మరణం వారి కుటుంబానికి తీరని లోటు అని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామని తెలిపారు. వారి మరణం సైనికుడి మరణంతో సమానం అని కొనియాడారు. ఈ సందర్భముగా కాంపన్ సెటివ్ ఎప్లాయిమెంట్ క్రింద అతని పెద్ద కుమారునికి సింగరేణిలో ఉద్యోగం ఇవ్వటం జరుగుతుందని తెలిపారు.
సింగరేణిలో కరోనా నియంత్రణకు అన్నీ రకాల నివారణ చర్యలను చేపటామని చెప్పారు. 50,000ల టెస్టింగ్ కిట్‌లను తీసుకువచ్చామని, ఇంకా 3వేల కిట్‌లని తీసుకు రాబోతున్నామని తెలిపారు. సింగరేణి ఉద్యోగులంతా స్వీయ నియంత్రణను పాటిస్తూ కరోనాను నివారించేందుకు పాటుపడాలని సూచించారు. ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరిస్తూ, సామాజిక దూరం పాటించాలని డైరెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ జిఎం కె నారాయణ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ మిర్యాల రాజీ రెడ్డి, ఆర్జీవన్ ఉపాధ్యక్షులు గండ్ర దామోదర్ రావు, సింగరేణి కోవిడ్ ఇంచార్జ్ బాల కోటయ్య, ఎస్‌ఓటు డైరెక్టర్ దేవి కుమార్, సిఎంఓఎఐ అధ్యక్షులు మనోహర్, ఎస్‌ఓటు జిఎం త్యాగరాజు, ఏసిఎంఓ బి. వెంకటేశ్వర్ రావు, పర్సనల్ మేనేజర్ యస్.రమేష్, ఫిట్ సెక్రటరీలు రత్నమాల, యాదవరెడ్డి, సీనియర్ పిఓ బి.సారంగ పాణి, సంక్షేమ అధికారి శ్రీనివాస్ మరియు డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది, ఏరియా ఆస్పత్రికి ఉద్యోగులు పాల్గొన్నారు.