Home తెలంగాణ సింగరేణి కార్మికులకు 35శాతం లాభాల వాటా చెల్లించాలి ..

సింగరేణి కార్మికులకు 35శాతం లాభాల వాటా చెల్లించాలి ..

442
0
AITUC meeting
AITUC leaders speaking at the meeting

– సింగరేణిలో ఎన్నికలు నిర్వహించాలి..
– కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక చర్యలను వ్యతిరేకించని బిఎంఎస్‌.
– పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం ఏఐటియుసి

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్‌ 27: సింగరేణి కార్మికులకు లాభాల్లో 35శాతం వాటా చెల్లించాలని, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను బీఎంఎస్‌ వ్యతిరేకించడం లేదని ఎఐటియుసి నాయకులు అన్నారు. ఆదివారం గోదావరిఖని భాస్కర్‌ రావు భవన్‌లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ కేంద్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఆరెల్లి పోశం, ఆర్‌జీ-వన్‌ బ్రాంచి కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్‌ మాట్లాడుతూ సింగరేణిలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటియుసి అనేక పోరాటాలు చేసిందన్నారు. పోరాట కార్యక్రమాల వల్లనే సింగరేణిలో సమస్యల పరిష్కారానికి యాజమాన్యం స్పందిస్తున్నదని పేర్కొన్నారు.

టీబిజికేఎస్‌ యూనియన్‌ కార్మికులకు చేసింది ఏమీ లేదని వారన్నారు. కోవిడ్‌-19 పేరుతో కట్‌ చేసిన జీతాలను ఇప్పించ లేకపోయారని, లాభాల వాటా గురించి ముఖ్యమంత్రిని ఇంతవరకు కలవలేదని, కార్మికులు లాభాల వాటా ఎప్పుడిస్తారని ఎదురు చూస్తున్నారని అన్నారు. సింగరేణిలో ఎన్నికల కాలపరిమితి పూర్తయినా యాజమాన్యం, టీబిజికేఎస్‌ ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకుంటున్నాయన్నారు. వెంటనే ఎన్నికలు నిర్వ హించాలని వారు డిమాండ్‌ చేశారు.

కేంద్ర ప్రభుత్వం కార్మిక చర్యలకు పాల్పడితే సింగరేణిలో బిఎంఎస్‌ యూనియన్‌ అడ్డుకోవడం లేదని, కేవలం జాతీయ సంఘంగా ఉండి ఇతర జాతీయ సంఘాలను విమర్శలు చేయడం తప్ప కార్మికులకు చేసిందేమీ లేదని వారన్నారు.

ముఖ్యంగా లాభాల్లో నడుస్తున్న బొగ్గు పరిశ్రమను దేశంలో రాష్ట్రంలో గుర్తించిన బొగ్గు బ్లాకులను కోల్‌ ఇండియాకు మరియు సింగరేణికి కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం టెండర్ల ద్వారా కార్పొరేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేస్తే బిఎంఎస్‌ యూనియన్‌ ఎందుకు అడ్డుకోవడం లేదని వారు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడగలేదని వారు ప్రశ్నించారు. కోల్‌ బెల్ట్‌ ప్రాంత ఎంపీలు కార్మికుల ఓట్లతో గెలిచి , బొగ్గుగని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కేంద్రంపై ఒత్తిడి చేయడంలో వైఫల్యం చెందారని వారు విమర్శించారు.

అదేవిధంగా వివిధ వత్తులలో యాక్టింగ్‌ చేసిన కార్మికులకు అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని, ఖాళీగా ఉన్న పోస్టులను అంతర్గత కార్మికులచే భర్తీ చేయాలని, సర్ఫేస్‌లో పనిచేస్తున్న కార్మికులకు ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు.

ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు జిగురు రవీందర్‌ ,వెంకట్‌ రెడ్డి, చెప్యాల మహేందర్‌ రావు, గోశిక మోహన్‌, భోగ సతీష్‌ బాబు, పైడిపాల రాజయ్య, పార్లపల్లి రామస్వామి, మోదుగుల సంపత్‌, జి ప్రభుదాస్‌, టి రవీందర్‌, ఉప్పులేటి తిరుపతి, మిట్ట శంకర్‌, ఆఫీస్‌ కార్యదర్శి టి రమేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here