– జిల్లా కలెక్టర్ కె.శశాంక
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, అక్టోబర్ 2: స్వచ్చభారత్ మిషన్ 2.0 ని విజయవంతంగా చేయాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. శుక్రవారం స్వచ్చభారత్ మిషన్ 2.0 పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ కె.శశాంక పాల్గొన్నారు. స్వచ్చభారత్ మిషన్ మొదటి విడుతలో కష్టపడి పనిచేసి, జాతీయ స్థాయిలో బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాల జాబితాలో కరీంనగర్ జిల్లాను ముందు వరుసలో నిలబెట్టిన జిల్లా ప్రజలకు, జిల్లా యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు. స్వచ్చభారత్ మిషన్ రెండవ విడుతలో ఇష్టపడి పనిచేసి సుస్థిరతను కొనసాగించాలి కోరారు.
రెండవ దశలో ప్రధానమైన ఘన, ద్రవ, వ్యర్థ పదార్థాల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తూ, తడి, పొడి చెత్తను సక్రమ నిర్వహణ, పొడి చెత్తను వేరు చేసి కంపోస్ట్ షెడ్ కు తరలించుట, తడి చెత్తను సెంద్రియ ఎరువుగా మార్చి చెత్త నుండి సంపదను సృష్టించే విధంగా చూడాలని కోరారు. మురికి నీరు సక్రమంగా నిర్వహించుకుంటూ ఇంకుడు గుంతల నిర్మాణం చేయాలని చెప్పారు. అలాగే పరిశుభ్రతతో పాటు భూగర్భ జలాలను పెంపొందించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి ప్రాధాన్యతగా పరిశుభ్రమైన ఆరోగ్య కరమైన గ్రామాల రూప కల్పన మనందరి బాధ్యతని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో స్వచ్చ భారత్ లో మురికి నుండి విముక్తి విభాగంలో అవార్డుకు కృషి చేసిన గ్రామ, మండల, జిల్లా స్థాయి ఉద్యోగులకు, ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు, పారిశుద్ద్య సిబ్బందికి, పేయింటర్లకు అభినందనలు తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్సులో సహాయ కలెక్టర్ (ట్రైనీ0 అంకిత్, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా పంచాయతి అధికారి వీర బుచ్చయ్య, డి.ఎల్.పి.ఓ హరికిషన్, యూనిసెఫ్ కో ఆర్డినేటర్ కిషన్ స్వామి, ఎస్.బి.ఎం. రమేష్, తదితరులు పాల్గొన్నారు.