– ఛేదించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
(మేజిక్ రాజా-ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 20: పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి ముస్త్యాల గ్రామ శివారులో గుప్త నిధుల తవ్వకాల కోసం తిరుగుతున్న ముఠా సభ్యులను బుధవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించి అదుపులోకి తీసుకున్నారు.
టాస్క్ ఫోర్స్పో లీసులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాలకు చెందిన సాన తిరుపతి, అసిఫాబాద్ కు చెందిన పానగంటి హరీష్, బెల్లంపల్లికి చెందిన ఈట కృష్ణ, కాసిపేటకు చెందిన గొర్లవల్లి అశోక్ ఒక ముఠాగా ఏర్పడి పురాతన ఆలయాలు, ప్రదేశాలలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపు తున్నారు.
ఈ క్రమంలోనే బుధవారం వారు ముస్త్యాల గ్రామ శివారులో కారులో అనుమానాస్పదంగా తిరుగుతుండగా, ప్రశ్నించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి వారిని, కారును తనిఖీ చేయగా మెటల్ డిటెక్టర్,ఇతర ఎలక్ట్రికల్ డివైజెస్ లభించాయి. ఇవి మీ దగ్గర ఎందుకు ఉన్నాయని తరచితరచి ప్రశ్నించగా, పురాతనమైన ప్రాంతాలలో గుప్త నిధులు ఉంటాయని, వాటిని గుర్తించడం కోసం తిరుగుతున్నామని చెప్పారు. వారిని అదుపులోకి తీసుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.