– సన్నవడ్లు కొనుగోలులో రైతులకు ముప్పుతిప్పలు
– రుణమాఫీ, పంట నష్టాలను అందించడంలో విఫలం
– వరుస ఓటమిలతో తుగ్లక్‌లా వ్యవహరిస్తున్న కేసీఆర్
– బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, నవంబర్ 7: తెలంగాణలో రైతు సంక్షేమాన్ని విస్మరించి కేసీఆర్ తుగ్లక్‌లాగా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు బేతి మహేందర్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలైన సన్నవడ్లు కొనుగోలు, మద్దతు ధర, రుణ మాఫీ, పంట నష్టంలను గాలికి వదిలేసి, దేశంలోనే కనుమరుగైన కాంగ్రెస్, మ్యూజియం పార్టీలుగా మిగిలిపోయిన లెఫ్ట్ పార్టీలు ఇచ్చిన భారత్ బంద్‌కు తెరాస ప్రభుత్వం సంపూర్ణ మద్దతు పలకడం సిగ్గుచేటని విమర్శించారు. రైతులను నిట్ట నిలువునా మోసానికి గురిచేస్తూ కేసీఆర్ సర్కార్ దళారి వ్యవస్థను పెంచి పోషిస్తూ అక్రమంగా డబ్బులు కొల్లగొడుతుందని ఆరోపించారు.
ప్రధాని మోదీ దేశంలోని రైతులకు స్వేచ్ఛనిస్తూ ఏ రకంగా కూడా రైతులు మోసపో కూడదని, అలాగే పంట కొనుగోలులో దళారి వ్యవస్థను శాశ్వతంగా నిర్ములించాలనే సద్దుదేశ్యంతో ఎంతో కష్టపడి నూతన వ్యవసాయ చట్టాన్ని తీసుకొస్తే, దానిని పూర్తిగా అర్ధం చేసుకోకుండా రైతులను తప్పుదారి పట్టించి రాజకీయ పబ్బం గడుపుకోవడం సిగ్గుచేటని బేతి మహేందర్ రెడ్డి దుయ్యబట్టారు.
రైతు పండించిన పంట దేశంలో ఎక్కడ ఎక్కువ ధర ఉంటే అక్కడే రైతు అమ్ముకోవచ్చని బీజేపీ నేతత్వంలోని మోదీ ప్రభుత్వం తీసుకువస్తే దీనిని స్వాగతించాల్సింది పోయి రైతుల పేరిట ఢిల్లీ చుట్టూ ఉన్న రాష్ట్రాల నుండి మరియు ఢిల్లీ లోని అడ్డమీది కార్మికులకు రోజు వారి కూలి ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపిస్తూ వాళ్ళను రైతులుగా కాంగ్రెస్, వామపక్షా పార్టీలు చూపెడుతున్నారని తెలిపారు. దీనికి కేసీఆర్ మద్దతు ఇస్తూ రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని తెలిపారు.
తెరాస ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ రైతులు తిరుగు బాటు చేసే రోజులు దగ్గరలోనే వున్నాయని హెచ్చరించారు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు బీజేపీకి ప్రజలు పట్టం కడుతుంటే, వరుస ఓటమిలతో ఏమి తోచక కేసీఆర్ తల తిక్క నిర్ణయాలతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టుతున్నారని తెలిపారు. గర్వం, అహంకారం, అణచివేత ధోరణీలతో రాష్ట్రంలో పాలన సాగిస్తూ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తు న్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కేసీఆర్ వాస్తవాలను గ్రహించి రైతులకు మేలు చేసే విధంగా తక్షణ చర్యలు తీసుకొనాలని డిమాండ్ చేసారు. లేని పక్షంలో చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని హితవు పలికారు. ప్రజా సమస్యలపై బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని మహేందర్ రెడ్డి తెలిపారు.