– రైతుల భవిష్యత్తును అందకారంలోకి నెట్టేలా రైతు చట్టాలు
– తెలంగాణ రైతాంగానికి అండ గులాబీ జెండా
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, డిసెంబర్ 8ః ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన చేస్తే ప్రభుత్వాల మనుగడ అసాధ్యమని, రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం గోదావరిఖని బస్ డిపో ఎదుట ధర్నాను ఎమ్మెల్యే చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ గత ఏడేండ్లుగా రైతాంగానికి ఎలాంటి మేలు చేయకపోగా, ఇప్పుడు కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చి రైతులకు తీవ్ర నష్టం చేస్తుందనీ అన్నారు. గతంలో వ్యవసాయం దండగా అన్న చంద్రబాబునాయుడు కు ప్రజలు ఏ తరహాలో బుద్ది చెప్పారో అధే విధంగా రానున్న రోజుల్లో ప్రజలు బి.జె.పి ప్రభుత్వానికి తగిన బుద్ది చెబుతారని తెలిపారు.
రైతుకు ఏ మాత్రం మేలు చేయకపోగా నడ్డివిరిచే విధంగా మూడు వ్యవసాయ బిల్లులను దొడ్డిదారిన తెచ్చి రైతుల బతుకులను వ్యాపారులు, మధ్య దళారుల చేతుల్లో పెట్టారన్నారు. ఈ రైతు వ్యతిరేక బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టిన సందర్భంలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ ఎంపిలు తీవ్రంగా వ్యతిరేకించడం జరిగిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రైతుల శ్రేయస్సే లక్ష్యంగా సిఎం కెసిఆర్ పాలన సాగిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతన్నలకు అండగా నిలుస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఇంజపురి పులిందర్, దాతు శ్రీనివాస్, బాలా రాజకుమార్, నాయకులు కాల్వ శ్రీనివాస్ జహీద్ పాషా, అచ్చవేణు, పీచర శ్రీనివాస్, నూతి తిరుపతి, ఆడప శ్రీనివాస్ విజయ్ కుమార్, తోకల రమేశ్, గంగరాజు, భురుగు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.