– నాలుగు స్థానాలు ఏకగ్రీవం.
– మైనార్టీ జనరల్ స్థానానికి ఎన్నిక.
– 24 ఓట్టతో గెలిచిన టిఆర్‌ఎస్ అభ్యర్థి.
– ఐదుగురిలో నలుగురు పాతవారే.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్ 22: పెద్దపల్లి జిల్లా రామగుండం సగరపాలక సంస్థలో జరిగిన కోఆప్షన్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి సునాయాసంగా ఐదు స్థానాలను కైవసం చేసుకుంది. కో-ఆప్షన్ ఎన్నికల్లో నాలుగు స్థానాలు ఏకగ్రీవం కాగా, ఒక మైనార్టీ జనరల్ స్థానానికి ఎన్నికలు నిర్వహించారు. పత్యక్ష పద్దతి ఎన్నిక ద్వారా 24 ఓట్ల తేడాతో మైనార్టీ స్థానాన్ని టిఆర్‌ఎస్ గెలుచుకుంది.
మేయర్ బంగి అనిల్ కుమార్ అధ్యక్షతన రామగుండం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కో-ఆప్షన్ ఎన్నికే ఏకైక ఎజెండాగా ఈ సమావేశం జరిగింది. మొదటగా ఇటీవలే అనారోగ్య కారణాలచేత మరణించిన మాజీ మంత్రి మాతంగి నర్సయ్య, మాజీ ఎమ్మెల్యే మాలెం మల్లేశం, మున్సిపల్ మాజీ చైర్మన్ బడికెల రాజలింగంలకు సభ్యులు నివాళులర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఎన్నికలు నిర్వహించారు.
ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టికి చెందిన కార్పోరేటర్ జనగామ సరోజిని, బీజేపీకి చెందిన కార్పోరేటర్లు దుబాసి లలిత, కౌశిక లత, కల్వల శిరీషలు గైరుహాజరు అయ్యారు. అను భవజ్ఞుల కోటాలో మూడు స్థానాల్లో చెఱుకు బుచ్చిరెడ్డి, వంగ శ్రీనివాస్, తానిపర్తి విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే మైనార్టీ రెండు స్థానాలకు గాను మైనార్టీ మహిళా కోటాలో తస్లిమాభాను ఏకగ్రీవంగా ఎన్నికైంది.
మైనార్టీ జనరల్ స్థానానికి టిఆర్‌ఎస్ నుంచి మహ్మద్ రఫి, కాంగ్రెస్ నుంచి ఫజల్ బేగ్ మరో అభ్యర్థి సైమన్ రాజు పోటీలో ఉన్నారు. చేతులెత్తే విధానం ద్వారా ఈ ఎన్నికలు నిర్వహించారు. టిఆర్‌ఎస్ అభ్యర్థి మహ్మద్ రఫికి 33 మంది టిఆర్‌ఎస్ కార్పోరేటర్లు, స్వతంత్ర కార్పోరేటర్ పెంట రాజేష్‌తో పాటు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మొత్తం 35 మంది మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఫజల్ బేగ్‌కు 10 మంది కాంగ్రెస్ కార్పోరేటర్లతో పాటు బీజేపీ కార్పోరేటర్ కిషన్ రెడ్డి మద్దతు పలికారు. దీంతో మేయర్ కాకుండా టీఆర్‌ఎస్ అభ్యర్థికి 35, కాంగ్రెస్ అభ్యర్థికి 11 మంది మద్దతు ఇచ్చినట్లు అయ్యింది. కాగా సైమన్‌రాజుకు ఎవరూ మద్దతు ప్రకటించలేదు.
దీంతో టిఆర్‌ఎస్ అభ్యర్థి రఫి 24 ఓట్ల తేడాతో ఎన్నికైనట్లు కమిషనర్ పి. ఉదయ్ కుమార్ ప్రకటించారు. కొత్తగా ఎన్నికైన చెఱుకు బుచ్చిరెడ్డి, వంగ శ్రీనివాస్, తానిపర్తి విజయలక్ష్మి, తస్లిమాభాను, మహ్మద్ రఫిలకు కమీషనర్ నియామక పత్రాలు అందజేసి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో పాటు డిప్యూటీ మేయర్ అభిషేక్‌రావు, కమిషనర్ పి. ఉదయ్ కుమార్, కార్పోరేటర్లు పాల్గొన్నారు.