– అది బీజేపీ పార్టీ కాదు జీడీపీ పార్టీ
– ఆర్థిక శాఖామంత్రి హరీష్ రావు
(మేజిక్ రాజా – ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జమ్మికుంట, అక్టోబర్ 20ః రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పై 291 రూపాయల పన్ను వేస్తోందని ఈటెల చేసిన ఆరోపణలు నిజమని రుజువు చేస్తే, తాను ఆర్థికశాఖా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని తన్నీరు హరీష్‌రావు సవాలు విసిరారు. హుజురాబాద్ ఉప ఎన్నికలను పురస్కరించుకుని జమ్మికుంట మోత్కులగూడెం అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం రాత్రి టిఆర్ఎస్ నిర్వహించిన ‘ధూం ధాం’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ఈటెలది బీజేపీ పార్టీ కాదు, జీడీపీ పార్టీ అని, జీ అంటే గ్యాస్, పీ అంటే పెట్రోల్, డీ అంటే డీజిల్ పెంచే పార్టీ అని రాష్ట్ర ఆర్ధిక శాఖామంత్రి హరీష్ రావు ఎద్దేవా చేసారు.
బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గరనుండీ గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచిం దన్నారు. గ్యాస్ సబ్సిడీని తగ్గించిందన్నారు. గ్యాస్ ధరలు తగ్గించమని ప్రజలు కోరితే రాష్ట్ర ప్రభుత్వం 291 రూపాయల పన్ను వేస్తుందని ఈటెల చేస్తున్న ఆరోపణలకు కట్టుబడి నిరూపిస్తే తాను మంత్రి పదవి రాజీనామా చేయడమే కాకుండా జమ్మికుంట గాంధీ బొమ్మ దగ్గర ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు.
ఈటెల తన ఆస్తులను కాపాడుకోవడానికి కారు దిగి, తామరపువ్వు కోసం బురదలో కాలు పెట్టాడన్నారు. ఈటెల మాటమాట్లాడితే బొందపెడ్తా, గోరికడ్తా, అగ్గిపెడ్తా, కూలగొడ్తా, నీ అంతు జూస్తా, నీ సంగతి జెప్తా అంటున్నాడే గానీ, తాను గెలిస్తే ప్రజలకేమి జేస్తాడో చెప్పడం లేదన్నారు. తన నియోజకవర్గంలో ఒక్కటైనా డబుల్ బెడ్రూం ఇల్లు కట్టని ఏకైక మంత్రి ఈటెలనేనన్నారు. ప్రజలకు ఉపయోగపడని ఈటెలను ఓడించి టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కారు గుర్తుకే ఓటువేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేసారు.
ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమశాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీఆరెస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో పాటు స్థానిక నాయకులు కళాకారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.