(ప్రజలక్ష్యం ప్రతినిధి)
హైదరాబాద్, మార్చి 26: తెలంగాణ రాష్ట్రంలోని బిసి-ఏ కులాల ఐక్యతను సాధించేందుకు హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని న్యాయవాది మల్లుగాల్ల గుర్రప్ప ఆఫీస్ లో బి.సి-ఏ కులాల ప్రముఖులు సమావేశం ఏర్పాటు చేసారు. బి.సిలలో అట్టడుగున వున్న బి.సి-ఏ కులాల అభ్యున్నతి కోసం చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బి.సి.ఏ కులాల ఐక్యవేదికను ఏర్పాటు చేసి నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏన్నుకొన్నారు.
గౌరవ అధ్యక్షులుగా పాక దైవాదీనం గంగపుత్ర, అధ్యక్షులుగా పిల్లి రాజమౌళి మేదరి, ప్రధాన కార్యదర్శిగా మల్లుగాల్ల గుర్రప్ప నాయి, కార్యదర్శిగా పాలడుగుల కనకయ్య రజక లను ఎన్నుకున్నారు.
సామాజికంగా, ఆర్థికంగా ఎంతో వెనుకబాటులో వున్న బి.సి-ఏ కులాలను చైతన్యపరిచి, ఐక్యత సాధించి రజ్యాధికారం సాధించే దిశవైపు వెళ్లేందుకు కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన కమిటి పేర్కొంది. కమిటిని విస్తరించేందుకు ఏప్రిల్ 11న తదుపరి సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోపి, గంగపుత్ర పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మాదరబోయిన నర్సయ్య, ఓయు జాక్ నాయకుడు ఆలకుంట శేఖర్, సంచారజాతుల న్యాయవాది అబ్బు లింగం కర్నే, నాయిబ్రాహ్మణ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు బుద్దారపు ధనరాజ్ తదితర బి.సి-ఏ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.