(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, మార్చి 29ః భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా జాతీయ కార్యదర్శిగా ఎస్.కుమార్ ను నియమించడం పట్ల దళిత నేతలు హర్షం వక్తం చేసారు. ఈ మేరకు గోదావరిఖనిలో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ కుమార్ సింగరేణి కార్మికుని బిడ్డగా, జర్నలిస్టుగా ఈ ప్రాంత కార్మిక సమస్యలపై ఎన్నో కథనాలు, వార్తలను అందించి కార్మికులకు అండగా నిలిచారని కొనియాడారు. ఎన్టీపిసి భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇప్పించడంలో 27 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం పోరాటాలు చేసారన్నారు. ఆయన పోరాట ఫలితమే 56 మందికి ఉద్యోగాలు లభించాయన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో స్థానికంగా నాలుగు రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టి ఈ ప్రాంత వాసులకు ఉద్యమ స్పూర్తి నింపారని తెలిపారు. ఉద్యమ సమయంలో ఎన్నొ సాహసోపేతమైన పోరాటాలు చేసారని పేర్కొన్నారు.
భారతీయ జనతా పార్టీలో చేరి ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తున్నారని తెలిపారు. అలాగే గతంలో ధర్మపురి నియోజకవర్గం ఎమ్మెల్యేగా, పోయిన పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఎంపి అభ్యర్థిగా బీజేపీ తరపున పోటీ చేసారు. పార్టీలో కీలక పదవులను చేపట్టి సింగరేణి కార్మికుల, ప్రజా సమస్యలపై నిత్యం పోరాటాలు చేస్తూ క్రియాశీలకంగా ఎదిగారని పేర్కొన్నారు.
ప్రస్తుతం బిజెపి రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న కుమార్ ను పార్టీ పట్ల ఆయనకున్న విధేయతను క్రమశిక్షణను, శక్తి సామర్థ్యాలను గుర్తించి దళిత మోర్చా జాతీయ కార్యదర్శిగా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేసారు.
ఈ కార్యక్రమంలో దళిత నేతలు పులి మోహన్ మాదాసు రామ్మూర్తి ,వడ్డేపల్లి శంకర్, కనకరాజు, నాగ శంకర్, ప్రభాకర్, బడికెల కృష్ణ, పెద్ద పల్లి శ్రీనివాస్, భోగేపోశం, అయిలయ్య తదితరులు పాల్గొన్నారు.