(ప్రజాలక్ష్యం విలేకరి)
శాయంపేట, సెప్టెంబర్ 19: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఆసరా పింఛన్ పథకం మంజూరు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. వద్దులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆసరా పింఛన్ పథకాన్ని అమలు చేస్తుంది. క్షేత్రస్థాయిలో అది అమలు జరుగడం లేదనే విమర్శలున్నాయి.
కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు పింఛన్ల మంజూరుకోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఇందులో భాగంగానే వరంగల్ (రూరల్) జిల్లా శాయంపేట మండలంలో దాదాపు 400 మందికి పైగా ఆసరా పింఛన్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. పింఛన్ ఎప్పుడు వస్తుందో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. సంవత్సర కాలం నుండి కొత్త పింఛన్లు మంజూరు చేయకపోవడంతో బీ పి , షుగర్, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ కరోనా విపత్తు సమయంలో నిత్యావసర వస్తువులు, మందులకు కొనుక్కోవడానికి ఆసరా అవుతాయనుకున్న పింఛన్లు అవి మంజూరు కాకపోవడంతో నానా బాధలు పడుతున్నారు. మరో వైపు ప్రతి నెల నూతన లబ్ధదారుల దరఖాస్తులు పెరుగుతున్నాయే కాని ఆమేరకు మంజూరుకు నోచుకోవడం లేదు. ప్రతినెలా వచ్చే నెల వస్తుందేమోనని సంవత్సర కాలంగా ఎదురుచూసి నిరాశ చెందుతున్నారు.
ఆసరా పింఛన్ పొందుతూ మరణించిన వారి పేర్లను ప్రభుత్వ జాబితా నుంచి వెంటనే తొలగిం చేస్తున్నారే తప్ప కొత్తగా జారీచేయడం లేదు. ప్రభుత్వం మాత్రం ప్రతినెలా కొత్తగా ఆసరా పింఛన్లు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుందే తప్ప ఆచరణలో అది అమలు జరగడం లేదనే విమర్షలు సర్వత్రా విపిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించి దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికి పింఛన్లు మంజూరు చేయాలని కోరుతున్నారు.