– కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి కమలాసన్‌రెడ్డి
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, సెప్టెంబర్ 18: దౌర్జన్యం, అక్రమంగా డబ్బులు వసూలు చేయడమే లక్ష్యంగా కొనసాగుతున్న మూఠాలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ వి.బి కమలాసన్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు కరీంనగర్‌లో పోలీస్ కమిషనర్ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా హెచ్చరించారు.
ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో జరిగే సంఘటనలతోపాటు వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలకు చెందిన నిర్వాహకులకు బెదిరింపులు, భయాందోళనలకు గురిచేసేందుకు కొందరు కొన్ని సంస్థల పేరిట బృందాలుగా ఏర్పడి మధ్యవర్తిత్వం నిర్వహించడం, దౌర్జనంచేస్తూ బెదిరిస్తూ డబ్బులను వసూలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ఇలాంటి తరహా వసూళ్ళు, మధ్యవర్తిత్వాలను నియంత్రించేందుకు పోలీస్‌శాఖ సిద్దమైందని పేర్కొన్నారు.
బాధితులకు సంబంధం లేకుండా అక్కడకు చేరుకొని సంస్థల పేరిట డబ్బు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఇలాంటి వ్యవహారాలకు పాల్పడే మూఠాలకు సంబంధించిన వారి జాబితాను వెంటనే నివేదిక రూపంలో తయారుచేసి అందజేయాలని స్పెషల్‌బ్రాంచి, టాస్క్‌ఫోర్స్ విభాగా లతోపాటు వివిధస్థాయిలకు చెందిన పోలీసు అధికారులను ఆదేశించారు. కొందరు ఏ పనిపాటలేక వివిధ రకాల సంస్థల పేరిట బృందాలుగా ఏర్పడి ఈ తరహా కార్యక్రమాలను నిర్వహిస్తూ దౌర్జన్యం చేస్తూ డబ్బులను వసూలుచేయడం దందాగా కొనసాగిస్తున్నారని తెలిపారు.
రాజీకివచ్చే కేసులను లోక్‌అదాలత్‌లలో ప్రవేశపెట్టి పరిష్కరించాలని పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి కమిషనరేట్‌లోని పోలీసు అధికారులను ఆదేశించారు. లోక్ అదాలత్ ద్వారా రాజీకి వచ్చే కేసులు పరిష్కారంకావడం ద్వారా పెండింగ్ కేసులశాతం తగ్గుతుందని పేర్కొన్నారు.
కానిస్టేబుల్ సుధాకర్‌కు కమిషనర్ అభినందన
కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్‌పరిధిలో జరిగిన ఒక అత్యాచారం సంఘటనలో నిందితుడికి 10సంవత్సరాలు జైలుశిక్ష విధింపబడటంలో కీలకపాత్రపోషించిన కరీంనగర్ వన్‌టౌన్ కోర్టుడ్యూటీ ఆఫీసర్ ఎస్ సుధాకర్‌ను శుక్రవవారం రోజున కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందిస్తూ నగదు రివార్డును ప్రకటించారు.
ఇదేస్పూర్తితో ప్రతిపోలీసు అధికారి కృషిచేసినట్లయితే ప్రతికేసులో నిందితులు శిక్షింపబడుతారని చెప్పారు. నిందితులు శిక్షింపబడే కేసుల్లో కీలకపాత్రపోషించే ప్రతిస్థాయిఅధికారికి రివార్డులను అందజేస్తామని ప్రకటించారు.