– ఇద్దరు మావోయిస్టుల మృతి
– కుమురంభీం జిల్లా ఇన్చార్జి ఎస్పీ సత్యనారాయణ
(ప్రజాలక్ష్యం బ్యూరో)
మంచిర్యాల/ఆసిఫాబాద్, సెప్టెంబర్ 20: కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం కడంబా అడవుల్లో శనివారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించినట్లు జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ సత్యనారాయణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. రెండు రోజుల కిందట ఆసిఫాబాద్ పట్టణం సమీపంలోని చీలేటిగూడకు మంచిర్యాల, కుమురంభీం జిల్లాల డివిజన్ కమిటీ కార్యదర్శి మైలారపు అడెల్లు ఆలియాస్ భాస్కర్ వచ్చినట్లు అందిన సమాచారంతో పోలీసులకు గాలింపును ముమ్మరం చేశారు.
ఇందులో భాగంగా శనివారం తిర్యాణి మండలంలోని దంతన్‌పల్లిలో మావోయిస్టులకు చెందిన నాలుగు సంచులు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మహారాష్ట్ర వైపు వెళ్లే కాగజ్‌నగర్, పెంచికల్‌పేట్, బెజ్జూరు మండలాల్లోని అటవీ ప్రాంతాలను, రహదారులను ఎనిమిది ప్రత్యేక దళాలతో జల్లెడ పడుతున్నారు.
ఈ క్రమంలో కాగజ్‌నగర్ మండలం కడంబా అడవుల్లోని కొండ వద్ద రాత్రి 10 గంటల సమయంలో పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురు కాల్పులు జరపగా ఇద్దరు నక్సల్స్ చనిపోయారు. భాస్కర్ సహా మరో మావోయిస్టు తప్పించుకున్నాడు.
భాస్కర్‌ను చుట్టుముట్టిన పోలీసులు
ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతానికి సమీపంలో కొండపై భాస్కర్ ఉన్నట్టు గుర్తించిన పోలీసులు 400 మందితో చుట్టుముట్టినట్టు సమాచారం. ఈ క్రమంలో ఎదురుకాల్పులు భీకరంగా కొనసాగుతున్నట్లు తెలిసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ మండలం జోగాపూర్ అటవీ ప్రాంతంలో 2010లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య పరస్పరం కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్, జర్నలిస్టు హేమంత్ చంద్రపాండే చనిపోయారు. తాజాగా ఇప్పుడు పునరావృతం కావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.