– కరీంనగర్ కమిషనర్‌గా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వి.బి.కమలాసన్‌రెడ్డి
(ప్రత్యేక కథనాలు-1)
ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి, కరీంనగర్ః
ప్రజలకు భద్రతపై భరోసా కల్పిస్తూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం వినూత్న కార్యక్రమాలతో ముందుకుసాగుతోంది కరీంనగర్ పోలీస్ కమీషనరేట్. తొలి కమీషనర్ భాద్యతలు చేపట్టిన వి.బి. కమలాసన్‌రెడ్డి అక్టోబర్ 11తో నాలుగు సంవత్సరాలు సమర్ధవంతమైన సేవలతో పూర్తి చేసుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం జిల్లాల పున:నిర్మాణంలో భాగంగా శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేయాలనే లక్ష్యంతో ప్రజలకు పటిష్టమైన భద్రత కల్పించాలనే, వ్యవస్థీకృత నేరాలకు అడ్డుకట్ట వేయాలనే ధ్యేయంతో ఏర్పాటు చేసిన పోలీస్ కమీషనరేట్‌లలో ఒకటైన కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ ఏర్పాటైన అనతికాలంలోనే శాంతిభద్రతలను పటిష్ట పరుచుటకు బలమైన పునాదులు వేయడమే కాకుండా వినూత్నమైన పద్దతులను ఎప్పటికప్పుడు అవలంభిస్తూ ఒకవైపు నేరాలను అదుపు చేయడం మరోక వైపు నేరాల నియంత్రణలో పాశ్చాత్యదేశాలు, అభివృద్ది చెందిన దేశాలకు మాత్రమే సాధ్యమయ్యే ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తూ కరుడుగట్టిన నేరస్థులను సైతం కటకటలా వెనక్కు పంపి ప్రజలకు పోలీస్ వ్యవస్థపై అపారమైన విశ్వాసాన్ని పెంచడమే కాక ప్రతి ఒక్కరిలో భత్రతా భావాన్ని పెంపొందించడంలో అనితర సాధ్యమైన విజయం సాధించించారు.
ఒకవైపు నూతనంగా ఏర్పడిన కమీషనరేట్‌కు కావాల్సిన అన్ని హంగులు సమకూర్చు కుంటూ, శాంతిభద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువ కావడానికి చేపట్టిన పలు కార్యక్రమాల వల్ల పోలీసులు ప్రజలకు ఆత్మీయులు అనే భావన, పోలీసులు ప్రజలను కంటికిరెప్పలా కాపాడుటకు 24గంటలు తమ వెనుక ఉన్నారనే ధీమా కల్పిస్తూ నేరరహిత సమాజం నిర్మాణం వైపు పరుగులు తీస్తోంది. కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు చేపడుతున్న సంస్కరణలతో పాటు శాంతియుత వాతావరణం నిర్మాణం కోసం అమలవుతున్న వివిధ రకాల కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.
బ్లూకోల్ట్స్:
రేయింబవళ్ళు గస్తీ నిర్వహిస్తూ, ప్రజలకు సత్వర సేవలందించే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన బ్లూకోల్ట్స్ సత్ఫలితాలనిస్తోంది. సమాచారం అందిన 3 నుండి 4 నిమిషాల వ్యవధిలో సంఘటన స్థలానికి చేరుకుని సేవలందిస్తున్నాయి. ప్రజల భద్రత కోసం కమీష నరేట్ పోలీసులు చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై సమావేశాలను నిర్వహిస్తూ బ్లూకోల్ట్స్ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలతో ప్రతినిత్యం సమావేశాలు నిర్వహిస్తుండటంతో ప్రజలతో సన్నిహిత సంబంధాలు పెంపొందుతున్నాయి. బ్లూకోల్ట్స్ విభాగం ఏర్పాటు ద్వారా నేరాలు నియంత్రణలోకి వస్తున్నాయి.
కార్డన్ అండ్ సెర్చ్‌లు:
అసాంఘీకశక్తుల కదలికల నియంత్రణ, అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్టవేసేందుకు కమీషనరేట్ పరిధిలో కొనసాగిస్తున్న కార్డన్ అండ్ సెర్చ్‌లతో ఆశించిన ఫలితాలు వస్తున్నాయి. అంగుల అంగులం సోదాలను నిర్వహిస్తూ అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే నేరస్థులకు గుబులు పుట్టిస్తూ వారు కరీంనగర్ వదిలిపోయేలా ఆ ప్రాంత ప్రజల్లో భద్రతా భావం పోలీసుల పట్ల కృతజ్ఞత భావం పెంపొందేలా చేస్తున్నవి.
ప్రజలు నమ్మలేని రకంగా జరుగుతున్న అనేక రకాల అక్రమ కార్యకలాపాలు వెలుగు చూస్తున్నాయి. అనుమానితుల వేలిముద్రలను అక్కడే సేకరించి వారు ఏ ప్రాంతం వారు గతంలో ఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో నేరాలకు పాల్పడినారు, ఏదైనా పోలీస్ స్టేషన్ పరిధిలో వారు అవసరం ఉండి అరెస్టు కాకుండా పరారీలో ఉన్న నిందితులా? అని తెలుసుకుంటూ ఎంతోమందిని నిందితులను పట్టుకోవడం జరిగింది.
షీటీమ్స్:
మహిళలు, విద్యార్థినులు వివిధ రకాల వేధింపులకు గురవ్వకుండా పోకిరీల ఆటకట్టిం చేందుకు ఏర్పాటు కాబడిన షీటీంలు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయి. వేధింపులను ఎదుర్కొనే మహిళలు సెల్, వాట్సాప్, ఫేస్‌బుక్, హాక్‌ఐ యాప్‌ల ద్వారా షీటీంలకు సమాచారం అందిస్తున్నారు. సత్వరం స్పందిస్తూ ఆధారాలతో సహా పోకిరీలను పట్టుకోవడం జరుగుతున్నది. ఆధారాల సేకరణకు ఆధునిక సాంకేతిక పరికరాలను వినియోగిస్తున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్:
హైదరాబాద్ నగరం తర్వాత మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని నియంత్రించడంతోపాటు ప్రజలకు అవగాహన కల్పించడంలో కరీంనగర్ కమీషనరేట్ ముందజలో కొనసాగుతోంది. ప్రజల భద్రత, ప్రమాదాల నియంత్రణ కోసం కొనసాగిస్తున్న డ్రంక్‌అండ్ డ్రైవ్‌లు సత్ఫలితాలనిస్తున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన వారికి శిక్ష తప్పనిసరిగా విధించబడుతుండటంతో మందుబాబులు వాహనాలు నడిపేందుకు జంకుతున్నారు. మద్యంసేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారి లైసెన్సుల రద్దుకోసం ప్రతిపాదనలు పంపిస్తుండటంతో వారి లైసెన్సులు రద్దవుతున్నాయి. ఇప్పటి వరకు కమిషనరేట్ పరిధిలో 170కి పైగా మంది వాహనదారుల లైసెన్సులు రద్దుకాబడ్డాయి.
ఆపరేషన్ నైట్‌సేఫ్టీ:
తల్లిదండుల పర్యవేక్షణ కరువై రాత్రి వేళల్లో మద్యం,మత్తు పదార్ధాల సేవించి రోడ్లపై వివిధ రకాల వాహనాలతో సంచరించే యువతను సన్మార్గంలో పయనింపజేసేందుకు కమీషనరేట్ పరిధిలో ఆపరేషన్ నైట్‌సేఫ్టీకి శ్రీకారం చుట్టడం జరిగింది. వ్యసనాలకు బానిసలైన యువ కులు జల్సాలకు డబ్బులు కరువై వివిధ రకాల దోపిడిలు, దొంగతనాలకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగుచూశాయి. యువతను అదుపులో ఉంచి, సన్మార్గంలో పయనింప జేసేందుకు చేపడుతున్న ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల సహకారం లభిస్తున్నది. రాత్రి వేళల్లో వాహనాలపై సంచరిస్తూ తటస్థపడిన యువతను అదుపులోకి తీసుకుని వారి వాహనాలను స్వాధీనం చేసుకుని వదిలిపెడుతున్నాము. మరునాడు ఉదయం వారి తల్లిదండ్రులు, సంరక్షకులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాము.
నాఖాబందీ:
అక్రమ కార్యకలాపాల నియంత్రణకు కమీషనరేట్ పరిధిలో నాఖాబందీలను నిర్వహిస్తు న్నాము. నాఖాబందీని కమీషనరేట్ వ్యాప్తంగా ఏకకాలంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా సరైన ధృవపత్రాలు లేని వాహనాలు, మద్యం సేవించి వాహనాలు నడిపే మందుబాబులు, అక్రమ రవాణా, ఆయుధాలు ధరించి సంచరించే వ్యక్తులు, శాంతికి భంగం కలిగించే వ్యక్తులను పట్టుకోవడం జరుగుతున్నది. ఏకకాలంలో నిర్వహించడం వల్ల సత్పలితాలు వస్తున్నాయి.
హాక్‌ఐ:
శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలను ప్రజలు నేరుగా పోలీస్‌స్టేషన్‌లకు వచ్చి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా అన్ని వర్గాల ప్రజల సౌకర్యార్దం రూపొందించిన ప్రత్యేక అప్లికేషన్. స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న ప్రతి పౌరుడు వినియోగించుకునే అవకాశం ఉంది. వివిధ రకాల సమస్యలనుల ఒక్కమీట నొక్కితే పోలీసు లకు చేరే అవకాశం ఉన్న సదు పాయం. హాక్‌ఐలో ఉన్న వివిధ రకాల సేవలపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. కమీషనరేట్ వ్యాప్తంగా 95వేలకు పైగా మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా వివిధ రకాల సమస్యలు పోలీసుల దృష్టికి వస్తున్నాయి. వెంటనే స్పందిస్తూ చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. మహిళల భద్రతకు సంబంధించి ప్రత్యేక సదుపాయాలను ఈ యాప్‌లో అందుబాటులో ఉంచారు.
టాస్క్‌ఫోర్స్:
కరీంనగర్ కమీషనరేట్‌లో అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవారి పీచమణచడానికి అసాంఘీకశక్తుల ఆటకట్టించడానికి, చీకటి వ్యాపారాలతో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న వైట్‌కాలర్ నేరస్థులపై ఉక్కుపాదం మోపడానికి ఏర్పాటు చేయబడింది కమీషనరేట్ టాస్క్‌ఫోర్స్. ప్రజల మనస్సుల్లో చెరగని ముద్రవేసి కల్తీ వ్యాపారాలకు పాల్పడే అక్రమార్కుల్లో వణుకుపుట్టిస్తోంది. మోటారు విడిభాగాలు, వంటనూనెలు, పప్పుదినుసులు, ఇతర ఆహార పదార్ధాల కల్తీకి పాల్పడుతున్న వారిపై దాడులు చేసి పలు కేసులను నమోదు చేయడం జరిగింది. గుట్కా విక్రేతలపై, జూదశాలలపై, లింగనిర్ధారణ పరీక్షల కేంద్రాలపై, వ్యభిచార నిర్వాహకులపై దాడులు చేసి పలువురిపై కేసులు నమోదు చేశారు. ప్రజల నుండి పలు ప్రశంసలు అందుకుంటున్నారు.
నేరస్థుల గుండెల్లో గుబులురేపుతున్న పిడియాక్ట్
కరీంనగర్ కమీషనరేట్‌లో పిడియాక్ట్ నేరస్థుల గుండెల్లో గుబులురేపుతోంది. కరుడుగట్టిన, నేరస్థులు ఇక్కడ నేరాలు చేసేందుకు జంకుతున్నారు. నేరాల నియంత్రణకోసం కరీంనగర్ కమీషనరేట్ పోలీసులు తీసుకుంటున్న పకడ్భందీ చర్యలు నేరస్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కమీషనరేట్‌లో పిడిసెల్ విభాగం ఏర్పాటుకాకముందు, ఇప్పుడు నేరాలు జరిగేశాతం విశ్లేషించినట్లయితే దాదాపు 80శాతం పైగా తగ్గాయి. ప్రవర్తన మార్చుకోకుండా తరచూ నేరాలకు పాల్పడే నేరస్థులను నియంత్రించేందుకు కమీషనరేట్‌లో పిడియాక్టును అమలు చేస్తున్న విషయం విదితమే. ఇప్పటి వరకు 84మంది కరుడుగట్టిన నేరస్థులపై పిడియాక్టును అమలు చేశారు.