Home తెలంగాణ విదేశీ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం…

విదేశీ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం…

491
0
revealing the details
Srirampur CI Koteshwar revealing the details of the case

– రెండేళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న వైనం…
– వలపన్ని పట్టుకున్న పోలీసులు
– 50 మంది నుంచి రూ.32.5 లక్షల వసూలు…
– వివరాలు వెల్లడించిన శ్రీరాంపూర్ సీఐ కోటేశ్వర్

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
మంచిర్యాల, అక్టోబర్‌ 8: విదేశాల్లో ఉద్యోగాలు, లక్షల్లో జీతాలు ఇస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసి, మోసం చేసి గత రెండేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని శ్రీరాంపూర్‌ పోలీసులు గురువారం అరెస్టు చేసారు. ప్రార్థనల పేరుతో గోదావరిఖని వచ్చి, నిరుద్యోగులను, డ్రైవర్స్‌ను పరిచయం చేసుకుని, విదేశాల్లో డ్రైవర్‌ ఉద్యోగాలు పెట్టించి, లక్షల్లో జీతాలు ఇప్పిస్తానని, డబ్బులు వసూలు చేసి, మోసం చేస్తూ, గత కొంతకాలంగా ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాలలో తప్పించుకు తిరుగు తున్న కందిపట్టి మురళిని శ్రీరాంపూర్‌ ఎస్సై మంగీలాల్‌  సిబ్బందితో కలిసి మంచిర్యాల బస్టాండ్‌ వద్ద చాకచక్యముగా పట్టుకున్నారు. స్థానిక శ్రీరాంపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో సి.ఐ. బి.కోటేశ్వర్ అరెస్టు చూపి, అనంతరం ఎస్సై మంగీలాల్‌తో కలిసి వివరాలు వెళ్లడించారు.

తమిళనాడు రాష్ట్రానికి చెందిన కందిపట్టి మురళి అనే వ్యక్తి తూర్పు గోదావరి రాయవరంకు చెందిన అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకొని భార్యతో కలిసి అక్కడే ఉంటున్నాడు. భార్యతో కలిసి మాచవరంకు చర్చికి ప్రార్ధనకు వెళ్ళిన మురళికి గోదావరిఖని చెందిన రామగిరి శంకర్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో మురళి గోదావరిఖనికి తరచు వచ్చేవాడు. శంకర్‌తో కలిసి చర్చిలో ప్రార్థనలు చేయుటకు వెళ్లేవాడు.

arrested
Arrested Kandipatti Murali

ఈ క్రమంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రైవేటు డ్రైవర్‌లు, డంపర్‌ ఆపరేటర్‌లో పరిచయం పెంచుకొన్నాడు. తనకు యూరప్‌ దేశంలో తెలిసిన వారు ఉన్నారని, అక్కడ డంపర్‌ ఆపరేటర్‌, డ్రైవర్‌గా పనిచేస్తే నెలకు రూ.1.70లక్షల జీతం వస్తుందని ఇక్కడ తక్కువ జీతానికి పనిచేయడం కంటే అక్కడికెళ్తే కుటుంబాలు తొందరాగా సెటిల్‌ అవుతాయని నమ్మించాడు. అలా మందమర్రి, శ్రీరాంపూర్‌, గోదావరిఖని, యైటింక్లయిన్‌ కాలనీలలో ప్రచారం చేసుకున్నాడు. అలా 50 మంది నుంచి సుమారు ఒక్కొక్కరి నుంచి రూ.50వేల చొప్పున మొత్తం రూ.32.5 లక్షలు వసూలు చేశాడు. అ డబ్బుతో పరారయ్యాడు. దీంతో బాధితులు ఆయా పోలీస్‌ స్టేషన్‌లలో 2018లో ఫిర్యాదులు చేశారు. ఇతనిపై గోదావరిఖని, జైపూర్‌, శ్రీరాంపూర్‌, రాయవరం పోలీస్‌ స్టేషన్లో కేసులు నమోదు అయ్యాయి. దీన్ని సవాల్‌గా తీసుకున్న శ్రీరాంపూర్‌ సి.ఐ. ప్రత్యేకంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మురళి బెల్లంపల్లిలో కొందరిని నమ్మించి డబ్బులు వసూలు చేసేందుకు వస్తున్న క్రమంలో మంచిర్యాల బంస్టాండ్‌లో అదుపులోకి తీసుకొని అరెస్టు చేసారు. ఇతడిపై పలు సెక్షన్ల కింద నమోదయిన కేసుల ఆధారంగా రిమాండ్‌కు పంపించి విచారణ చేస్తున్నామని సీఐ కోటేశ్వర్‌ వివరించారు.

ఈ సందర్భంగా ఉద్యోగాలు పెట్టిస్తామని నమ్మిస్తూ అమాయకుల మోసం చేసే వారి మాయమాటలు నమ్మి డబ్బు, సమయం నష్ట పోవద్దని, అలాంటి మోసగాళ్ళు ఎవరైనా ఉద్యోగాలు పెట్టిస్తామని చెప్పితే వారి సమాచారం పోలీసులకు అందించాలని తెలిపారు. ఉద్యోగాలు పెట్టిస్తామని మోసం చేసిన వారిపై పీడీ ఆక్ట్‌ కూడా నమోదు చేస్తామని శ్రీరాంపూర్‌ సీఐ బిళ్ళ కొటేశ్వర్‌ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here