– ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేయాలి
– అట్టహాసంగా పాసింగ్ అవుట్ పరేడ్
– కరీంనగర్ సీపీ వి.బి. కమలాసన్‌రెడ్డి
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, అక్టోబర్ 9: సామాన్యులకు స్నేహహస్తం అందిస్తూ నేరస్థులపాలిట సింహస్వప్నంగా పోలీసులు వ్యవహరించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్‌రెడ్డి అన్నారు. ఇతర ప్రభుత్వశాఖలతో పోల్చిచూసినట్లయితే ప్రజలకు నేరుగా సేవలందించే అత్యంతశక్తివంతమైన శాఖ పోలీస్ మాత్రమేనని పేర్కొన్నారు.
కరీంనగర్‌లోని పోలీసు శిక్షణ కళాశాల(పిటిసి)లో శుక్రవారంనాడు తొమ్మిదినెలల శిక్షణ పూర్తి చేసుకున్న సైబరాబాద్ కమిషనరేట్‌కు చెందిన ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ళ పాసింగ్ అవుట్ పరేడ్(పివోపి)కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్‌రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యి కవాతులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు వివిధ రకాల రూపాల్లో చెల్లిస్తున్న పన్నుల ద్వారానే జీతభత్యాలను పొందుతున్నామనే విషయాన్ని గుర్తించి పోలీస్‌శాఖలోని ప్రతిస్థాయి ఉద్యోగి ప్రజల సేవకు అంకితం కావాలన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణధ్యేయంగా ఏ సమ యంలో ప్రజలకు ఆపద వచ్చినా సత్వరం స్పందించి సేవలందించాలని చెప్పారు. ఏ స్థాయి వారైనా ఎలాంటి ఆపదవచ్చినా క్లిష్టసమయాల్లో పోలీసులనే ఆశ్రయిస్తారని, ఇంతటి గుర్తింపు ఏ రకమైన శాఖకు లభించదని, మనం అందించే సేవలతో ప్రజల మదిలో చిర స్థాయిగా నిలిచిపోతామనే విషయాన్ని గుర్తించాలని తెలిపారు.
సమాజంలోని అందరి దృష్టి పోలీసులపైనే ఉంటుందని, క్రమశిక్షణతో మెదులుతూ అత్యుత్తమైన సేవలతో పోలీస్‌శాఖ ప్రతిష్టను పెంపొందించేందుకు కృషిచేయాలని పేర్కొన్నారు. ఈ ఉద్యోగం కేవలం ధేహదారుఢ్యంతోనే లభించలేదని, దీంతోపాటుగా వేలాదిమందితో అన్నివిభాగాల్లో పోటీపడితేనే లభించదనే విషయం గుర్తించి, తమతో పోటీపడ్డ వారందరిలో తామే సమర్థులమని నిర్ధారించుకోవాలని చెప్పారు. పిటిసికి చెందిన అన్నిస్థాయిలకు అధికారులు, సిబ్బంది శిలలులాంటి మిమ్మల్ని శిల్పాలుగా తీర్చిదిద్దారని అభినందించారు.
ప్రస్తుతం శిక్షణ పూర్తిచేసుకున్న పోలీసులు ఇంతటితో తమ శిక్షణ పూర్తికాలేదని, ఇంకా జీవితాంతం నేర్చుకునేది చాలాఉందనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. నేర్చు కోవడం అనేది నిరంతరం కొనసాగించాలని, ఆపివేసినట్లయితే ఎదుగుదల నిలిచిపోతుందనే విషయాన్ని గుర్తించి నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ముందుకుసాగాలని పిలుపునిచ్చారు.
సినిమాల్లో చూపే పోలీస్‌కు బయటి పోలీస్‌కు చాలాతేడా ఉంటుందని, ఇక్కడ ప్రతీది ప్రత్యక్ష్యంగా చేయాల్సివస్తుందని చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ళు నిర్వహించిన దీక్షాంత్‌పరేడ్ మిలటరీ, న్యూఢిల్లీలో జరిగే రిపబ్లిక్‌డే దినోత్సవం పరేడ్‌ను తలపింపజేసిందని అభినందించారు.

పిటిసి ప్రిన్సిపాల్ వి.సునీతమోహన్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇంతపెద్దసంఖ్యలో పోలీసులు శిక్షణ పూర్తిచేసుకున్న ఏకైక శిక్షణకేంద్రం కరీంనగర్ పిటిసి అన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్‌రెడ్డి, ఇతర అధికారుల సహకారంతో ఊహించనిరీతిలో పిటిసి అభివృద్ది పనులు జరిగాయని చెప్పారు. 2010లో ప్రారంభమైన ఈ శిక్షణ కేంద్రంలో ట్రైనీ కానిస్టేబుళ్ళ శిక్షణ పూర్తవడం ఇది ఐదవసారి కాగా, వివిధ రకాల పదోన్నతులకు సంబంధించి 17బ్యాచ్‌లు ఇక్కడ శిక్షణను పూర్తిచేసుకున్నాయని వివరించారు. హరిత హారం, మియావాకి ప్రాజెక్టులో భాగంగా ఈ కేంద్రంలో ఇప్పటి వరకు 28వేల వివిధ రకాల మొక్కలనునాటి సంరక్షించడం జరిగిందని తెలిపారు.

సైబరాబాద్‌నకు చెందిన 877మంది ట్రైనీకానిస్టేబుళ్ళు ఇక్కడ శిక్షణ పూర్తిచేసుకున్నారు. ఇందులో బెస్ట్ ఫైరర్‌గా దండు సాయిరామకృష్ణ, అవుట్‌డోర్ విభాగంలో బొల్లం రామకృష్ణ, ఇండోర్ విభాగంలో తాండూరి తిరుపతి, బెస్ట్ ఆల్‌రౌండర్‌గా గండ్ల మల్లికార్జున్ బహుమతు లను అందుకున్నారు. పరేడ్ కమాండర్‌గా వెంకటరాజశేఖర్ వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి(పరిపాలన) జి చంద్రమోహన్, ట్రైనీ ఐపిఎస్ అధికారిణి సాధన రష్మీ పెరుమాళ్, పిటిసి వైస్ ప్రిన్సిపాల్ రవి, డిఎస్‌పిలు చంద్రయ్య, శ్రీనివాసులు, మల్లికార్జున్‌లతో పాటు ఇండోర్, అవుట్ విభాగాలకు చెందిన అధికారులు, పలువురు పోలీసు అధికారులు, మినిస్టీరియల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.