– చెరువులో చేపల పెంపకంపై స్థానిక సంఘాలకు సంపూర్ణ హక్కు
– రూ.900 కోట్లతో మత్స్యకారులకు పరికరాల పంపిణీ
– రూ.10 కోట్లతో రొయ్యల పంపిణీ
– మత్స్య కళాశాల ఏర్పాటు సీఎం దృష్టికి తీసుకెళతాం
– రాష్ట్ర మత్స్య సంవర్ధక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్ 20: మత్స్య సంపదను పెంపొందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక మరి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అన్నారు. పెద్దపల్లి జిల్లాలో పర్యటనలో భాగం ఆదివారం గోదావరిఖని వచ్చారు. రామగుండంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, గోదావరిఖనిలో సమ్మక్క-సారలమ్మ ఘాట్ వద్ద సుందిళ్ల బ్యారేజీ బ్యాక్ వాటర్ లో 2 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు.
అక్కడ నిర్వహించిన కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో ఉంచామని, ప్రాజెక్టు పరిధిలో ఉన్న 19 రిజర్వాయర్లు, కాలువల, ప్రాజెక్టు ద్వారా నింపే ప్రతి చెరువులో ఇష్టంగా చేపపిల్లలను విడుదల చేస్తున్నామని తెలిపారు.
గత ప్రభుత్వాలు ముదిరాజు బెస్తలను ఎన్నికల సమయంలో మాత్రమే పలకరించారని, ముఖ్యమంత్రి వారి అభ్యున్నతి కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి చెరువు, రిజర్వాయర్ నీటి వనరులలో చేపల పెంపకానికి స్థానిక మత్స్య సంఘాలకు హక్కు కల్పించాలని మంత్రి తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా రాష్ట్రంలో మత్స్య సంపద పెరుగుతుందని, దీనిద్వారా మత్స్యకారులు ఆర్థికాభివృద్ధి చెందాలని మంత్రి సూచించారు.
చెరువులు నీటి వనరులలో దొరికే చేపలను తక్కువ ధరకు విక్రయించవద్దని, మార్కెట్ లో ఉండే ధరలపై విచారణ చేసి విక్రయించాలని సూచించారు. మత్స్యకారులు ఆర్థిక అభివృద్ధి చెందేందుకు వీలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.900 కోట్లతో టీవీఎస్ వాహనాలు, వ్యాన్లు, వలలు ఇతర పరికరాలు పంపిణీ చేశారని, వీటిని సంపూర్ణంగా వినియోగించుకోవాలని తెలిపారు.
రామగుండం కార్పొరేషన్ పరిధిలో అనువైన భూమి కేటాయిస్తే చేపల మార్కెట్ ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేపలతో పాటు రూ.10 కోట్ల వ్యయంతో రొయ్యల సైతం ఉచితంగా పంపిణీ చేస్తుందని మంత్రి తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని, రైతుల అభ్యున్నతికి ఉచిత విద్యుత్, రైతుబంధు వంటి పథకాలను కెసిఆర్ చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని తెలిపారు. రైతు ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ బిల్లు, విద్యుత్ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం వాటిని ఉపసంహరించుకోవాలని మంత్రి కోరారు
కుల వృత్తుల పునరుద్ధరణకు ప్రభుత్వం కృషి
– రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
కుల వృత్తులను పునరుద్ధరించడం ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.3 వేల కోట్లు వెచ్చించి గొర్రెల పంపిణీ చేశారని, మత్స్యకారులకు అవసరమైన పరికరాలు అందించారని ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా నీటి వనరులలో చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో అవసరాల మేరకు మాంసం చేపలు ఉత్పత్తి చేసుకుని, ఇతర ప్రాంతాలకు సైతం ఎగుమతి చేసే దిశగా ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల వల్ల ఈ ప్రాంతంలో 365 రోజులు నీరు అందుబాటులో ఉంటుందని, మత్స్య సంపద పెరుగుతుందని, వివిధ రకాల చేపపిల్లలను పంపిణీ చేస్తున్నామని గ్రామీణ ప్రాంతాల్లో సైతం మిషన్ కాకతీయ కింద చేపట్టిన చెరువుల పునరుద్ధరణ వల్ల నీటి వనరులు పెరిగాయని వాటిలో చేప పిల్లల పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
మత్స్య కళాశాల ఏర్పాటు చేయాలి
– జడ్పీ చైర్మన్ పుట్ట మధు
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా సుందిళ్ల బ్యారేజీ లో నీరు అందుబాటులో ఉంటుందని, పరిసర ప్రాంతాల్లో మత్స్య కళాశాల, అధికారులకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని జడ్పీ చైర్మన్ పుట్ట మధు మంత్రి గారికి విజ్ఞప్తి చేశారు. దీనిపై రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి స్పందిస్తూ మత్స్యకారులకు అవసరమైన సంపూర్ణ శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటామని, మచ్చ కళాశాల ఏర్పాటు అంశంపై సీఎంతో చర్చించి నిర్ణయం సాధన దిశగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలి
– రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో చేపల మార్కెట్ కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఎక్లాస్పూర్ కుక్కలగూడూర్ గుంటూరు పల్లి, అల్లూరు, మల్కాపూర్ లో పశువుల ఆసుపత్రి సబ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ విజ్ఞప్తి చేశారు. దీనిపై రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి స్పందిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేతకాని, జిల్లా ఇంఛార్జి రెవెన్యూ అధికారి కె.నరసింహమూర్తి, పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి శంకర్ కుమార్, రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక రావు, జడ్పీటీసీలు కందుల సంధ్యారాణి, నారాయణ, ఎంపీపీలు అనసూయ, జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు తిరుపతి, కుర్మా సంఘం అధ్యక్షులు మల్లేశం, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రాజన్న, జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశం జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు స్థానిక సర్పంచ్ లు కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, గొల్ల కుర్మ సంఘ ప్రతినిధులు, తహసిల్దార్ లు సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు