– దిగుబడికి తగినట్లు సౌకర్యాలు ఏర్పాటు చేయాలి
– రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు
– సమీక్ష సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, అక్టోబర్ 12: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరగాలని రాష్ట్ర బిసి సంక్షేమ మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం 2020-21 వానాకాలం వరిధాన్యం కొనుగోళ్లకై సమీక్షా సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అంచనాలు, చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ విస్తీర్ణం పెరగడం ద్వారా ధాన్యం ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులకు, అధి కారులకు సూచించారు. గతంలో సాగు జరిగిన తీరు కొనుగోళ్లు చేపట్టిన విధానంతో తాజా పరిస్థితిని బేరీజు వేసుకొని ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
తెలంగాణా ఏర్పడక ముందున్న పరిస్థితులకు, ఇప్పుడున్న సిత్థిగతులకు ఏమాత్రం పొంతన లేదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగితే ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలోనే దాదాపుగా ఒక కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు. కాళేశ్వరం జలాలతో సశ్యశ్యామలమైన తెలంగాణా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతోందని, బీడు భూములన్నీ సాగులోకి వస్తున్నాయని చెప్పారు. నీళ్లు లేక, కరెంటు లేక, పెట్టుబడి లేక ఇబ్బందులు పడ్డ రైతుల కష్టాలు తీరడంతో అదనపు విస్తీర్ణం సాగులోకి వచ్చిందని తెలిపారు. భూమికి బరువయ్యే విధంగా రైతులు పంటలు పండిస్తున్నారని వారికి ఇబ్బందులు జరగకుండా కొనుగోళ్లు సజావుగా సాగాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
దేశం మొత్తానికే అన్నం పెట్టే విధంగా తెలంగాణా రాష్ట్రం ఎదుగుతోందని 54 శాతం ప్రొక్యూర్ మెంట్ తెలంగాణా రాష్ట్రం నుంచే జరుగుతోందని చెప్పారు. యాసంగిలో కరోనా కారణంగా కష్టాలు ఎదురైనప్పటికీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రతి గ్రామానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. గత వానా కాలంలో ఒక లక్షా 96 వేల ఎకరాల్లో ధాన్యం సాగు జరిగితే ప్రస్తుత సీజన్లో రెండు లక్షల 52 వేల ఎకరాల్లో సాగు జరుగుతోందని అన్నారు. అప్పటికి ఇప్పటికి 60 వేల ఎకరాల్లో సాగు పెరిగిందని అధికారులు అప్రమత్తం కావాలని మంత్రి గంగుల సూచించారు. ధాన్యం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మిల్లింగ్ సామర్థ్యం పెంచాలని, ధాన్యం రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
అందరి సహకారం, సమన్వయంతోనే కొనుగోళ్లు సజావుగా సాగుతాయన, ఈ దిశగా శ్రమించాలని అన్నారు. పంట పండించిన రైతు ఎక్కడా కష్టపడకుండా కొనుగోళ్లు నిర్వహించి, వారి వారి అక్కౌంట్లలో డబ్బులు జమయ్యే విధంగా చేయడమే తమ లక్ష్యమని మంత్రి గంగుల స్పష్టం చేశారు.
ఈ సమావేసంలో మంత్రి గంగులతోపాటు జిల్లా కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, టెస్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్ రావు, జడ్పీ ఛైర్ పర్సన్ కనుమల్ల విజయ, అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, ట్రైనీ కలెక్టర్ అంకిత్, వ్యవసాయాధికారి శ్రీధర్, మార్కెటింగ్ డి.డి. పద్మావతి, డి.ఎస్.వో.శ్రీమాల, గ్రంథాలయ ఛైర్మన్, ప్యాక్స్ ఛైర్మన్లు, పోలీసు అధికారులు, పౌరసరఫరాల శాఖ అధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, రైసు మిల్లుల ప్రతినిధులు, ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు, రైతు సమన్వయ సమితి ప్రతినిధులు, రైసు మిల్లర్స్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.