– సత్పలితాలనిచ్చిన పోలీసుల స్పెషల్‌డ్రైవ్‌లు.
– అకస్మిక దాడులు కొనసాగుతాయి.
– కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి. కమలాసన్‌రెడ్డి
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, సెప్టెంబర్ 23: నేరరహిత కమిషనరేట్ లక్ష్యంగా పోలీస్‌శాఖ ముందుకు సాగుతోందని, అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఇందుకు ఫలితంగా కటకటాలపాలవ్వక తప్పదని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాల నియంత్రణ కోసం ఆకస్మిక దాడుల కొనసాగుతాయని తెలిపారు.
అక్రమ కార్యకలాపాల నియంత్రణ కోసం కరీంనగర్ కమిషనరేట్‌లో పోలీసులు ఈనెల 19 నుండి 22వరకు నిర్వహించిన స్పెషల్‌డ్రైవ్ కార్యక్రమం సత్ఫలితాల నిచ్చిందన్నారు. ఈ స్పెషల్‌డ్రైవ్‌లో కమిషనరేట్ వ్యాప్తంగా పోలీసులు నిర్వహించిన దాడులు అక్రమార్కుల గుండెల్లో గుబులురేపాయని తెలిపారు. అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపడం లక్ష్యంగా పోలీస్‌శాఖ కృషి చేస్తోందన్నారు.
నాలుగు రోజుల పాటు పోలీసులు నిర్వహించిన స్పెషల్‌డ్రైవ్ ద్వారా 13,84,881 రూపాయల విలువ చేసే నిషేదిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకొని, 66 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. 13 కేసుల్లో 80మంది పేకాట రాయుళ్ళను పట్టుకుని వారి వద్ద నుండి 65,868 రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. నాలుగు కేసుల్లో 111 క్వింటాళ్ళ బియ్యం స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఒక కిలో గంజాయిని, అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న 35 ట్రాక్టర్లను పట్టుకున్నా మన్నారు. అలాగే ఎనిమిది క్వింటాళ్ళ నల్లబెల్లాన్ని, 20 కిలోల నాసిరకం కారంపొడి, 15 లీటర్ల నాటు సారా, ఒక వ్యభిచారం కేసులో ముగ్గురిపై కేసు నమోదు, అక్రమంగా నిల్వ ఉంచిన పది ట్రాక్టర్ల ఇసుక డంప్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.
అక్రమకార్యకలాపాల నియంత్రణ చర్యల్లో చురుకైన పాత్రపోషించిన ప్రధాన మూడు పోలీస్‌స్టేషన్లకు చెందిన పోలీసులకు రివార్డులను అందజేస్తామని కమీషనర్ ప్రకటించారు. నేరాల నియంత్రణ, చేధన చర్యల్లో చురుకైన పాత్రపోషిస్తూ పోలీస్‌శాఖ ప్రతిష్టను పెంపొందించాలని పిలుపునిచ్చారు. అక్రమ కార్యకలాపాల నియంత్రణలో కీలకపాత్ర పోషించిన పోలీసులను ఈ సందర్భంగా అభినందించారు.
అక్రమకార్యకలాపాలకు పాల్పడి పట్టుబడిన వారందరినీ సంబంధిత తహసిల్దార్‌ల ముందుకు బైండోవర్ చేయించాలని ఆదేశించారు. బైండోవర్ అమలులో ఉన్నకాలంలో నియమ నిబంధనలను ఉల్లంఘించి ఏదైనా చర్యలకు పాల్పడితే బైండౌన్ చేయిస్తామని హెచ్చరించారు. బైండోవర్ నిబంధనలు ఉల్లఘించిన వారికి ఆరునెలల వరకు జైలుశిక్ష లేదా ఒక లక్ష రూపాయల వరకు జరిమానా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రెండూనూ విధించబడే అవకాశాలున్నాయని చెప్పారు.అక్రమ కార్యకలాపలకు ప్రత్యక్ష్యంగా పరోక్షంగా సహకరించే వారిపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు.
నేరరహిత కమిషనరేట్ నిర్మాణంలో అన్నివర్గాల ప్రజలు పోలీసులకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. అక్రమ కార్యకలాపాలకు సంబంధించి సమాచారం అందించే వారి పేర్లను గోప్యంగా ఉంచడంతోపాటు వారికి నగదు పారితోషికాలను అంద జేస్తామని ప్రకటించారు.