Home ఆంధ్రప్రదేశ్ ‘కల్కి భగవాన్‌’ఆశ్రమాలపై ఐటీ దాడులు

‘కల్కి భగవాన్‌’ఆశ్రమాలపై ఐటీ దాడులు

755
0
income tax raids kalki bhagwan ashrams
income tax raids kalki bhagwan ashrams

ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచిన కల్కి ఆశ్రమాలపై ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ అధికారులు బుధవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 40 చోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అధికారులు దాదాపు రూ.20 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాలెంలోని ప్రధాన ఆశ్రమం,, బీ. ఎన్‌. కండ్రిగ మండలాల్లో ఉన్న కల్కి భగవాన్‌ ఆశ్రమాలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. చెన్నై సమీపంలో నేమం గ్రామంలో ఉన్న కల్కి ఆశ్రమంలో అధికారులు సోదాలు నిర్వహించారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

చెన్నై నుంచి వచ్చిన ఐటీ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఈ దాడులు చేశారు. కల్కి ట్రస్ట్‌ నిర్వాహకుడు లోకేష్‌ దాసజీని అధికారులు విచారిస్తున్నారు. ట్రస్ట్‌కు సంబంధించిన ఏకం, జీ.సీ 1, జీ.సీ 2, జీ.సి 3 ఆశ్రమాలలో దర్యాప్తు జరుగుతోంది. కాగా దాడులు సమయంలో కల్కి భగవాన్‌, ఆయన సతీమణి పద్మావతి కానీ అందుబాటులో లేరు. గోవర్దనపురంలో నివసిస్తున్న కల్కి భగవాన్‌ కుమారుడు కృష్ణాజీ, కోడలు పిత్రాజీ, సహాయ కార్యదర్శి లోకేష్‌ దాసాజీలను వేర్వేరు గదుల్లో ఉంచి విచారించారు.కల్కి ఆశ్రమాల్లోకి మీడియా ప్రతినిధులకు అనుమతి నిరాకరించారు.

చెన్నై గ్రీమ్స్‌రోడ్డులోని కల్కి ఆశ్రమంలోనూ తనిఖీలు జరిగాయి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం వద్ద ఉన్న సత్యలోకం ఆశ్రమంలో ఐటీ దాడులు జరిగాయి. కల్కి ఆశ్రమం స్థాపించినప్పటి నుంచి నేటి వరకు భూముల కొనుగోళ్లు, విదేశీ పెట్టుబడులు, ఆశ్రమానికి భక్తులు ఇచ్చిన విరాళాలు, ఆధ్యాత్మిక శిక్షణ తరగతుల పేరిట సాగించిన వసూళ్లు, గ్రామాల అభివృద్ధి పేరుతో చేసిన వసూళ్లు వంటి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిసింది. ఐటీ దాడుల సమయంలో కల్కి భగవాన్, అమ్మ భగవాన్‌ అందుబాటులో లేరు. రూ.100 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు అందిన సమాచారం మేరకే ఐటీ అధికారులు ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది.

విజయ్‌ కుమార్‌ నాయుడు అలియాస్‌ కల్కి భగవాన్‌ తొలినాళ్లలో ఎల్‌ఐసీ ఏజెంట్‌గా జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి ఓ విద్యాసంస్థను నెలకొల్పారు. అది కాస్తా దివాళా తీయడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విష్ణుమూర్తి పదో అవతారం కల్కి భగవాన్‌గా చెప్పుకుంటూ 1989లో చిత్తూరు జిల్లాలో ప్రత్యక్షమయ్యారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో అతిపెద్ద ఆశ్రమం స్థాపించారు. విజయ్‌కుమార్‌ నాయుడు సతీమణి బుజ్జమ్మ అమ్మ భగవాన్‌గా పేరు మార్చుకున్నారు. వీరిద్దరినీ దర్శనం చేసుకునేందుకు వచ్చే భక్తుల నుంచి భారీస్థాయిలో ప్రవేశ రుసుము వసూలు చేసేవారు. గతంలో కూడా కల్కి భగవాన్‌ ఆశ్రమంలో జరుగుతున్న వ్యవహారాలపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఆశ్రమంలో భక్తులకు మత్తు పదార్థాలు ఇచ్చి వారిని మత్తులో ఉండేలా చేయడంతో పాటు, లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. 2008లో చిత్తూరు జిల్లాలోని కల్కి ఆశ్రమంలో జరిగిన తొక్కిసలాటలో అయిదుగురు మృతి చెందగా, అనేకమంది గాయపడ్డారు. దీంతో కొద్దిరోజులు ఆశ్రమం మూసివేశారు.

ఆ తర్వాత ఆశ్రమ కార్యాకలాపాలను ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడుకు విస్తరించారు. కల‍్కి భగవాన్‌ తనతో పాటు భార్య పద్మావతిని దైవాంశ స్వరూపులుగా చెప్పుకునేవారు. వీరి ఆశ్రమానికి దేశంలోని ధనవంతులే కాకుండా విదేశీయులు, ఎన్నారైలు క్యూ కట్టేవారు. కల్కి భగవాన్‌ సాధారణ దర్శనానికి రూ.5వేలు, ప్రత్యేక దర్శనం కావాలంటే రూ.25 వేలు చెల్లించుకోవాల్సిందే. ఇక కల్కి భగవాన్‌పై అనేక ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఆయనతో పాటు కల్కి కుమారుడు కృష్ణాజీ కూడా పెద్ద ఎత్తున భూములు ఆక్రమించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నట్లు ఫిర్యాదుతో 2010లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here