చంద్రభాగ మెరైన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్-ఇన్-ఛార్జ్ (ఐఐసి) ఒక క్రిమినల్‌తో సెల్ఫీ తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఉద్యోగం ఊడిపోయే పరిస్థితి వచ్చింది. ఇన్స్పెక్టర్-ఇన్-ఛార్జ్ (ఐఐసి) బులు ముండా నిన్న హత్య నిందితుడు రాధా మోహన్ బిస్వాల్ అలియాస్ మున్నాను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళుతూ జీపులో సరదాగా క్రిమినల్‌తో సెల్ఫీ ని దిగాడు. తరువాత ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇంకేముందు ఆ ఫోటోలు కాస్తా వైరల్ అయ్యాయి.
హంతకుడితో సెల్ఫీ దిగిన ఇన్స్పెక్టర్
వివరాల్లోకి వెళితే ఒడిశాలోని పూరి జిల్లాలోని అలసాహి ప్రాతంలో ఓ హత్య జరిగింది. అస్తరంగ పోలీస్ స్టేషన్ పరిధిలోని అలసాహిలో దిలీప్ స్వైన్ అనే వ్యక్తి హత్య కేసులో మోహన్ బిస్వాల్ ప్రధాన నిందితుడు, కన్న తండ్రి ముందే దిలీప్ ని హత్య చేసాడు. ఇందులో మరో ఇద్దరు వ్యక్తులు కూడా గాయపడ్డారు. ఈ హత్య అక్టోబర్ 5 న జరిగింది. అప్పటి నుండి అతను పరారీలో ఉన్నాడు.
అయితే ముండా తీసిన సెల్ఫీ లో బిస్వాల్ సన్ గ్లాసెస్ ధరించి ఉన్నట్లు తెలుస్తుంది, నిందితులను బేడీలు లేకుండా పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళినట్లు అర్థమవుతుంది. చివరకు ఆ ఫోటోలు జిల్లా ఎస్పీ దాకా చేరడంతో పోలీసు అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బులు ముండాను జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి బదిలీ చేశారు. అయితే, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడని ఇన్స్పెక్టర్ బులు ముండాని మంగళవారం సాయంత్రం సస్పెండ్ చేశామని, క్రమశిక్షణా చర్యల్లో భాగంగా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి” అని పూరి పోలీసు సూపరింటెండెంట్ ఉమాశంకర్ దాస్ తెలిపారు.