ఇన్నాళ్లూ హీరోగానే మనల్ని అలరించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు నిర్మాతగా మారిపోయాడు. కింగ్ ఆఫ్ ది హిల్ పేరిట నిర్మాణ సంస్థను స్థాపించి అందులో మీకు మాత్రమే చెప్తా అంటూ ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. ఏ సందడి లేకుండా ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది కూడా. పెళ్లి చూపులు సినిమాతో తనకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను ఈ సినిమాతో పూర్తిస్థాయి హీరోగా మార్చేసాడు విజయ్. అవంతికా మిశ్రా కథానాయికగా నటిస్తుంది. కొత్త దర్శకుడు షమీర్ సుల్తాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ అదిరిపోయింది. ఇప్పుడు ట్రైలర్ కూడా అదే స్థాయిలో ఆసక్తికరంగా, వినోదాత్మకంగా ఉంది.
మహేష్ బాబు చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇది చూసిన తర్వాత సూపర్ స్టార్ కూడా సూపర్ అంటూ మెచ్చుకున్నాడు. యువ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ అని మహేశ్ బాబు ట్వీట్ చేశాడు.
Interesting and fun trailer! I wish the young team all the best 🙂 Congratulations on your production debut @TheDeverakonda#MeekuMaathrameCheptha https://t.co/smbCVfDFTU
— Mahesh Babu (@urstrulyMahesh) October 16, 2019
‘మన లైఫ్ మన చేతులో ఉందో లేదో గానీ, మనందరి చేతిలో ఖచ్చితంగా ఫోన్ ఉంటుంది’ అంటూ వెన్నెల కిశోర్ చెప్పే డైలాగ్స్ తో ప్రారంభమయ్యే ట్రైలర్ వినోదాత్మకంగా..కొద్దిగా సస్పెన్స్ గా సాగుతుంది. తరుణ్ భాస్కర్ న్యూలుక్ లో మెస్మరైజ్ చేస్తున్నాడు. ట్రైలర్ చూస్తుంటే అభిమానులకు మంచి వినోదాన్ని అందించడం ఖాయమనిపిస్తోంది. ట్రైలర్ అంతా కామెడీగానే సాగిపోయింది. ఫోన్‌లో పర్సనల్ విషయాలు ఉంటాయి.. అందులో ఏధైనా ఉండకూడని వీడియో ఉంటే.. అది ఎక్కడ బయటికి వెళ్లిపోతుందో అనే టెన్షన్ ఉంటుంది కదా.. దాన్ని పట్టుకుని కథగా మలుచుకున్నాడు షమీర్.
ట్రైలర్ అంతా కూడా ఇదే చూపించాడు. తరుణ్ భాస్కర్ ఓ చిన్న తప్పు చేసి.. ఎక్కడ దొరికిపోతానో అనే కంగారులోనే ట్రైలర్ అంతా కనిపిస్తున్నాడు. పైగా మనోడు యాక్టింగ్ ఇరగదీసాడు కూడా. ఈ సినిమాలో జబర్దస్త్ యాంకర్ అనసూయ , అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాను నవంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. మరి హీరోగా సంచలనాలు సృష్టించిన విజయ్ దేవరకొండ.. నిర్మాతగా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.