(ప్రజాలక్ష్యం డెస్క్)
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం “ఆరోగ్యం అంటే శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధి అంశాలలో పరిపూర్ణంగా ఉండి, ఎటువంటి రుగ్మతలు లేకుండా ఉండటం” మరి ఈ నిర్వచనం ప్రకారం చూస్తే, మన దేశ 130 కోట్ల జనాభాలో సగానికి పైగా జనాభా సంపూర్ణ ఆరోగ్యంతో (జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 నివేదిక ప్రకారం) లేరనే చెప్పవచ్చు. ఇందుకు ముఖ్య కారణం దేశ ప్రజలు సరైన పౌష్టికాహారాన్ని తీసుకోకపోవటమే. కొవిడ్-19 వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రతి రోజు వందల కొలది ప్రజలు మరణిస్తున్న ఈ తరుణంలో “పౌష్టికాహారం” తీసుకోవలసిన ఆవశ్యకత మరింత పెరిగింది. ముఖ్యంగా కరోనా వైరస్ ను ఎదుర్కోవటానికి శరీరంలో “వ్యాధి నిరోధక శక్తిని” పెంచుకోవటమే దివ్య ఔషధమని, వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే బలవర్ధక సమతుల ఆహారం తీసుకోవటం ఒక్కటే మార్గం అని ఐ.సి.ఎమ్.ఆర్. చెబుతోంధి. ‘‘ఈ రోజు నా పళ్ళెంలో’’ (‘మై ప్లేట్ ఫర్ ది డే’) పేరుతో ప్రజలు ఏ ఆహారాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి, దానివల్ల ఎన్ని కేలరీల శక్తి వస్తుందనే వివరాలను కూడా వెల్లడించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 30వ తేదీన ఆకాశవాణిలో వచ్చే ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడుతూ పౌష్టికాహార ప్రాధాన్యతను గురించి వివరించారు. ‘‘ఆహారాన్ని బట్టి మన మానసిక, భౌతిక వికాసం ఉంటుంది. విభిన్న రంగాల్లో పిల్లల శక్తి సామర్ధ్యాల ప్రదర్శనలో పౌష్టికాహారానిది ప్రధాన పాత్ర. గర్భంలో ఉన్నప్పటి నుంచి అందిన పోషకాహారాన్ని బట్టే చిన్నారుల్లో మానసిక వికాసం, ఆరోగ్యం ఉంటాయి. తల్లికి మంచి పౌష్టికాహారం లభించడం కూడా పిల్లలకు ముఖ్యమే. పోషకాహార ఉద్యమంలో ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని ప్రధాన మంత్రి అన్నారు. పోషకాహార మాసోత్సవం సందర్భంగా సెప్టెంబర్ నెలలో ‘మై గవ్ పోర్టల్‘ ద్వారా ఈ అంశం పై క్విజ్, మీమ్ పోటీ నిర్వహిస్తామని తెలిపారు. ఇంకా విశాల భారత్ లో విభిన్న ప్రాంతాల్లో తీసుకొనే ఆహారంలో ఎన్నో వైవిధ్యాలు ఉన్నాయి. సీజన్ ను బట్టి ఆయా ప్రాంతాల్లో పండే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహార వస్తువులతో పౌష్టికాహార ప్రణాళికను రూపొందిస్తున్నామని, దేశంలోని ఏయే జిల్లాల్లో ఏయే పంటలు పండిస్తున్నారని, వాటి పౌష్టికాహార విలువ ఎంత అన్న సంపూర్ణ సమాచారాన్ని అందించేలా భారతీయ ‘వ్యవసాయ కోశాన్ని’ తయారు చేస్తున్నామని ప్రధాన మంత్రి ‘మన్ కీ బాత్’ లో వివరించారు.
కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కూడా దేశవ్యాప్తంగా ప్రజలలో ముఖ్యంగా జనాభాలో 70 శాతం పైగా ఉన్న మహిళలు, చిన్నారులకు ఉచితంగా పౌష్టికాహారాన్ని ప్రాథమిక వైద్య, ఆరోగ్య సేవలు అందించి, వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేలా చూసేందుకు అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తోంది. ఇంకా పౌష్టికాహారం పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో “జాతీయ పౌష్టికాహార మాసోత్సవాలు” పెద్ద ఎత్తున (రాష్ట్రీయ పోషక్ మహా) నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పౌష్టికాహారం ప్రాధాన్యత, ఈ సమస్య నివారణకు ప్రభుత్వం అమలు పరుస్తున్న వివిధ పథకాల గురించి తెలుసుకుందాం.
పోషణ్ అభియాన్
నాల్గవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015-16లో రూపొందించిన నివేదిక ప్రకారం పౌష్టికాహార లోపం కారణంగానే తక్కువ బరువుతో శిశువులు జన్మిస్తున్నారని, ఆరేళ్ళలోపు చిన్నారులలో ఎదుగుదల సరిగా ఉండటం లేదని, మహిళలు, కిశోర బాలికలలో చిన్నారులలో రక్తహీనత సమస్య అధికంగా ఉన్న మూలంగా శిశు, మాతృ మరణాలు సంభవిస్తున్నాయని భావించి, ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం, ‘‘జాతీయ న్యూట్రిషన్ మిషన్’’(పోషణ్ అభియాన్) ను ప్రారంభించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్ రాష్ట్రంలోని ఝుంఝుహ్ను లో 2018 మార్చి 8 వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున “పోషణ్ అభియాన్” పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రస్తుతం ఉన్న పౌష్టికాహార పథకాలను సమీక్షించి మరింత పటిష్టంగా మిషన్ మోడ్ లో వీటిని అమలుచేసి, భావి భారత పౌరులైన ఆరేళ్ళలోపు చిన్నారులు, గర్భవతులు, బాలింతలలో పోషకాహార లోపం సమస్యను 2022 నాటికి గణనీయంగా తగ్గించాలని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆరేళ్ళలోపు పిల్లలలో వయస్సుకు తగిన ఎత్తు, బరువు లేకపోవటం సమస్యను మూడేళ్ళలో ఏడాదికి రెండు శాతం చొప్పున ఆరు శాతానికి తగ్గించాలని, (ప్రస్తుతం 38 శాతం ఉంది) 6-59 నెలల మధ్య వయస్సు గల పిల్లల్లో ప్రస్తుతం ఉన్న 59 శాతం, 15-49 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళల్లో ప్రస్తుతం ఉన్న 59 శాతం, కిశోర బాలికలలో రక్త హీనత సమస్యను ప్రస్తుతం ఉన్న 49 శాతాన్ని సంవత్సరానికి 3 శాతం చొప్పున 9 శాతానికి తగ్గించటం, పుట్టిన వెంటనే కనీస బరువు కంటే తక్కువ బరువు ఉన్న (2.5 కిలోల కంటె తక్కువ) శిశివుల జననాలను ప్రస్తుతం వున్న 36 శాతం నుంచి 32 శాతానికి (ఏడాదికి 2 శాతం) తగ్గించటం, ఆరేళ్ళలోపు పిల్లలలో వయస్సుకు తగిన ఎత్తు పెరగకపోవటం లోపాన్ని ప్రస్తుతం ఉన్న 38.4 శాతం నుంచి 2022 నాటికి 25 శాతానికి తగ్గించటం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు. ఈ పథకానికి మూడేళ్ళ కాలంలో రూ. 9046.17 కోట్లు వ్యయం చేయనున్నారు. ఈ పథకం ద్వారా సుమారు పది కోట్ల మంది చిన్నారులు, మహిళలకు లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా శిశువులు జన్మించిన దగ్గర నుంచి మొదటి వెయ్యి రోజులలో తగిన పౌష్టికాహారం, టీకాలు, ఆరోగ్య పరీక్షలు నిర్వహించి చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంగా ఎదిగేందుకు ఈ పథకం ద్వారా ప్రత్యేక చర్యలు చేపడతారు. ప్రస్తుతం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, విద్యా శాఖ, త్రాగునీరు, పారిశుధ్య శాఖ,గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు అమలుచేస్తున్న ‘స్వచ్ఛ భారత్ మిషన్’, సార్వత్రిక టీకాల కార్యక్రమం, పి.ఎం. మాతృవందన యోజన, మధ్యాహ్న భోజన పథకం, నరెగా, నులి పురుగుల నివారణ పథకాలతో సమన్వయం చేసుకొంటూ, పోషణ అభియాన్ ను అమలు చేస్తారు. తొలుత 315 జిల్లాల్లో2018లో ప్రారంభించిన ఈ పథకాన్ని ప్రస్తుతం అన్ని జిల్లాలకు విస్తరించారు. ప్రధానంగా పౌష్టికాహారం పై స్థానిక ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు “జన్ ఆందోళన్” పేరిట అంగన్‌వాడీ టీచర్లు నెలకు కనీసం రెండుసార్లు సామాజిక కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ పథకం ప్రారంభించక ముందు ప్రతి అంగన్‌వాడి టీచరు ఉపయోగించే రిజిస్టర్ల బరువు సుమారు 8.2 కిలోలు ఉంది. దీనిని గణనీయంగా తగ్గించారు. మొత్తం రిజిస్టర్స్ రాసే పద్ధతికి స్వస్తి పలికి అందరికీ స్మార్ట్ ఫోన్లు అందజేసి, వాటి ద్వారా సమాచారాన్ని పంపించే ఏర్పాటుచేశారు. ఇందుకుగాను ‘‘కామన్ అప్లికేషన్ సాఫ్ట్ వేర్ (సిఎఎస్)’’ను రూపొందించారు. గత ఏడాది డిసెంబర్ ఆఖరుకు 6.08 లక్షల అంగన్‌వాడి టీచర్లు తమ కార్యకలాపాల నివేదికలను సిఎఎస్ ద్వారా అప్‌లోడ్ చేశారు. ఐసిడిఎస్ అధికారులు, సిబ్బందిని ప్రోత్సహించేందుకుగాను గత ఏడాది మొత్తం రూ. 22 కోట్ల విలువైన 363 పోషణ్ అభియాన్ అవార్డులు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అందజేసింది. గత ఏడాది డిసెంబర్ ఆఖరు నాటికి ఈ పథకం అమలుకు రూ. 4283.90 కోట్లు వ్యయం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 3700 కోట్లను కేటాయించారు.
సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసిడిఎస్)
ప్రపంచంలోనే అతి పెద్దదైన ఐసిడిఎస్ పథకాన్ని నాలుగున్నర దశాబ్దాల కిందట 1975 అక్టోబర్ 2వ తేదీ గాంధీ మహాత్ముని జయంతి రోజున మన దేశంలో ప్రారంభించారు. తొలుత 33 ఐసిడిఎస్ ప్రాజెక్టులతో 4891 అంగన్‌వాడీ కేంద్రాలను ప్రారంభించారు. గత ఏడాది నవంబరు ఆఖరుకు దేశవ్యాప్తంగా7075 ఐసిడిఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి ఆధీనంలో 13,77,995 అంగన్‌వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయి. మొత్తం 11 కోట్ల 41 లక్షల 34 వేల మంది ఆరేళ్ళ లోపు చిన్నారులు, గర్భవతులు, బాలింతలకు ప్రతి రోజు పౌష్టికాహారం అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 149 ఐసిడిఎస్ ప్రాజెక్టుల ఆధీనంలో 31,711 అంగన్‌వాడీ కేంద్రాలు, 3869 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల ద్వారా ప్రతి రోజు 13,95,566 ఆరేళ్ళలోపు చిన్నారులకు, 3,38,202 గర్భవతులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రంలో ఇవే కాకుండా, ‘ఆరోగ్య లక్ష్మి’ పథకం ద్వారా గర్భవతులు, బాలింతలకు ప్రతి రోజూ మధ్యాహ్నం ఒక పూట భోజనం అంగన్ వాడీ కేంద్రంలోనే పెడుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మొత్తం ఆరు రకాల సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా గర్భవతులు, బాలింతలు, ఆరేళ్ళలోపు చిన్నారులకు అదనపు పోషకాహారం అందిస్తారు. 3-6 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను బోధిస్తారు. ఈ పథకం అమలుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2020-21) లో కేంద్ర ప్రభుత్వం రూ. 20,532.38 కోట్లు కేటాయించింది.
కిశోర బాలికల పథకం
రేపటి తల్లులైన కిశోర బాలికలలో పోషకాహార లోపం సమస్య నివారణకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తుంది. ఎన్.ఎఫ్.హెచ్.ఎస్-4 సర్వే నివేదిక ప్రకారం దేశంలో 11-14 సంవత్సరాల వయస్సులో అమ్మాయిలలో 43 శాతం మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. దేశంలో మాతృ మరణాల రేటు నేటికి 122 (లక్ష జననాల్లో ప్రసవించే సమయంలో మరణించే మహిళలు) ఉండటానికి కిశోర బాలికలలో రక్త హీనత సమస్య కూడా ఒక ముఖ్య కారణం. రేపటి తల్లుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 2010-11 నుంచే దేశంలో కిశోర బాలికలకు అదనపు పోషకాహారాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. తొలుత 205 జిల్లాల్లో ప్రారంభించిన ఈ పథకాన్ని 2018-19లో అన్ని జిల్లాలకు విస్తరించారు. ముఖ్యంగా కిశోర బాలికలకు అదనపు పౌష్టికాహారం అందించి మానసికంగా ఎదుగుదలతోపాటు, ఆహార అలవాట్లు, పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు, ఈ వయస్సులో వచ్చే భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలి, సమాజంలో, కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎలా పరిష్కరించుకోవాలని, వివిధ ప్రభుత్వ విభాగాలు అందిస్తున్న సేవలను ఎలా వినియోగించుకోవాలి, విద్య ఆవశ్యకత, ప్రాముఖ్యత తదితర విషయాల పట్ల కిశోర బాలికలకు అవగాహన కల్పించటం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం.. దేశవ్యాప్తంగా 2017-18లో 89.54 లక్షల కిశోర బాలికలు పౌష్టికాహార పథకం ద్వారా ప్రయోజనం పొందారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అమలుకు 2017-18 లో రూ. 450.94 కోట్లు వ్యయం చేసింది.
మధ్యాహ్న భోజన పథకం
విద్యార్థులకు అదనపు పౌష్టికాహారాన్ని అందించి మధ్యలో పాఠశాల మానేయకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం రెండున్నర దశాబ్దాల కిందట1995 ఆగస్టు 15వ తేదీన మధ్యాహ్న భోజన పథకాన్ని దేశవ్యాప్తంగా 2408 బ్లాక్స్ లో ప్రారంభించింది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఒక్కో విద్యార్థికి రూ. 4.97 లు, ఉన్నత పాఠశాల విద్యార్థులకు రూ. 7.45లు చొప్పున ఖర్చు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా 11.59 కోట్ల మంది విద్యార్థులకు సంవత్సరానికి 200 రోజులు అదనపు పౌష్టికాహారాన్ని, మధ్యాహ్న భోజనం రూపంలో అందజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి, గత ఆర్థిక సంవత్సరంలో రూ. 11 వేల కోట్ల వ్యయం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఈ పథకం అమలుకు రూ. 12,054 కేటాయించగా, ఇప్పటికే రూ. 2566.93 కోట్లు రాష్ట్రాలకు విడుదల చేసింది.
ఆహారంతో ఆరోగ్యం
ప్రభుత్వం పౌష్టికాహార లోప సమస్య నివారణకు ఎన్ని పథకాలు అమలుచేస్తున్నా ఆహార నియమాలు, పౌష్టికాహారం పట్ల ప్రజల్లో అవగాహన వచ్చినప్పుడే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ప్రజల ఆహారపు అలవాట్లు, జీవనశైలి సక్రమంగా లేని ఫలితంగా ఓవైపు రక్తహీనత లాంటి సమస్యలు, మరోవైపున అధిక బరువు/ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. దేశంలో 21 శాతం మహిళలు, 19 శాతం పురుషులు అధిక బరువు/ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారని ఎన్.ఎఫ్.హెచ్.ఎస్-4 సర్వే నివేదిక చెబుతోంది. మన రాష్ట్రంలో 19 శాతం మహిళలు, 12.1 శాతం పురుషులు ఈ అధిక బరువు సమస్య కారణంగా జీవనశైలి వ్యాధులైన సుగర్, బి.పి, కేన్సర్, బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం)లకు గురవుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఆరోగ్యంపట్ల ఆందోళన చెందుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలంతా తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలని ఐ.సి.ఎం.ఆర్ చెబుతోంది. ఐ.సి.ఎం.ఆర్ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం మనం ‘ప్రతి రోజూ పళ్ళెంలో’ చిరుధాన్యాలు 270 గ్రాములు (20 గ్రాముల ప్రొటీన్లు), పప్పుదినుసులు 90 గ్రాములు (ప్రొటీన్లు 21 గ్రాములు), పాలు, పెరుగు 300 గ్రాములు (ప్రొటీన్లు 10 గ్రాములు), కూరగాయలు 300 గ్రాములు (ప్రొటీన్లు 4 గ్రాములు), పండ్లు 100 గ్రాములు (ప్రొటీన్లు 1 శాతం) ఎండు ఫలాలు (ప్రొటీన్లు 4 గ్రాములు), కొవ్వు, నూనెలు 27 గ్రాములు ఉండే విధంగా చూసుకోవాలి. దీనివల్ల శరీరానికి సమతుల ఆహారం అంది, రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లను తట్టుకునే సామర్ధ్యం వృద్ధి చెందుతుంది. మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని సహజసిద్ధంగా ఆహారం ద్వారా పెంచుకోవటం ఒక్కటే ఈ వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకునే ఏకైక మార్గం. మన శరీరంలో తెల్ల, ఎర్ర రక్తకణాలు ఉంటాయి. ఎర్ర రక్తకణాలు మన శరీరంలో శక్తిని (హిమోగ్లోబిన్) అందిస్తాయి. తెల్ల రక్తకణాలు శరీరంలోకి ఎటువంటి వైరస్‌లు, బాక్టీరియా ప్రవేశించి అనారోగ్యానికి గురిచేయకుండా నిరంతరం రక్షణ కవచంలా పని చేస్తాయి. మనం బలవర్ధక, సమతుల ఆహారం తీసుకొనటం ద్వారా తెల్ల రక్తకణాలు బాగా వృద్ధి చెంది, రోగ నిరోధక వ్యవస్థ బలపడి,కరోనా వైరస్ నుంచి రక్షించుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇంకా మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను సహజసిద్ధంగా పెంచుకునేందుకు ప్రతి రోజూ కనీసం అరగంట అయినా శారీరక వ్యాయామంతో పాటు, అన్ని పోషక విలువలు గల ఆహారం అంటే కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు,జింక్, కాల్షియం, పొటాషియం, సిలీనియం, ఫోలిక్ యాసిడ్ లాంటి సూక్ష్మ పోషక పదార్థాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు ప్రతి రోజూ తీసుకోవాలని ఐ.సి.ఎం.ఆర్ సూచిస్తోంది. ప్రతి రోజూ యోగా, ప్రాణాయామం చేయటం ద్వారా శరీరంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. అన్ని అవయవాలకు రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. అలాగే, బియ్యం, గోధుమలతోపాటు, మొక్కజొన్న, జొన్నలు, సజ్జలు, రాగులు లాంటి తృణ ధాన్యాలు కూడా తరచూ తీసుకొంటూ ఉండాలి. బియ్యం, గోధుమలకు ప్రత్యామ్నాయంగా కొర్రలు, సామలు, ఆండుకొర్రలు, ఊదలు, అరికలు లాంటి సిరి ధాన్యాలను తీసుకునేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. పొట్టులేని ఈ ధాన్యాల వలన శరీరానికి తగిన శక్తిని ఇవ్వటమే కాకుండా, పీచు శాతం ఎక్కువ ఉండటం మూలంగా త్వరగా జీర్ణం అవుతాయి. అంతేకాకుండా, అనేక సూక్ష్మ పోషక పదార్థాలు శరీరానికి అందుతాయి. దీర్ఘకాలంలో జీవనశైలి వ్యాధులు రాకుండా చేస్తాయి. రోజుకు కనీసం 8 గ్లాసుల పరిశుభ్రమైన గోరువెచ్చని వేడి నీరు త్రాగటం అలవాటు చేసుకోవాలి. శరీరానికి ఎండ తగిలేలా ఉదయం లేదా సాయంత్రం కనీసం అరగంట అయినా నడవటం వలన ‘డి విటమిన్’ లభిస్తుంది. ఉప్పు వాడకం బాగా తగ్గించాలి. వంట నూనెలను తరచూ మారుస్తూ ఉండాలి. ‘సి విటమిన్’ ఎక్కువగా ఉండే నిమ్మ, నారింజ, బత్తాయి, కమలా ఫలం, జామ లాంటి పండ్లలో ఏదో ఒకటి ప్రతి రోజూ తినాలి. అన్నింటికీమించి మద్యపానం, ధూమపానం, గుట్కా నమలటం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. పైన పేర్కొన్న విధంగా రోజూ మంచి పౌష్టికాహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేస్తూ ఉంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వలన ఒక్క కరోనానే కాదు ఏ అనారోగ్యాలు మన దరి చేరవు. మన ఆరోగ్యం మన చేతలలోనే ఉంది. మనం (ప్రజలు) ఆరోగ్యంగా ఉంటేనే విధులను సక్రమంగా నిర్వహించగలం. ఉత్పాదక కార్యకలాపాలలో పాల్గొనగలం. దేశ ప్రగతికి మన వంతు సహకారాన్ని అందించగలం. కొవిడ్-19 వైరస్ విజృంభిస్తున్న ఈ తరుణంలో ఆహారానికి మించిన ఔషదం లేదని ప్రజలంతా గుర్తించాలి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నట్లు ప్రతి రోజూ పౌష్టికాహారాన్ని తీసుకుంటూ, శరీరంలో రోగనిరోధక వ్యవస్థను పెంచుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆశిద్దాం.
(జాతీయ పౌష్టికాహార మాసోత్సవాల సందర్భంగా)