– ఎల్‌ఆర్‌ఎస్‌ను వెంటనే రద్దుచేయాలి…
– జీవో 135ను ఉపసంహరించుకోవాలి…
– కమిషనర్ ఉదయ్‌కుమార్‌కు సీపీఐ వినతిపత్రం
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 6: తెలంగాణ రాష్ట్రంలో రజాకార్ల తరహాలో పాలన కొనసాగుందని, రోజుకో జీవో విడుదల చేస్తూ పేద, మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పాలు చేస్తున్నారని సిపిఐ నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ ఆరోపించారు. రామగుండం నగర కమిటి ఆధ్వర్యంలో ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్గుచేయాలని కోరుతూ మంగళవారం రామగుండం కార్పోరేషన్ కమిషనర్ ఉదయ్ కుమార్‌కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం మద్దెల దినేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌అర్‌ఎస్ పేరుతో రోజుకో జీవో తీసుకవచ్చి పేద ప్రజల పై బారం మోపుతున్నరని, నూతనంగా తెచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేసారు.
ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం అంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) సామాన్య ప్రజలకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్రమబద్ధీకరణ చేసుకోకుంటే రిజిస్ట్రేషన్లు చేయబోమని, నల్లా, డ్రయినేజీ కనెక్షన్లు, రోడ్స్ తదితర సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలు సామాన్య ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చెందుతున్నారని పేర్కొన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో ప్రభత్వం తన ఖాజానాను నింపుకోవాలని చూస్తుందన్నారు.
ప్రభుత్వం మొదట తీసుకువచ్చిన 131, ఆ తరవాత ప్రజా ఆందోళనలు, ప్రజా వ్యతిరేకతతో, సీపీఐ పోరాట ఫలితంగా ప్రభుత్వం వెనక్కు తగ్గి మరో జీవో 135 విడుదల చేసింది. నామ మాత్రపు ఛార్జీలు ఉంటాయి అని గొప్పలు చెప్పుకుంటూ హుటా హుటిన విడుదల చేసిన ఈ జీవోతో ప్రజల నడ్డివిరుస్తున్నారని ఆరోపించారు.
పైసా పైసా, కూడపెట్టుకొని పేద, మధ్యతరగతి ప్రజలు తమ పిల్లల భవిష్యత్ కోసం కొద్దిపాటి ఆర్థిక స్థోమతతో ప్లాట్లు కొనుగోలు చేస్తే కనీసం ఇండ్లు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటికే రిజిస్టర్ అయిన భవనాలు, స్థలాల అమ్మకాలు, కొనుగోలు పూర్తిగా ఆగిపోయాయన్నారు. కరోనా తాకిడి, లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆదాయం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో ప్రజలపై విపరీతమైన భారం మోపడం శోచనీయమన్నారు. ప్రభుత్వం వెంటనే 135 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అనధికారికంగా ఏర్పడుతున్న కొత్త లేఅవుట్లు, కొత్త ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా నిరాకరించాలి తప్ప ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన వాటిని అడ్డుకోవడం అభివృద్ధి నిరోధకం అవుతుందని తెలిపారు. పాత లేఅవుట్లు, ప్లాట్లపై ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో వేలు, లక్షల రూపాయల ఫెనాల్టీలు విధించడంతో ప్రజలపై పెనుభారం పడుతుందని, ఇది భరించే స్థితిలో ప్రజలు లేరన్నారు. ఇప్పటికే రిజిస్టర్ అయిన భవనాలు, ఫ్లాట్ల అమ్మకాలు, కొనుగోలు చేసుకునేలా రిజిస్ట్రేషన్లకు అనుమతించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ నగర సహాయ కార్యదర్శి తలపల్లి మల్లయ్య, నాయకులు కందుకూరి రాజారత్నం, టి.రమేష్ కుమార్, రేనికుంట్ల ప్రీతం, కుమార్, తదితరులు పాల్గొన్నారు.