– గోదావరినది తీరంలో ఉజ్వల పార్కు ఏర్పాటు చేయండి
– ‘ఖని’లో అర్బన్ మండలం ఏర్పాటు చేయండి
– ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కోరిన ఎమ్మెల్యే చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్ 25: రామగుండం జేన్‌కో స్థలాల్లో గత 50 సంవత్సరాలుగా నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న వారి నివాసాల స్థలాలను క్రమబద్దీకరించి పట్టాలు మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. గురువారం హైదరాబాద్ ప్రగతిభవన్‌లో జరిగిన శాసన సభ్యుల సమీక్ష సమావేశంలో రామగుండం శాసన సభ్యునిగా సిఎం కేసీఆర్ నియోజకవర్గ పలు సమస్యలపై వినతులు అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా తీసుకువస్తున్న ధరణి పోర్టల్‌లో భూముల వివరాలను ఆలైన్ ద్వారా పొందుపరుస్తున్న నేపద్యంలో సింగరేణి స్థలాల్లో నివాసాల క్రమబద్దీకరణ కోసం 76జివో విడుదల చేసి క్రమ బద్దీకరణ చేసిన మాదిరిగా రామగుండం జేన్‌కో స్థలాల్లోని 1, 20, 21 డివిజన్లలోని 2000 వేల నివాసాలను క్రమబద్దీకరణ చేస్తే ఇక్కడి ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
రామగుండం తహశీల్ కార్యాలయం గోదావరిఖని, 8వ కాలనీ, అల్లూరు, మారెడుపాక గ్రామాలకు దూరంగా ఉండటం మూలంగా ప్రజలకు ఇబ్బందిపడుతున్నారని, గోదావరిఖని, 8వ కాలనీలను కలుపుకుని గోదావరిఖని అర్భన్ తహశీల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు.
కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరినది నిండుకుండలాగా మారిన నేపద్యంలో గోదావరినది తీరం టూరిజం అభివద్ధి జరుగుతుందని, గోదావరిఖని ప్రజానీకం అహ్లాదకరంగా గడిపేందుకు గోదావరినది తీరంలో కరీంనగర్ మాదిరిగా ఉజ్వల పార్కును నిర్మాంచాలని కోరారు. రామగుండం ఎమ్మెల్యే తన జన్మదినం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులను తీసుకున్నారు.